Andhra News: ఏపీలో భవన నిర్మాణదారులకు గుడ్ న్యూస్ - ఇకపై సులభంగా అనుమతులు వచ్చేలా రూల్స్ ఛేంజ్
Building Permits: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల నిబంధనలు సులభతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
AP Government Simplified Rules For Building Permits: ఏపీలో బిల్డర్లు, రియల్టర్లు, డెవలపర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల నిబంధనలు సులభతరం చేస్తూ సర్కారు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ బిల్డింగ్ రూల్స్ - 2017, ఏపీ ల్యాండ్ డెవలప్‌మెంట్ రూల్స్ - 2017లో సవరణలు చేస్తూ వేర్వేరుగా జీవోలు జారీ అయ్యాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా భవన, లే అవుట్ల అనుమతుల్లో ఈ మేరకు ప్రభుత్వం మార్పులు చేసింది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ (Real Estate) రంగం పెరిగేలా చేసేందుకు కీలక సంస్కరణలు చేపట్టింది.
లేఅవుట్లలో రోడ్లకు గతంలో ఉన్న 12 మీటర్లకు బదులుగా 9 మీటర్లకు కుదించారు. 500 చ.మీ. పైబడిన స్థలాల్లో నిర్మాణాన్ని సెల్లార్లకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. టీడీఆర్ బాండ్ల జారీలోని కమిటీలో రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్లను తొలగించారు. రాష్ట్ర జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న స్థలాలు అభివృద్ధి చేసేందుకు 12 మీటర్ల సర్వీస్ రోడ్డు ఏర్పాటు నిబంధనను పక్కన పెట్టారు. బహుళ అంతస్తుల భవనాల సెట్ బ్యాక్ నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది.
సంక్రాంతి కానుకగా..
సంక్రాంతి కానుకగా బిల్డర్లు, డెవలపర్లు, ప్రజలకు అనుకూలంగా ఉండేలా రూల్స్ మారుస్తూ జీవోలు జారీ చేసినట్లు మంత్రి నారాయణ (Minister Narayana) తెలిపారు. వీటితో మరిన్ని నిబంధనలు సులభతరం చేశామన్నారు. రియల్ ఎస్టేట్ అసోసియేషన్ల ప్రతినిధులతో చర్చించి తుది నిబంధనలు జారీ చేశామని.. తాజా ఉత్తర్వులతో రియల్ ఎస్టేట్ రంగం రాష్ట్రంలో పుంజుకుంటుందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతిందని.. దాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. 'రియల్ ఎస్టేట్ అభివృద్ధి జరిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. భవన నిర్మాణాల అనుమతుల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా సింగిల్ విండో విధానం అమల్లోకి వస్తుంది. ప్రతి ఏటా రెండుసార్లు రియల్ ఎస్టేట్ అసోసియేషన్ల ప్రతినిధులతో సమావేశం అవుతాను. నిర్మాణ రంగంలో ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాను.' అని మంత్రి స్పష్టం చేశారు.