(Source: ECI/ABP News/ABP Majha)
Rythubandhu Scheme: రైతుబంధు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం, దేశంలోనే మొట్టమొదటి పథకం: మంత్రి నిరంజన్ రెడ్డి
మనకు అన్నం పెట్టే రైతు అప్పులపాలు కాకూడదు, రైతు యాచించే స్థితిలో కాదు శాసించే స్థాయిలో ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అన్నారు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి.
Rythubandhu Money Latest News: తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు పథకం మిగతా రాష్ట్రాల వారికి సైతం ఆదర్శప్రాయమని, దేశంలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్న మొట్టమొదటి పథకం అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. మనకు అన్నం పెట్టే రైతు అప్పులపాలు కాకూడదు, రైతు యాచించే స్థితిలో కాదు శాసించే స్థాయిలో ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. ఇప్పటివరకు 9 విడతలలో రూ.58 వేల కోట్లు రైతుల ఖాతాలలో జమచేశాం అని, 10వ విడతతో దాదాపు రూ.66 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాలలోకి రైతు బంధు నిధులు జమ కానున్నట్లు తెలిపారు.
65 లక్షల మంది రైతులకు ప్రయోజనం
రైతుబంధు, రైతుభీమా, సాగునీటి సదుపాయం, 24 గంటల ఉచిత కరంటుతో తెలంగాణ రైతులలో ఆత్మస్థైర్యం పెరిగిందన్నారు. వ్యవసాయరంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న చేయూత దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వడం లేదని, 60 శాతం మందికి ఉపాధి కల్పించే వ్యవసాయరంగానికి చేయూత ఇవ్వాలన్నదే కేసీఆర్ ఆలోచన అన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకున్నా తెలంగాణలో సంక్షేమ, అభివృద్ధి పథకాలను కేసీఆర్ విజయవంతంగా అమలుచేస్తున్నారు. తాజాగా 10వ విడత రైతు బంధుతో రాష్ట్రంలోని 65 లక్షల మంది పైచిలుకు రైతుల ఖాతాలకు రూ.7600 కోట్లు జమ అవుతాయన్నారు.
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
పదో విడత రైతుబంధు నిధులు విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ రైతుల పక్షాన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. డిసెంబర్ 28 నుండి రోజుకు ఎకరా చొప్పున రైతుల ఖాతాలలో నిధులు జమ అవుతాయని, సంక్రాంతి లోపు అందరు రైతుల ఖాతాలలో నిధులు జమ అవుతాయని స్పష్టం చేశారు. రైతు బంధు పథకం ద్వారా రైతులకు వానాకాలం, యాసంగి రెండు కాలాలకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం, పంట పెట్టుబడిని అందించడం, దేశ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక కార్యాచరణ గా సత్ఫలితాలు ఇస్తోందన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ అనుకూల కార్యాచరణ దేశానికి ఆదర్శంగా నిలవడమే కాకుండా, దేశ వ్యవసాయ రంగ నమూనా మార్పునకు దారితీసిందన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ అనుకూల దార్శనిక నిర్ణయాలు, ధాన్యం ఉత్పత్తి లో తెలంగాణాను దేశంలోనే అగ్రగామిగా నిలిపాయని చెప్పారు. ఉచిత సాగునీరు, ఉచిత విద్యుత్తు తో పాటు, రైతు బీమా తో పాటు, పంటలు పండించేందుకు నేరుగా రైతు ఖాతాలో పెట్టుబడి ని అందించడం ద్వారా తెలంగాణ వ్యవసాయం లో విప్లవాత్మక పరిణామం చోటు చేసుకుందన్నారు. ఎలాంటి కోతలు లేకుండా, రైతులందరికీ పూర్తి స్థాయిలో, సకాలం లో రైతు బంధు నిధులు విడుదల చేయాలని ఫైనాన్స్ సెక్రెటరీకి సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఈ నిర్ణయం, రైతాంగం పట్ల, వ్యవసాయం పట్ల సీఎం కేసిఆర్ పాలనకున్న చిత్తశుద్ది కి నిదర్శనంగా నిలిచిందని పేర్కొన్నారు.
దేశ రైతాంగ సంక్షేమానికి, వ్యవసాయ ప్రగతికి బాటలు వేసే దిశగా పక్క రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్రాన్ని ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన 40 వేల కోట్ల రూపాయలను రాకుండా కేంద్రం తొక్కిపెట్టిందని, ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తూ, తెలంగాణ రైతులను ప్రజలను కష్టాలపాలు చేస్తుందని విమర్శించారు. కేంద్రం ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, తెలంగాణ రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ది విషయంలో రాజీ పడకుండా రైతులకు రైతు బంధు నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.