Maoist Latest News: మావోయిస్టుల కౌంటర్ ఎటాక్; భద్రతా బలగాలపై ఎదురుదాడి వెనుక అసలు కారణాలివే!
Maoist Latest News: పీపుల్స్ వార్ సిద్ధాంతం ప్రకారం విప్లవకారుడు దీర్ఘకాలిక ప్రజాయుద్ధం దిశగా నడవాలి. ఇలాంటి ప్రయాణంలో నిర్బంధం ఎక్కువ అయినా ముందుకు పోవాలి,

Maoist Latest News: ఈ వార్త హెడ్‌లైన్ చూడగానే కొంచెం అతిశయోక్తి అనిపించవచ్చు. అవును, 'ఆపరేషన్ కగార్' ప్రారంభమైనప్పటి నుంచి మావోయిస్టు పార్టీ మునుపెన్నడూ చూడలేనంత నష్టాన్ని చవి చూసింది. గత మూడు నెలల్లో పార్టీకి మూల స్తంభాలైన నాయకులను కోల్పోయింది. మావోయిస్టు క్యాడర్ చెల్లాచెదురైంది. చాలా మంది లొంగిపోయారు. మరికొందరు పోలీసులకు కోవర్టులుగా మారారు. పార్టీ ఉనికి ప్రశ్నార్థకమవుతున్న తరుణంలో భద్రతా బలగాలపై కౌంటర్ ఎటాక్ చేస్తుందన్న వార్త నిజంగానే పలు అనుమానాలకు తావిస్తుంది. అయితే ఇది నిజమే. జనవరి నుంి జూన్ నెల వరకు ప్రతీ ఏటా మావోయిస్టు పార్టీ చేసే వ్యూహాత్మక దాడుల్లో భాగమే ఈ కౌంటర్ ఎటాక్. అదేంటో తెలుసుకుందాం.
ఛత్తీస్గఢ్లో మందుపాతర పేల్చిన మావోయిస్టులు, అదనపు ఎస్పీ మృతి
గత కొద్ది రోజులుగా ఛత్తీస్‌గఢ్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు తూటాల వర్షం కురిపిస్తున్నాయి. ఈ ఎన్‌కౌంటర్లలో ఏకంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతి చెందారు. ఆయనతోపాటు మరో 27 మంది మావోయిస్టులు చనిపోయారు. అంతకు మునుపు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. మరో కేంద్ర కమిటీ సభ్యుడు, వైఎస్ హయాంలో శాంతి చర్చల్లో పాల్గొన్న నాయకుడు సుధాకర్ సైతం ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్ అలియాస్ మైలారపు అడెళ్లు ఎన్‌కౌంటర్‌లోనే చనిపోయారు. పెద్ద ఎత్తున ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో మావోయిస్టులు పట్టు కోల్పోతున్నట్లు, భద్రతా బలగాలు పైచేయి సాధిస్తున్నట్లు అర్థమవుతుంది. అయితే, గత కొద్ది రోజులుగా జరుగుతున్న పోలీసు బలగాల దాడులకు ప్రతీకారంగా మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలోని కొంటా సమీపంలోని డోండ్రాలో పోలీసుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఐఈడీలను పేల్చారు. ఈ ఘటనలో కొంటా డివిజన్ అదనపు ఎస్పీ ఆకాశ్ రావు తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ఆయనతోపాటు డీఎస్పీ, సీఐలు సైతం గాయపడ్డారు. అయితే, మావోయిస్టుల ముఖ్యనేతల ఎన్‌కౌంటర్లకు ప్రతీకార దాడినా లేదా వ్యూహాత్మక దాడులా అన్న చర్చ ఇప్పుడు సాగుతోంది.
