Gold Saree: సిరిసిల్ల చేనేత కళాకారుడి అద్భుతం - 200 గ్రాముల బంగారంతో చీర, ధర ఎంతంటే?
Siricilla News: సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు అద్భుతం ఆవిష్కరించారు. 200 గ్రాముల బంగారంతో చీరను తయారు చేసి ఔరా అనిపించుకున్నారు. దీన్ని తయారు చేసేందుకు రూ.18 లక్షలు ఖర్చైందని తెలిపారు.
Siricilla Nethanna Made Saree With 200 Grams Gold: రాజన్న సిరిసిల్ల జిల్లాకు (Siricilla District) చెందిన ఓ చేనేత కళాకారుడు అద్భుతం చేశాడు. 200 గ్రాముల బంగారంతో చీరను తయారు చేసి అద్భుత కళాకృతిని ఆవిష్కరించాడు. సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ బంగారు చీరను తయారు చేసి రికార్డు సృష్టించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త 200 గ్రాముల బంగారంతో చీర తయారు చేయాలని కోరగా.. అందుకు అనుగుణంగా తన ప్రతిభను చాటారు. ఈ చీరను తయారు చేసేందుకు 6 నెలల క్రితమే ఆర్డర్ తీసుకున్నానని విజయ్ కుమార్ తెలిపారు. బంగారాన్ని జరి తీయడానికి కొత్త డిజైన్ తయారు చేయడానికి 10 నుంచి 12 రోజులు పట్టింది. ఈ చీర 49 ఇంచుల వెడల్పు, ఐదున్నర మీటర్ల పొడవు, బరువు 800 నుంచి 900 గ్రాములు ఉంటుందన్నారు. అక్టోబర్ 17వ తేదీన తన కుమార్తె వివాహానికి ఆ వ్యాపారవేత్త ఈ చీరను తయారు చేయిస్తున్నట్లు చెప్పారు. దీన్ని తయారు చేసేందుకు రూ.18 లక్షలు ఖర్చైందని.. బంగారంతో చీర తయారు చేయడం తనకెంతో సంతోషంగా ఉందని విజయ్ తెలిపారు.