Revanth Chit Chat: లోకేష్‌తో కేటీఆర్ అర్థరాత్రి సీక్రెట్ డిన్నర్ మీటింగ్ - సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Ktr And Lokesh: నారా లోకేష్‌ను కేటీఆర్ అర్థరాత్రి పూట కలిశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎందుకు కలిశారో చెప్పాలని రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్‌లో చెప్పారు.

Revanth Reddy alleges that KTR met Nara Lokesh : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. టీడీపీ మంత్రి నారా లోకేష్ ను కలిశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక విషయం బయట పెట్టారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి అక్కడ కేంద్ర మంత్రులతో సమావేశాల తర్వాత మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా నారా లోకేష్‌తో కేటీఆర్ భేటీ గురించి ప్రస్తావించారు. అర్థరాత్రి లోకష్‌తో డిన్నర్ ఏమీటింగ్ ఎందుకు చేశారో చెప్పాలన్నారు.
కేటీఆర్, లోకేష్ మధ్య అర్థరాత్రి మీటింగ్ జరిగిందన్న రేవంత్
రేవంత్ రెడ్డి కేటీఆర్,లోకేష్ మీటింగ్ గురించి మొదటి సారి ఇష్టాగోష్టిగా మాట్లాడారు కానీ.. కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు ఇలాంటి ఆరోపణలు చేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి.. కేటీఆర్ , లోకేష్ రహస్య భేటీ జరిగిందని ఆరోపించారు. జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి పోటీ చేసినా.. ఆ అభ్యర్థికి మద్దతు ఇవ్వవొద్దని.. మాగంటి గోపీనాథ్ కుటంబసభ్యులకు టిక్కెట్ ఇస్తే వారికే సపోర్టు చేయాలని కోరినట్లుగా ఆయన ఆరోపించారు. ఉపఎన్నికల్లో టీడీపీ మద్దతు కోసం కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఇప్పటి వరకూ ఈ భేటీ అబద్దమో.. నిజమో స్పందించని బీఆర్ఎస్
ఈ ఆరోపణలపై ఇప్పటి వరకూ బీఆర్ఎస్ స్పందించలేదు. కేటీఆర్, లోకేష్ మధ్య భేటీ జరిగిందా లేదా అన్నది సస్పెన్స్ గానే ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా ఈ మీటింగ్ పై స్పందించలేదు. బీఆర్ఎస్ నేతలు కూడా ఖండించలేదు. ఇప్పుడు కొత్తగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ సహకరిస్తే.. మాగంటి గోపీనాథ్ కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇస్తామని లేదంటే ఇతరులుక టిక్కెట్ ఇస్తామని కేటీఆర్ చెప్పినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మాగంటి గోపీనాథ్ పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో ఉన్నారు. 2014లో ఆయనకు మొదటి సారి పోటీ చేసే అవకాశం దక్కింది. విజయం సాధించారు. అయితే మారిన పరిస్థితుల్లో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రెండు సార్లు విజయం సాధించారు. కానీ మూడో సారి గెలిచిన ఏడాదిన్నరకే చనిపోయారు. దాంతో ఉపఎన్నిక వచ్చింది.
కేసీఆర్ కుటుంబాన్ని వదిలి పెట్టేది లేదన్న రేవంత్ రెడ్డి
ఇదే చిట్ చాట్‌లో రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిపై విమర్శలు చేశారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో హడావుడి చేయడం లేదని.. నిందితుల్ని వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. అన్ని విచారణలు పారదర్శకంగా జరుగుతాయన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని..తాము వదిలి పెట్టే ప్రశ్నే ఉండదని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చురుకుగా సాగుతోందని. అరెస్టులు కూడా ఉంటాయన్నారు.





















