Telangana Congress News : జూపల్లి, పొంగులేటిలకు టీ కాంగ్రెస్ నేతల ఆహ్వానం - నల్లగొండ నేతల చేరికలపై వివాదం !
పార్టీలో చేరికలపై ఇతర సీనియర్ నేతలతో వివాదాల్లేవని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జూపల్లి, పొంగులేటితో సీనియర్ నేతలతో కలిసి సమావేశం అయ్యారు.
Telangana Congress News : కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు మరికొంత మంది సీనియర్ నేతలు వారి ఇళ్లకు వెళ్లి సమావేశం అయ్యారు. లాంఛనంగా పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. వారిద్దరూ పార్టీలో చేరేందుకు అంగీకారం తెలిపారు. ఇప్పటికే వీరు రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు. పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. వీరంతా ఇరవై ఐదో తేదీన ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది.
నల్లగొండ నేతల చేరికపై సమాచారం లేదని సీనియర్ల అసంతృప్తి
మరో వైపు నల్లగొండ జిల్లాకు చెందిన శశిధర్ రెడ్డి , వేముల వీరేశంలకు కూడా పార్టీలో చేర్చుకోవాలనుకున్నారు. కానీ వీరి చేరికలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. తన జిల్లాకు సంబంధించిన చేరికలపై తనతో సంప్రదించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలియడంతో ముందుగా రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి ఇంటికే వెళ్లారు. స్థానిక నేతలతో మాట్లాడిన తర్వాతనే చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నామన్నారు. ఉత్తమ్, జానారెడ్డి, కోమటిరెడ్డిలకు అన్నీ విషయాలు చెబుతున్నామన్నారు. చేరికల విషయంలో ఎలాంటి వివాదాల లేని.. కొత్త సమస్యలు సృష్టించవద్దని రేవంత్ రెడ్డి మీడియాకు విజ్ఞప్తి చేశారు.
అందరితో మాట్లాడిన తర్వాతే నేతలను చేర్చుకుంటామన్న రేవంత్
పార్టీలో చేరికలపై పార్టీ నేతల మధ్య ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక నేతలను అడిగి.. వారి అభ్యరంతరాలను పరిశీలించి అందరి ఆమోదంతోనే పార్టీలో చేరికలు ఉంటున్నాయని స్పష్టం ేచశారు. కోమటిరెడ్డి, ఉత్తమ్, జానారెడ్డిని సంప్రదించకుండా ఎవరినీ పార్టీలో చేర్చుకోవడం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ ముగ్గురి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నామన్నారు. ఇంకా చాలా మంది నేతలు పార్టీలో చేరుతారని రేవంత్ రెడ్డి వివరించారు. తమ మధ్య రాజకీయ పరంగా ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని.. కలసే ఉన్నామని.. కలిసే ఉంటామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.
పార్టీ బలోపేతానికి కలిసి పని చేస్తున్న కాంగ్రెస్ సీనియర్లు
కర్ణాటక ఎన్నికల్లో విజయంతో కాంగ్రెస్ కు జోష్ రావడంతో చేరికల కోసం విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు. పొంగులేటి, జూపల్లి కృష్ణారావులు పార్టీలో చేరేలా మంతనాలు పూర్తి చేశారు. వీరితో పాటు నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత గుర్నాథ్ రెడ్డి సైతం హస్తం పార్టీకి టచ్‌లోకి వచ్చారు. తాండురు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో విభేదాలు ఉన్న పట్నం మహేందర్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇలా బీఆర్ఎస్ కు ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లే అవుతుందనే సంకేతం.. ఇతర పార్టీల్లోని నాయకులకు పంపిస్తోంది తెలంగాణ కాంగ్రెస్.