కీలక మావోయిస్టులు చనిపోయినా దాడులు చేయడం మావోయిస్టు వ్యూహం
గత కొద్ది రోజులుగా చాలా కీలక నేతలను మావోయిస్టు పార్టీ కోల్పోయింది. చాలా మంది పార్టీ సభ్యులు చనిపోయారు. కొందరు లొంగిపోయారు. ఈ తరుణంలో పార్టీ ఉనికి కాపాడుకోవడం కష్టమన్న వ్యాఖ్యలు వినిపించాయి. అయితే ఇలాంటి తరుణంలో దాడులు చేయడం మావోయిస్టు పార్టీ సిద్ధాంతంలో భాగమని చాలా తక్కువ మందికి తెలుసు. పార్టీ మనుగడకు ఇలాంటి సందర్భాల్లో ఎదురు దాడులు చేయడం అనేది ఆ పార్టీ వ్యూహంలోనూ, సిద్ధాంతంలోనూ ఉన్నాయి. ఆ పార్టీ సిద్ధాంతంలో పార్టీ కష్టాలు ఎదుర్కొనే సమయంలో ఎందుకు దాడులు చేయాలన్నదానికి కారణాలేంటో తెలుసుకుందాం
పార్టీ క్యాడర్లో నైతిక స్థైర్యం పెంచే దాడులు
మావోయిస్టు పార్టీ ఏకంగా తమ పార్టీ సుప్రీం లీడర్ నంబాల కేశవరావును కోల్పోయింది. ఇది ఆ పార్టీ క్యాడర్‌లోనూ, సానుభూతిపరుల్లోనూ తీవ్ర నిరాశ కలిగించే అంశం. భద్రతా బలగాలతో జరిపే పోరాటంలో కీలక ఆదేశాలు ఇచ్చే సుప్రీం కమాండర్‌ను ఆ పార్టీ కోల్పోతే, ఇంక ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఆ క్యాడర్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇలాంటి పరిస్థితులను ఊహించిన మావోయిస్టు పార్టీ ఇలాంటి సందర్భాల్లో దాడులు చేయడం ద్వారా పార్టీని బతికించుకోవచ్చన్న సిద్ధాంతాన్ని తయారు చేసుకుంది. ఇలాంటి సమయాల్లో చేసే దాడులు పార్టీ క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపుతాయి. వారి నైతిక స్థైర్యాన్ని పెంచి పోరాటం దిశగా నడిపిస్తాయని మావోయిస్టు పార్టీ నేతలు చెబుతారు. ఉద్యమాన్ని తిరిగి కొనసాగించడానికి, పార్టీ బలంగానే ఉందని సందేశం ఇవ్వడానికి ఈ దాడులు ఉపయోగపడతాయని చెబుతారు.
బలంగా ఉన్నామన్న సందేశాత్మక దాడులు
పోలీసు బలగాలు చేసే దాడుల వల్ల తామేమీ బలహీనపడలేదన్న సందేశం ఇవ్వడానికి కూడా మావోయిస్టు పార్టీ ఇలాంటి ప్రతి దాడులను చేస్తుంది. భద్రతా దళాలు మావోయిస్టులను బలహీనపరిచాయని, ఇక ఆ పార్టీ బతికి బట్టకట్టడం కష్టమన్న ప్రచారం సాగుతున్న తరుణంలో తమ ఉనికిని దాడుల ద్వారా గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తుందని మాజీ మావోయిస్టు కీలక నేతలు చెబుతున్నారు. తమ పార్టీని అంత తేలికగా తీసిపారవేయవద్దనే సంకేతాన్ని ప్రభుత్వానికి, ప్రజలకు, అంతర్జాతీయ సమాజానికి ఇచ్చే సందేశాత్మక దాడులుగా చెప్పవచ్చు.
