Revant Reddy : బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేసే దమ్ముందా ? - ఫామ్ హౌస్ కేసుకు ఏడాది అయిన సందర్భంగా కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్
బీఎల్ సంతోష్ హైదరాబాద్ వచ్చారని అరెస్టు చేయాలని కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. గతంలో ఫామ్ హౌస్ కేసుకు ఏడాది అయిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
Revant Reddy : బీజేపీ ముఖ్య నేత బీఎల్ సంతోష్ ను అరెస్టు చేసే దమ్ముందా అని.. కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా సవాల్ చేసారు. మీ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేస్తున్నదని తెలంగాణ ప్రజలకు మొర పెట్టుకున్నది యాదికున్నదా? అదే తెలంగాణలో రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మీ ఇద్దరు తోడు దొంగలు ఆడిన నాటకం గుర్తొచ్చిందా? అని ఎక్స్ ట్విట్టర్ అకౌంట్‌లో ప్రశ్నించారు. ఆ కేసుకు ఏడాది కావొస్తున్న శుభ సందర్భంలో.. మీ సర్కారును కూలదోస్తామన్న కుట్రదారు బీఎల్ సంతోష్ హైదరాబాద్ వచ్చారని.. ఇన్నాళ్లు అడ్రస్ దొరకలేదని తప్పించుకుంటిరి.. మరి ఇప్పుడైనా ఆయన్ని అరెస్టు చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. ఆ కట్టుకథను ప్రజలు మర్చిపోతారులే అని అతిథ్యమిస్తారా? లేక సిట్ ను నిద్రలేపి అరెస్టేమైనా చేస్తారా? అని సెటైర్ వేశారు.
కేసీఆర్! @TelanganaCMO
— Revanth Reddy (@revanth_anumula) October 5, 2023
మీ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేస్తున్నదని
తెలంగాణ ప్రజలకు మొర పెట్టుకున్నది యాదికున్నదా?
అదే తెలంగాణలో రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మీ ఇద్దరు తోడు దొంగలు ఆడిన నాటకం గుర్తొచ్చిందా?
ఆ కేసుకు ఏడాది కావొస్తున్న శుభ…
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫామ్ హౌస్ కేసు విషయం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. ఫామ్ హౌస్ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే విచారణ మాత్రం సీబీఐ ప్రారంభించలేదు. తదుపరి నిర్ణయం తీసుకునే వరకూ తదుపరి చర్యలు వద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లో… ముగ్గురు ఎమ్మెల్యేల్ని ప్రలోభపరుస్తూ ముగ్గురు వ్యక్తులు దొరికిపోయారు. వారు బీజేపీతరపున రాయబారులని ఆరోపిస్తూ కేసు పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం కేసును సిట్ కు ఇచ్చింది. ఇందులో బీజేపీ పెద్ద నేతలున్నారని ఆరోపిస్తూ… సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఫాం హౌస్ కేసులో ఇవిగో సాక్ష్యాలు అంటూ విడుదల చేశారు. మీడియాకు ప్రదర్శించడమే కాదు.. దేశంలోని అందరి న్యాయమూర్తులు సుప్రీంకోర్టు సీజే దగ్గర నుంచి హైకోర్టు న్యాయమూర్తుల వరకూ అందరికీ పంపారు.
అయితే ఇలా ఎలా పంపుతారని.. అసలు సాక్ష్యాలు ఎలా బయటకు వచ్చాయని చెబుతూ.. కేసును.. సీబీఐకి ఇచ్చింది హైకోర్టు . ఫామ్ హౌస్ కేసు అనేక రకాల మలుపులు తిరుగింది. మొదట సిట్ విచారణ జరపగా.. నిందితులు .. సిట్ పై నమ్మకం లేదని సీబీఐ దర్యాప్తు కావాలని పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. సిట్ దర్యాప్తు తీరు.. ముందుగానే సాక్ష్యాలు బయటకు రావడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సీబీఐకి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కేసు సీబీఐకి వెళ్తే రాజకీయంగా ఇబ్బందులు పడతామని గట్టి నిర్ణయానికి వచ్చిన్ బీఆర్ఎస్.. న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకుంది. వెంటనే.. సుప్రీంకోర్టుకూ వెళ్లింది.
తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీఎల్ సంతోష్ ప్రయత్నించారని కేసీఆర్ ఆరోపించారు. ఆయనకు తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే తర్వాత పరిస్థితి మారింది. అప్పట్లో బీఎల్ సంతోష్ ను అరెస్టు చేస్తారన్న ప్రచారం జరిగింది. అందుకే రేవంత్ రెడ్డి ఇప్పుడీ ప్రకటనలు చేశారు. ప్రస్తుతం బీఎల్ సంతోష్.. హైదరాబాద్ లో బీజేపీ సమావేశాల్లో పాల్గొంటున్నారు.