Razakar Teaser: 'రజాకార్' మూవీ టీజర్‌పై మంత్రి కేటీఆర్ సీరియస్ - బీజేపీ జోకర్స్ అంటూ!
Razakar Teaser: రజాకార్ సినిమా టీజర్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్న ఈ సినిమాపై సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
Razakar Teaser: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయాలు కాక రేపుతున్నాయి. పార్టీల మధ్య విమర్శల వేడితో పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలన్నీ ఎవరి వ్యూహల్లో వాళ్లు మునిగిపోయారు. బీఆర్ఎస్ ఇప్పటికే 115 మంది అభ్యర్థులను ప్రకటించి ముందుగానే ఎన్నికలపై దూకుడు పెంచగా.. కాంగ్రెస్ ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించడంతో పాటు ఆరు గ్యారంటీల పేరుతో హామీలను ప్రకటించి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బండి సంజయ్‌ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత టీ బీజేపీలో కాస్త దూకుడు తగ్గగా.. ఇప్పుడు మళ్లీ జోష్ పెంచింది.
వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్న బీజేపీ మరో అస్త్రం రెడీ చేస్తోంది. సినిమాతో బీఆర్ఎస్ సర్కార్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. రజాకార్ల ఫైల్స్ పేరుతో సినిమా తీస్తామని తెలంగాణ బీజేపీ ఎప్పటినుంచో చెబుతుండగా.. తాజాగా మరో ముందడుగు వేసింది. సోమవారం ఏకంగా రజాకార్ సినిమా టీజర్‌ను విడుదల అయింది. ఈ టీజర్ రాజకీయంగా వివాదాస్పదంగా మారుతుండగా.. దీనిపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నారు. కాంట్రవర్సీగా మారిన ఈ టీజర్‌పై మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్‌లో స్పందించారు.
తెలంగాణలో తమ రాజకీయ ప్రచారం కోసం మత హింసను ప్రేరేపించడానికి బీజేపీకి చెందిన కొంతమంది జోకర్లు తమ శాయశక్తులా కృషి చేస్తున్నారని కేటీఆర్ సీరియస్ అయ్యారు. తెలంగాణ శాంతిభద్రతలు దెబ్బతినకుండా చూసేందుకు సెన్సార్ బోర్డుకు ఈ విషయాన్ని తీసుకెళ్తామని తెలిపారు. తెలంగాణ పోలీసులు కూడా శాంతిభద్రతలకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటారని చెప్పారు. స్వార్థ రాజకీయాల కోసం మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఖుర్రం ముబాషిర్ అనే జర్నలిస్ట్ తన ట్విట్టర్‌లో రజాకార్ సినిమా టీజర్‌ను పోస్ట్ చేస్తూ.. మంత్రి కేటీఆర్, తెలంగాణ సీఎంవో, హరీష్ రావు, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, హోంమంత్రి మహమూద్ అలీ హ్యాండిల్స్‌కు ట్యాగ్ చేశారు.
రజాకార్ సినిమా టీజర్ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందని, చరిత్ర గురించి బూటకపు ప్రచారం చేస్తున్నారని జర్నలిస్ట్ ముబాషిర్ ఆరోపించారు. ఈ సినిమా విడుదలను నిలిపివేసి తెలంగాణలో శాంతిభద్రతలను కాపాడాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీంతో ఆయన పోస్ట్‌కు మంత్రి కేటీఆర్ రిప్లై ఇస్తూ టీజర్‌పై మండిపడ్డారు. ముస్లింలను నేరస్తులుగా ఈ టీజర్‌లో చూపించడంపై ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి. ఈ సినిమాను విడుదల కానివ్వమని, అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాయి.
రజాకార్ సినిమా యాటా సత్యనారాయణ దర్శకత్వంలో వస్తుండగా.. గూడురు నారాయణ రెడ్డి నిర్మిస్తున్నారు. వీరి వెనుక బీజేపీ ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో రజాకార్ల ఫైల్స్ సినిమాను తెరకెక్కిస్తామని రాష్ట్ర బీజేపీ నేతలు బహిరంగంగా ప్రకటనలు చేశారు. అంతేకాకుండా గతంలో కర్ణాటక ఎన్నికల సమయంలో ది కేరళ స్టోరీ సినిమా విడుదల అవ్వగా.. దీనికి బీజేపీ బహిరంగంగానే మద్దతు ఇచ్చింది. అలాగే పశ్చిమబెంగాల్ ఎన్నికల సమయంలో కశ్మీర్ ఫైల్స్ అనే సినిమా రాగా.. ఇది దేశవ్యాప్తంగా పెద్ద వివాదాస్పదమైంది. ఈ సినిమా చూడాల్సిందిగా స్వయంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల క్రమంలో రజాకార్ సినిమా వస్తుండటం గమనార్హం.