సిద్ధాంతపరమైన ప్రతీకార దాడులు
మావోయిస్టు పార్టీలోని కీలక నాయకులు పోలీసు బలగాల చేతుల్లో చనిపోతే దానికి ప్రతీకారం తీర్చుకోవడం మావోయిస్టు పార్టీ సిద్ధాంతంలో ఓ భాగం. తమతోపాటు ఎన్నో కష్ట, నష్టాలకోర్చి, ప్రజల కోసం పని చేసే తమ సహచరులను కోల్పోయినందుకు వారికి నివాళిగా ఇలాంటి దాడులు చేసేందుకు మావోయిస్టులు సిద్ధపడతారు. ఈ దాడుల వల్ల పోలీసు బలగాలపైన ఒత్తిడి పెంచడం, తమ ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా దళాలు వ్యూహాత్మకంగా వెనకడుగు వేసేలా చేయడం ఇందులో ప్రధానమైన అంశాలు.
ప్రజా మద్దతు కోసం వ్యూహాత్మక దాడులు
తమను రూపుమాపేందుకు భద్రతా బలగాలు అమాయకులైన గిరిజనులను కూడా ఎన్‌కౌంటర్లలో కాల్చి చంపుతున్నాయంటూ, అందుకే ఈ ప్రతీకార దాడులు చేస్తున్నట్లు మావోయిస్టు పార్టీ నేతలు చెబుతుంటారు. ఇది కేవలం తమ నేతలు మాత్రమే కాకుండా, అమాయకమైన అటవీ ప్రాంత ప్రజలను ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని చెప్పడం, అందుకోసమే ఈ దాడులని ప్రచారం చేయడం ద్వారా ప్రజల మద్దతును, వారి సానుభూతిని ఆ పార్టీ పొందుతుంది. ఈ వ్యూహంతోనే సిద్ధాంతపరమైన దాడులకు ఆ పార్టీ వ్యూహ రచన చేస్తుంది.
పోలీసు బలగాలపై మానసిక యుద్ధం
పార్టీకి ఎదురుదెబ్బలు తగిలినప్పుడు తమపై భద్రతా బలగాలు పైచేయి సాధించకుండా ఉండేందుకు ఇలాంటి ప్రతీకార దాడులకు మావోయిస్టు పార్టీ సిద్ధపడుతుంది. ఇలాంటి దాడులు పోలీసు బలగాలపై మానసికంగా ఒత్తిడి పెంచే ఉద్దేశంతో చేస్తుంటారు. పోలీసు బలగాలపై మెరుపు దాడులకు దిగడం, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మందుపాతరలు పేల్చడం వల్ల పోలీసు బలగాల కదలికలను నియంత్రిస్తారు. కూంబింగ్ ఆపరేషన్లను తాత్కాలికంగా నిలుపుదల చేసే వ్యూహంలో ఇది భాగం.
తమ విప్లవ సిద్ధాంతం సజీవమని చెప్పే ప్రయత్నం
మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బలు తగిలినా తమ విప్లవం, తమ సిద్ధాంతం సజీవమైనదని ప్రజలకు, మీడియా వర్గాలకు సందేశం ఇచ్చే ఉద్దేశంతో కూడా ఇలాంటి దాడులకు మావోయిస్టు పార్టీ సిద్ధపడుతుంది. తాము చేసే ప్రజా డిమాండ్లు చర్చకు పెట్టేందుకు కూడా ఇలాంటి దాడులు సహకరిస్తాయన్నది మావోయిస్టు నేతల నమ్మకం. పీపుల్స్ వార్ సిద్ధాంతం ప్రకారం విప్లవకారుడు దీర్ఘకాలిక ప్రజా యుద్ధం దిశగా నడవాలి. ఇలాంటి ప్రయాణంలో రాజ్యం నిర్బంధం ఎక్కువ చేసినా, విప్లవకారులను నిర్మూలించే వ్యూహంతో సాగినా సిద్ధాంతపరంగా ముందుకు సాగిపోవాలి, దీర్ఘకాలిక ప్రజా యుద్ధం కోసం సన్నద్ధులుగా ఉండాలి. ఇది వారి సైద్ధాంతిక వ్యూహం.






















