Lantana Camara Plant : సైంటిస్టులను భయపెడుతోన్న తలంబ్రాలు చెట్టు
Lantana Camara Plant : చూడడానికి ఎంతో అందంగా ఉండే పులి కంప పొదలు ప్రమాదమే అంటున్నారు పరిశోధకలు. ఎక్కడో అమెరికాలో పుట్టిన పులికంప ఇప్పుడు 50 దేశాలకు పైగా విస్తరించింది.
Lantana Camara Plant : తలంబ్రాలు చెట్టు లేక పులి కంప పేరుకే చెట్టు కానీ నిజానికి ఒక పొద. ఈ మొక్క లాంటానా ప్రజాతికి చెందినది. దీనిలో 150కి పైగా జాతులు ఉన్నాయి. చూడడానికి ఇదొక అందమైన మొక్క గుత్తులు గుత్తులుగా వచ్చే పూలతో చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది. అక్కడ వరకు బాగానే ఉంది కానీ ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఎక్కడో అమెరికాలో మొదలైంది దీని ప్రస్థానం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి ప్రేమికులను, సైంటిస్టులను భయపెడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో పులి కంప అని పిలిచే దీని శాస్త్రీయ నామం లాన్తానా కామర.
50 దేశాలలో విస్తరణ
పులి కంప చాలా తొందరగా కొత్త ప్రాంతాల్లో విరివిగా వ్యాపిస్తుంది. ఒక్కోసారి దాదాపుగా కొన్ని కిలోమీటర్లు వరకూ విస్తరిస్తోంది అంటే ఎంత త్వరగా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. దీని జన్మస్థలం సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా. అక్కడి నుంచి ఇప్పుడు దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాలకు విస్తరించింది. మొదట్లో దీని గురించి పెద్దగా పట్టించుకోని సైంటిస్టులు ఇప్పుడు హైరానా పడుతున్నారు. ఇది పెరిగిన ప్రాంతాల్లో పంట దిగుబడి తగ్గడం, ఇతర మొక్కలు పెరగకుండా పోవడంతో దీని స్వభావంపై దృష్టి పెట్టారు. యూరోప్ నుంచి ఆ తర్వాత ఆసియా వరకు విస్తరించిన ఈ మొక్క ప్రభావంపై పరిశోధనలు చేస్తున్నారు.
ఎందుకు ప్రమాదకరం?
నిజానికి ఈ మొక్క బయోడైవర్సిటీని పూర్తిగా నాశనం చేస్తుంది. ఇది పెరిగే చోట్ల అక్కడ ఇతర మొక్కలకు నీరు, ఇతర పోషకాలు అందకుండా చేస్తుంది. 17 , 18వ శతాబ్దంలో దీనిని పూల మొక్కలా భావించి పెంచడం ప్రారంభించారు. 1841 ప్రాంతంలో ఆస్ట్రేలియాకి ఈ మొక్కలు తీసుకురాగా దీని విస్తరణ చూసి ఆశ్చర్యపోయారు అక్కడి పరిశోధకులు. బ్రిటిష్ వాళ్లు ఈ మొక్కను రెండు వందల ఏళ్ల కిందట ఇండియాకు తీసుకొచ్చారు. ఇక అప్పటి నుంచి ఇది పూర్తిగా వాడుకలో లేని నేలలని ఆక్రమించుకుంది. అత్యంత వేగంగా విస్తరించే లక్షణం ఉండడంతో పలు దేశాల్లో దీన్ని ఎలా నివారించాలి? అనే అంశంపై సైంటిస్టులు తలలు పట్టుకున్నారు. ముఖ్యంగా పక్షులు, చిన్న జంతువులు దీని విత్తనాలను తింటూ విస్తరించేలా సహకరించాయి. అయితే దీనిలోని విష ప్రభావం వల్ల అవి తీవ్రమైన అనారోగ్యం కూడా గురవుతాయి. ప్రధానంగా మేకలు, గుర్రాలు, ఆవులు లాంటి పెంపుడు జంతువులకు లివర్ డ్యామేజ్ కావడం సైంటిస్టులు గుర్తించారు. ఇతర మొక్కల్ని పెరగకుండా చేయడం వల్ల శాఖాహార జంతువులకు ఆహారం లభించక సమస్యలు ఎదురవుతున్నాయని వన్యప్రాణి సంరక్షణపై రీసెర్చ్ చేస్తున్న శ్రీనివాస్ అంటున్నారు.
కొన్ని మెడిసిన్లలో
ఇక భారతీయ సైంటిస్ట్ ఓ.పి శర్మ తన గ్రంథంలో రాసిన విధంగా "అత్యంత ఆకర్షణీయంగా ఉండే వీటి పూలు, ఫలాలు మానవులకు అత్యంత ప్రమాదకరం" అని మెన్షన్ చేశారు. ఇక అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఆర్మీ ఇప్పటికే ఇది మనిషికి ప్రాణాంతకమైన మొక్క అని దీనివల్ల మనుషులకు వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో పాటు పొరపాటున తింటే లివర్ కూడా పూర్తిగా ఫెయిల్ అవుతుందని గుర్తించారు. ఈ మొక్కలు మాత్రం కొన్ని విషయాల్లో మాత్రమే ఉపయోగపడుతుంది. ఆంటీ మైక్రోబియల్ అంటే ఫంగస్ నివారించేందుకు కొన్ని మెడిసిన్ల తయారీలో పనికొస్తుంది. అంతేకాదు క్యాన్సర్, చికెన్ పాక్స్, మీజిల్స్, ఆస్తమాతో పాటు అల్సర్ నివారణ మందులలో దీనిని వాడతారు. ఏది ఏమైనా కనిపించే ప్రతి అందమైనది మన అవసరానికి ఉపయోగపడేది మాత్రమే కాదు ప్రమాదకరమైనదని పరిశోధకులు అంటున్నారు. ఇంత చిన్న మొక్క వల్ల జరిగే డ్యామేజ్ ని ప్రభుత్వాలు, ప్రజలు గుర్తించగలిగితే కలిగే నష్టాన్ని ముందుగానే నివారించవచ్చు.