Telangana Congress News: సోనియాతో రేవంత్, భట్టి భేటీ - అరగంటపాటు సమావేశం
Revanth Reddy: రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా రేవంత్ వెంట ఉన్నారు.
Revanth Reddy meets Sonia Gandhi: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా రేవంత్ వెంట ఉన్నారు. సుమారు వీరు అరగంట పాటు కీలక అంశాలపై చర్చించినట్లు తెలిసింది. సోనియాతో భేటీ తర్వాత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి సోనియా గాంధీని కలవడానికి వచ్చామని చెప్పారు. ఈ భేటీ మర్యాదపూర్వకంగా అని అన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని ఒక స్థానం నుంచి పోటీ చేయాలని కోరినట్లు వెల్లడించారు. ఈ అంశంపై రాష్ట్ర కాంగ్రెస్ విభాగం చేసిన తీర్మానం కూడా ఆమెకు వివరించినట్లు చెప్పారు. రాష్ట్రంలో అమలు చేసిన, చేయబోతున్న గ్యారంటీలను వివరించామని భట్టి విక్రమార్క చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఒకటైన మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలు తీరు గురించి సోనియాకు వివరించామని చెప్పారు. గడిచిన రెండు నెలల్లో టీఎస్ఆర్టీసీలో దాదాపు 15 కోట్ల జీరో టికెట్లు తెగాయని భట్టి వివరించారు. ఇదొక రికార్డు అని అన్నారు. త్వరలోనే మరో రెండు పథకాలను అమలు చేస్తున్నట్లుగా సోనియాకు చెప్పామని అన్నారు. రాష్ట్రంలో మొదటిసారి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తున్నట్లు సోనియాకు వివరించినట్లు భట్టి తెలిపారు.