Telangana CM Revanth Reddy: విద్యార్థులకు రూ.2 వేల స్కాలర్‌షిప్- ATC ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
Scholarship for Telangana students | అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ప్రారంభోత్సవంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు శుభవార్త చెప్పారు. విద్యార్థులకు రూ.2 వేలు స్కాలర్ షిప్ ఇస్తామన్నారు.

Advanced Technology Centers (ATCs) | హైదరాబాద్: తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) వెల్లడించారు. ఇందులో రాష్ట్ర యువత భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల (ATC) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ATCల్లో విద్యార్ధులకు మంచి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ కేంద్రాల్లో చదువుతున్న విద్యార్థులకు RTCలో అప్రెంటిస్‌షిప్ ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సూచించారు. అలాగే ప్రతీ విద్యార్థికి నెలకు రూ.2,000 స్కాలర్‌షిప్ అందించేలా ఆర్థిక మంత్రిని ఒప్పిస్తానని శుభవార్త చెప్పారు. వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు రూ.2 వేల స్కాలర్‌షిప్ అందించే దిశగా చర్యలు తీసుకుంటాం అన్నారు.
అందుకే ఐటీఐలు నిర్వీర్యం అయ్యాయి..
ఏటీసీ సెంటర్లు ప్రారంభించిన తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదట 1956లో ఐటీఐలు స్థాపించారని గుర్తు చేశారు. అయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలను అందించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. కాలానుగుణంగా కోర్సులను అప్‌గ్రేడ్ చేయకపోవడంతో ఐటీఐలు నిర్వీర్యమయ్యాయని అన్నారు.
ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత, ఐటీఐలను పునరుద్ధరించాలని సంకల్పించామన్నారు. ఈ లక్ష్యంతో ఇప్పటి ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేసినట్టు ప్రకటించారు. "సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు, సాధించలేనిది ఏదీ లేదు" అంటూ ఆయన యువతకు ధైర్యం నింపారు. తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా 65 ఎటీసీలను ఇప్పటికే పూర్తి చేశామని, ఇవాళ మరో 51 ఎటీసీలను మంజూరు చేశామని పేర్కొన్నారు. అవి కూడా ఏడాదిలోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సర్టిఫికెట్ ఉన్నా, నైపుణ్యం లేకపోతే ఉపయోగం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. యువతకు నైపుణ్యం అందించాలనే ఉద్దేశంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని స్థాపించామని వెల్లడించారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలని, యువతలో నైపుణ్యాలను మెరుగుపరచాలని తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

అవకాశాలు వినియోగించుకోండి, డ్రగ్స్ జోలికి వెళ్లొద్దు
సాంకేతిక నైపుణ్యంపై విద్యార్థులు ఫోకస్ పెట్టాలన్నారు. జర్మనీ, జపాన్ వంటి దేశాలు కూడా మన టాలెంట్ ముందు మోకరిల్లే రోజులు వస్తాయని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘చదువు ఒక్కటే మీ తలరాతను మార్చగలదు. మీ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంది. అందుకే ప్రభుత్వం ఇచ్చే అవకాశాన్ని వినియోగించుకోండి’ అంటూ యువతను ప్రోత్సహించారు. సమాజాన్ని పాడు చేస్తున్న డ్రగ్స్, గంజాయి వంటి వ్యసనాల నుంచి దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులకు బాధ కలిగించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు.

మీ సోదరుడిగా, మీ భవిష్యత్తు కోసం మేము ప్రణాళికలు వేస్తున్నాం అన్నారు. జపాన్ ప్రభుత్వం మన యువతకు ట్రెయినింగ్ ఇచ్చి అక్కడ ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. తెలివి, కమిట్మెంట్ ఉంటే ఎవరైనా ఉన్నత స్థానానికి చేరవచ్చని అన్నారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.























