CM Revanth Reddy: ఆదాయం పెంచే మార్గాలు చెప్పండి - నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ సలహాలు అడిగిన సీఎం రేవంత్
Telangana: ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు చెప్పాలని ఆర్థికంలో నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీని రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ లో రేవంత్ తో అభిజిత్ ముఖర్జీ సమావేశం అయ్యారు.

Abhijit Banerjee : ఆర్థిక శాస్త్ర నిపుణుడు, నోబెల్ అవార్డు గ్రహీత అభిజిత్ బెనర్జీ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన పథకాలు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై చర్చించారు. బంజారాహిల్స్ లోని ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పాల్గొన్నారు.
రాష్ట్ర ఆర్థిక వృద్ధి, ఆదాయాన్ని పెంచేందుకు ఉన్న మార్గాలు, ఆర్థిక క్రమశిక్షణ, పట్టణాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి సృష్టించడంతో పాటు తదితర అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ విజన్ ను, ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆదరణ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు వివరించారు. తెలంగాణకు సంబంధించిన విశిష్టతను, ఇక్కడున్న అనుకూలతలను ప్రపంచమంతటా చాటిచెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
మహిళా స్వయం సహాయక సంఘాలు, రైతుల సాధికారత, యువతకు ఉద్యోగాలతో పాటు స్కిల్ డెవెలప్మెంట్ దిశగా ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక చర్యలను ప్రస్తావించారు.
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ రైజింగ్ విజన్ బోర్డులో భాగస్వామ్యం పంచుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అభిజిత్ బెనర్జీని ఆహ్వానించారు. భవిష్యత్తు విజన్ రూపకల్పనలో ఇతర ప్రముఖులతో పాటు తమ అనుభవాలను పంచుకోవాలని కోరారు. గొప్ప విజన్ తో ముందుకు సాగుతున్నారని అభిజిత్ బెనర్జీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ప్రశంసించారు. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు బోర్డులో చేరడానికి సమ్మతించారు. పోలీస్, మున్సిపల్ శాఖల్లో ట్రాన్స్జెండర్ల నియామకం, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాను సర్వీస్ సెక్టార్ గా అభివృద్ధి చేసే ప్రణాళికను ఎంచుకోవటం, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయటం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతకు అద్దం పట్టిందని అభిజిత్ బెనర్జీ ముఖ్యమంత్రిని అభినందించారు.
Happy to share that Economics Nobel laureate Prof Abhijit Banerjee has accepted my invitation to join the #TelanganaRising Advisory Board.
— Revanth Reddy (@revanth_anumula) May 17, 2025
We had a great discussion on how to transform and develop our state into a global powerhouse in economy & culturally. Prof Banerjee was… pic.twitter.com/ddm5J787Et
భారత్ ఫ్యూచర్ సిటిలో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, సృజనాత్మకతను భాగం చేయాలని అభిజిత్ బెనర్జీ సూచించారు. సంప్రదాయ చేతివృత్తుల వారిని ఆధునిక వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ప్రత్యేక స్వల్పకాలిక కోర్సులు నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. అత్యాధునిక సాంకేతికత, సోషల్ మీడియా, మార్కెటింగ్ నైపుణ్యాలతో వారిని వృద్ధి చేయాలన్నారు.





















