(Source: ECI/ABP News/ABP Majha)
Sangareddy Court: ఆరేళ్ల పాపపై అత్యాచారం, ఉరి శిక్ష వేస్తూ సంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు
Crime News : సంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పోక్పో కేసులో దోషి గఫార్ కు మరణశిక్ష విధించింది. ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసును గురువారం కోర్టు విచారించింది.
Sangareddy : ఇటీవల కాలంలో దేశంలో మహిళలపై అత్యాచార ఘటనలు ఎక్కువవుతున్నాయి. చిన్న పెద్దా అనే తేడా లేకుండా కామాంధులు మహిళలపై దాడులకు పాల్పడుతున్నారు. కొన్నాళ్ల కింద సంగారెడ్డి జిల్లాలో ఓ ఆరేళ్ల పసిపాపను ఓ దుర్మార్గుడు అతికిరాతకంగా అత్యాచారం చేయడమే కాకుండా క్రూరంగా చంపాడు. ఆ నిందితుడికి మరణశిక్ష విధిస్తూ సంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. సరిగ్గా 27 ఏళ్ల తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఈ కోర్టులో మళ్లీ మరణ శిక్ష విధించడం సెన్సేషనల్ గా మారింది. బాధితురాలి కుటుంబ సభ్యుల పక్షాన అటు పోలీసులు, ఇటు న్యాయవాదులు నిలబడి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ గురువారం ఎస్పీ ఆఫీసులో విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
వివరాల్లోకి వెళితే
బీహార్ రాష్ట్రం జిమోయి జిల్లా సికిందర్ తాలూకాకు చెందిన గఫార్ అలీ (56) అనే వ్యక్తి గతేడాది 16-10-2023న బీడీఎల్ భానుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చైతన్య కంపెనీ పక్కన లేబర్ రూమ్ లో నివాసం ఉండేవాడు. బీహార్ రాష్ట్రం నుంచి బతకడానికి వచ్చి స్థానికంగా నివాసం ఉంటున్న శంకర్, అతని భార్య ఉమాదేవిలు తమ ఆరేళ్ల మనుమరాలిని సెక్యూరిటీ గార్డ్ వద్ద ఉంచి చైతన్య కంపెనీలోనికి పని కోసమని వెళ్లారు. వీరి లేబర్ రూమ్ ప్రక్క రూంలో ఉండే, గఫార్ అలీ పనికి వెళ్లకుండా మద్యం సేవించి తిరుగుతుండగా.. సుమారు 11.00 గంటల సమయంలో సెక్యూరిటీ గార్డు వద్ద పాప ఆడుకుంటూ కనిపించింది.
సంచలన తీర్పు ఇఛ్చిన కోర్టు
సంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పోక్పో కేసులో దోషి గఫార్ ఖాన్‌కు మరణశిక్ష విధించింది. ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసును గురువారం కోర్టు విచారించింది. నిందితుడికి మరణశిక్షే సరైన నిర్ణయమని తీర్పు చెప్పింది. అంతేకాదు బాలిక కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే... బీహార్ కు చెందిన గఫార్ ఖాన్ (56) అనే వ్యక్తి ఉపాధి కోసం సంగారెడ్డికి వచ్చాడు. పోలీస్ స్టేషన్ పరిధిలోని కంపెనీ పక్కనే ఉన్న లేబర్ రూంలో నివాసం ఉంటున్నాడు. ఆ పాప తనకు తెలిసిన అమ్మాయే అని కూల్ డ్రింక్ తాగించి తీసుకుని వస్తానని చెప్పి.. తీసుకెళ్లి మద్యం కలిపిన కూల్ డ్రింక్ తాగించి.. పక్కనే ఉన్న పత్తి చేనులోకి తీసుకొని వెళ్లి అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబుతుందేమోనన్న భయంతో పాప గొంతు నులిమి హత్య చేశాడు. ఈ మేరకు అప్పటి ఎస్సై రవీందర్ రెడ్డి నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. గురువారం కేసు విషయమై వాదోపవాదాలు విన్న పోక్సో కోర్టు న్యాయమూర్తి జయంతి నిందితునికి మరణ శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చారు.
10లక్షల నష్టపరిహారం
చనిపోయిన బాధిత చిన్నారి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వవలసిందిగా న్యాయమూర్తి జయంతి ఆదేశించారు. ఈ కేసులో సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి, హై కోర్ట్ ను ఆశ్రయించి స్పీడ్ ట్రయల్ అనుమతి తీసుకుని కేవలం 11 నెలల్లోనే నిందితునికి ఉరిశిక్ష పడేలా చేశారు. దీంతో ఎస్పీని పోక్సో న్యాయమూర్తి ప్రశంసించారు. నిందితునికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులు అదనపు ఎస్పీ సంజీవ రావు, అశోక్, అప్పటి ఎస్సై రవీందర్ రెడ్డి, ఇన్ స్పెక్టర్ బిడియల్ భానూర్, ఇన్వెస్టిగేషన్ అధికారులు పురుషోత్తం రెడ్డి, పీపీలు అనంత రావ్ కులకర్ణి, కృష్ణ, భరోసా లీగల్ సపోర్ట్ పర్సన్ సౌజన్య, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ వెంకటేశ్వర్లు, రఫీక్, సీత నాయక్, కోర్ట్ లైజనింగ్ అధికారి కె.సత్యనారాయణ ఎస్ఐ. డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ బి. రమేష్ లను ఎస్పీ అభినందించారు.