Telangana MLC Elections : తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 29న పోలింగ్ - కాంగ్రెస్‌కే దక్కుతాయా ?
MLC Elections : ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. రెండు స్థానాలను దక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించే అవకాశం ఉంది.
MLA quota MLC elections : తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. 11వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 18వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 29వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అదే రోజు కౌంటింగ్ జరుగుతుంది. నిజానికి తెలంగాణలో ( Telangana ) ఎమ్మెల్సీ ఖాళీలు లేవు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరి , పాడి కౌశిక్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. వీరు అంతకు ముందే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. దీంతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసే ముందు ఎమ్మెల్సీగా రాజీనామా చేశారు. వారి స్థానాల్లోకి కొత్త అభ్యర్థులను ఎన్నుకునేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.
రెండు స్థానాలకు నామినేషన్లు దాఖలైతే పోలింగ్ ఉండదు. ఏకగ్రీవం అవుతుంది. తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కొక్కరికి 60 ఓట్లు వస్తే ఎమ్మెల్సీ అవుతారు. కానీ కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఉన్నారు. బీఆర్ఎస్‌కు 39 మంది మాత్రమే ఉన్నారు. బీజేపీ, ఎంఐఎం ఒకే అభ్యర్థికి మద్దతిచ్చే అవకాశాలు ఉండవు. బలం తక్కువ అయినా రెండో స్థానం బీఆర్ఎస్ గెలుచుకోవచ్చు. కానీ .. కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థుల్ని నిలబెడితే మాత్రం.. పోరు ఆసక్తికరంగా మారుతుంది. బీఆర్ఎస్ పోటీ నుంచి వైదొలిగితే కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవం అవుతారు. బీఆర్ఎస్ పోటీ పెడితే.. మాత్రం ఎన్నిక రచ్చ అవుతుంది. కాంగ్రెస్ ఫిరాయింపులను ప్రోత్సహించే అవకాశం ఉంది.
మరో ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఎమ్మెల్స పదవికి రాజీనామా చేశారు. ఆయన పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలిచారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన... ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా మండలిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కాస్త ఖాళీ అయ్యింది. 2021 మార్చి 14న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగగా... ఆ సమయంలో మొత్తంగా 76 మంది వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పడగా.. ఇండిపెండెంట్ గా బరిలో నిలిచిన తీన్మార్ మల్లన్న టఫ్ ఫైట్ ఇచ్చారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, తీన్మార్ మల్లన్న మధ్య హోరాహోరీ పోరు నడవగా... చివరకు పల్లా విజేతగా నిలిచారు. ఆయన ఆ పదవిలో ఆరేళ్ల పాటు కొనసాగాల్సి ఉంది. కానీ తాజా ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేసి గెలవడంతో ఆయన రాజీనామా అనివార్యమైంది.
ఈ నియోజకవర్గానికి చెందిన పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా ఆదేశించాలు ఇచ్చింది ఈసీ. ఓటరు నమోదు కోసం నిర్ణీత షెడ్యూల్‌ను వెల్లడించగా... ఓటర్ల నమోదు ప్రక్రియకు శనివారం పబ్లిక్ నోటీస్ జారీ చేసింది. ఫిబ్రవరి 6కల్లా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని... 24వ తేదీన ముసాయిదా ఓటరు జాబితాను వెల్లడించాలని పేర్కొంది. ఏప్రిల్ 4న తుది ఓటరు జాబితాను ప్రకటించాలని స్పష్టం చేసింది. గవర్నర్ కోటాలోనూ రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.