Revanth Reddy To Delhi : ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ - ఈ సారైనా కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వస్తుందా ?
Telangana : అధికారిక సమావేశాల్లో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. ఇటీవల వచ్చిన వరదల్లో జరిగిన నష్టంపై నివేదిక సమర్పించనున్నారు.
Revanth Reddy is going to Delhi to participate in official meetings : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లనున్నారు. ఆదివారం సాయంత్రం ఆయన ఢిల్లీకి చేరుకుంది. ఇటీవల వచ్చిన వరద నష్టాలకు సంబంధించి సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాలో వరదలు భారీ నష్టానికి కారణం అయ్యాయి. కేంద్ర బృందం వచ్చి పరిశీలన జరిపింది. భారీ వర్షాల వల్ల రూ. 10,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు వరద సహాయ నిధులు రూ.416.80 కోట్లు మాత్రమే ఇటీవల విడుదల చేసింది. మరిన్ని నిధులు అవసరమని నివేదిక సమర్పించనున్నారు.
రాష్ట్రాల హోంమంత్రుల సమావేశంలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి
అలాగే తన పర్యటనలో రేవంత్ రెడ్డి కేంద్ర హోం శాఖ ఏర్పాటు చేసిన రాష్ట్ర హోం మంత్రుల సమావేశంలో కూడా పాల్గొననున్నారు. ప్రస్తుతానికి తెలంగాణకు హోంమంత్రి బాధ్యతలు కూడా రేవంత్ రెడ్డినే నిర్వహిస్తున్నారు. హోంశాఖ ఆయన వద్దే ఉంది. మంత్రి వర్గ విస్తరణ జరిపితే హోంశాఖను ఓ సీనియర్ నేతకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో పలుమార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లి మంత్రివర్గ విస్తరణపై చర్చించారు. సారి కూడా ఢిల్లీ పర్యటనలో ఆయన కాంగ్రెస్ సీనియర్ నేతలతో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. మంత్రివర్గ అంశంపై ఇప్పటికే కొన్ని పేర్లను రేవంత్ రెడ్డి హైకమాండ్ కు సమర్పించారు. అయితే ఆశావహులు చాలా ఎక్కవగా ఉండటంతో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.
నాగార్జునకు వరుస సమస్యలు - మాదాపూర్ పీఎస్‌లో కబ్జా కేసు నమోదు
కాంగ్రెస్ పెద్దలతో మరోసారి కేబినెట్ విస్తరణపై చర్చలు జరిపే అవకాశం
తెలంగాణ మంత్రివర్గంలో మొత్తం ఆరు ఖాళీలు ఉన్నాయి. గత డిసెంబర్‌లో ప్రభుత్వం ఏర్పడినప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆరు ఖాళీలను భర్తీ చేయాలని అనుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్నన్ని సీట్లు సంపాదించుకోలేకపోయారు. గతం కన్నా ఎక్కువ సీట్లే సాధించుకున్నా ఎనిమిది స్థానాలకే పరిమితమయ్యారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి ప్రాధాన్యతను పెంచవద్దని ఆయన చెప్పిన వారికి కాకుండా ఇతరులకు మంత్రి పదవులు ఇవ్వాలని పలువురు సీనియర్ నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో రేవంత్ చెబుతున్న పేర్లకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌లోనూ చర్చ జరుగుతోంది.
ఇంకా కేబినెట్‌లో ఆరు మంత్రి పదవులు ఖాళీ
ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండటం హోంశాఖ, విద్యాశాఖ వంటి వాటికి మంత్రులు లేకపోవడంతో వస్తున్న సమస్యలను అధిగమించడానికైనా త్వరగా పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని రేవంత్ కోరుతున్నారు. ఈ పర్యటనలో ఆయన అనుమతి తెచ్చుకుంటారని భావిస్తున్నారు.