Revanth Reddy Demands: కేసీఆర్ ఎక్కడున్నారో తెలీదు, నిద్ర మత్తు వీడితే బెటర్ - కొత్త డిమాండ్స్‌తో రేవంత్ రెడ్డి
‘‘రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్టు.. రాష్ట్రం వరదలతో అతలాకుతలం అవుతుంటే కేసీఆర్ కూడా అభినవ నీరోలా ప్రవర్తిస్తున్నారు’’ అని రేవంత్ ఎద్దేవా చేశారు.
Revanth Reddy Warns KCR: తెలంగాణలో వరదలు ముంచెత్తుతున్న వేళ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఇప్పటికే వరదల వల్ల చాలా మంది అవస్థలు పడుతున్నారని, అప్రమత్తమై సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులతో సమీక్ష పెట్టాలని నిర్దేశించారు. ఈ అంశంపై రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి కొన్ని డిమాండ్లతో లేఖ రాశారు.
‘‘అకాల వర్షాలతో రాష్ట్రంలో జన జీవనం అస్థవ్యస్థమైంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టు పరిధిలో ఇప్పటికే అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. తక్షణం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిద్ర మత్తు వీడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించకపోతే పెను విపత్తు జరిగే ప్రమాదం ఉంది. తక్షణం సంబంధిత అన్నీ శాఖలతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష పెట్టాలి. కడెం ప్రాజెక్టు పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలి. చాలా ప్రాంతాల్లో ఉదృత వరదల కారణంగా ప్రజలు ఇళ్ల నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు. వర్షాల కారణంగా పాత బడిన నిర్మాణాలు కూలిపోయే ప్రమాదం ఉంది. అలాంటి వాటిని యుద్ధ ప్రాతిపదికన గుర్తించాలి.
రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లు.. - రేవంత్
పరిస్థితి తీవ్ర రూపం దాల్చుతుంటే ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో ప్రజలకు అర్థం కాని పరిస్థితి. వరద బాధితులను ఆదుకోవాలన్న స్పృహ కేసీఆర్ కు లేనట్టు కనిపిస్తోంది. ప్రజలు చస్తున్నా ఆయన మాత్రం రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలు, సర్వే నివేదికలపై మల్లగుల్లాల్లో మునిగి తేలుతున్నాడు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్టు.. రాష్ట్రం వరదలతో అతలాకుతలం అవుతుంటే కేసీఆర్ కూడా అభినవ నీరోలా ప్రవర్తిస్తున్నాడు.
ప్రభుత్వ నిష్క్రియాపరత్వాన్ని, ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇప్పటికైనా ఆయన స్పందించాలి. సమీక్షలు, సహాయక చర్యలతో ప్రభుత్వాన్ని యాక్టివేట్ చేయాలి. యుద్ధ ప్రాతిపదికన వరద సహాయక చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ.. భారీ వర్షాలు, వరదలపై ప్రభుత్వానికి ఈ కింది సూచనలు చేస్తున్నాను.
ప్రభుత్వానికి నిర్ధుష్టమైన సూచనలు
* ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర స్థాయిలో వరదలపై సమీక్షకు తక్షణం ఉన్నత స్థాయి బృందం ఏర్పాటు చేయాలి. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు వైద్య శాఖ, సాగునీరు, తాగునీరు, విద్యుత్, ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులను నియమించి స్వయంగా ముఖ్యమంత్రి సమీక్ష జరపాలి.
* క్షేత్ర స్థాయిలో 17 పార్లమెంట్లకు 17 మంది మంత్రుల అధ్యక్షతన సీనియర్ ఐఎఎస్, ఐపీఎస్, సాగు-తాగునీటి శాఖ, వైద్య, విద్యుత్, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులతో బృందాలు ఏర్పాటు చేయాలి. 17 పార్లమెంట్ల పరిధిలో కంట్రోల్ రూంలు, హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయాలి. వీళ్లు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ.. పరిస్థితిని సమీక్షిస్తూ వరద సహాయక చర్యలు ప్రారంభించాలి. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేసే ఉన్నత స్థాయి కమిటీ ఈ 17 కమిటీలను సమన్వయం చేసుకోవాలి.
* వరద అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎన్డీఆర్ ఎఫ్ బృందాలను అప్రమత్తం చేయాలి.
* వరద కారణంగా ఇళ్ల నుండి ప్రజలు బయటకు రాలేని ప్రాంతాలను తక్షణం గుర్తించి అక్కడ ఆహారం, తాగునీరు, ఇతర నిత్యావసరాలు అందించేలా కార్యచరణ ఉండాలి.
* ప్రాజెక్టులు, చెరువుల వద్ద నీటి ఉదృతిని ఎప్పటికప్పుడు అంచనా వేసి, కట్టలు తెగే ప్రమాదం ఉన్న చోట ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు అవసరైన వ్యూహాలను ఇంజనీరింగ్ అధికారులకు చర్చించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
* ముఖ్యమంత్రి నిర్లక్ష్యం చేయకుండా... తక్షణం ఈ సూచనలను పరిగణనలోకి తీసుకుని యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలి. లేని పక్షంలో ఏ ప్రమాదం జరిగినా, ఏ చిన్నపాటి నష్టం జరిగినా దానికి స్వయంగా కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాను’’ అని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.