![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rangam Bhavishyavani: 'ఏం ఆ మాత్రం కష్టపడలేరా?' - లేకుంటే సోమరిపోతులు అవుతారన్న అమ్మవారు, భవిష్యవాణిలో ఏం చెప్పారంటే?
Ujjaini Mahakali Bonalu: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం రంగం కార్యక్రమంలో స్వర్ణలత భవిష్య వాణి వినిపించారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని చెప్పారు.
![Rangam Bhavishyavani: 'ఏం ఆ మాత్రం కష్టపడలేరా?' - లేకుంటే సోమరిపోతులు అవుతారన్న అమ్మవారు, భవిష్యవాణిలో ఏం చెప్పారంటే? rangam bhavishyavani event in secunderabad ujjaini mahankali bonalu Rangam Bhavishyavani: 'ఏం ఆ మాత్రం కష్టపడలేరా?' - లేకుంటే సోమరిపోతులు అవుతారన్న అమ్మవారు, భవిష్యవాణిలో ఏం చెప్పారంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/22/b95f6d777df508598d8fcda85bade3971721628268858876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Swarnalatha Bhavishyavani In Secunderabad Ujjaini Temple: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభవంగా సాగుతున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. బోనం, వడి బియ్యం, చీర సారెలతో అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. బోనాల సందర్భంగా రంగం భవిష్యవాణి కార్యక్రమం జరిగింది. అమ్మవారి ఎదురుగా పచ్చికుండపై నిలుచున్న భక్తులకు అభయమిచ్చిన అనంతరం స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. తనకు సంతోషంగా ఉందని.. తనకు కావాల్సిన పూజలన్నీ అందిస్తున్నారని చెప్పారు. అయ్యవారు అడిగిన మరిన్ని ప్రశ్నలకు అమ్మవారు సమాధానం చెప్పారు. కాగా, రంగం నేపథ్యంలో మహంకాళి అమ్మవారి దర్శనాలను అధికారులు నిలిపేశారు. అంతకు ముందు అంబారీ ఉరేగింపు అందరినీ ఆకట్టుకుంది. సాయంత్రం 7 గంటలకు ఫలహారం బండ్ల ఊరేగింపుతో బోనాల జాతర ముగియనుంది.
భవిష్యవాణిలో ఏం చెప్పారంటే.?
ప్రశ్న: 250 ఏళ్లుగా లష్కర్‌కి వచ్చి ప్రజలను ఆశీర్వదిస్తున్నావ్. ఈ ఏడాది 16 రోజులుగా జాతర జరిపించుకున్నావ్. నీ ఆశీర్వాదం తెలుపవా.?
జ. ఈ ఏడాది పూజలు సంతోషంగా ఆనందంగా అందుకున్నాను. ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను. నన్ను కొలిచి నిండే నిలిచిన మహంకాళి నేను.
ప్ర. బోనాలు నీ పూజలో ప్రత్యేకం. బోనాలు ఎవరు, ఎలా జరిపించాలి.?
జ. ఏ బోనం అయినా, ఎవరు ఎతుకొచ్చినా ఫర్వాలేదు. సంతోషంగా అందుకునేది నేనే. వీళ్లు వాళ్లు తేవాలని సందేహం పెట్టుకోకండి. ఎవరు తెచ్చిన సంతోషంగా అందుకునే బాధ్యత నాది.
ప్ర. వర్షాలు ఎలా కురుస్తాయి. పాడి పంటలు ఎలా ఉంటాయని ఆశీర్వదిస్తావు. వ్యాధులు లేకుండా ఎలా చూస్తావ్ ?
జ. కోరినంత వర్షాలు ఉంటాయి. మంచిగా చూసుకుంటాను. ఎటువంటి లోటు లేదు మీకు. మీరు ఆనందంగా, సంతోషంగా ఉండండి. అనుమానాలు పెట్టుకోకండి. నన్ను నమ్ముకున్న వారిని కాపాడుకుంటాను.
ప్ర. కోట్ల మంది ప్రజలు నీ దర్శనం చేసుకున్నారు. 48 గంటలు వర్షంలో తడిచి దర్శనం చేసుకున్నారు. నీ తృప్తిని తెలియజేయవా?
జ. నా దర్శనం చేసుకోవాలంటే ఆ మాత్రం కష్టపడాలి. లేదంటే సోమరిపోతులు అవుతారు. పిల్లలు, పెద్దలు, జంతువులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకుంటాను.
ప్ర. ఇంకా ఏమైనా చేయాల్సి ఉందా అమ్మ. నువ్వు ఏమి కోరుకుంటున్నావ్.?
జ. నా రూపం పెట్టాలి అనుకుంటున్నారు కదా .. పెట్టండి. ఎవరు ఏం చేసినా, ఎవరెంత అడ్డుపడిన నా రూపం నేను పెట్టించుకుంటాను. తప్పనిసరిగా నా రూపాన్ని నేను నిలబెట్టుకుంటా.
ప్ర. ఇది నీ ఆశీర్వాదం కాదు. ఆదేశాలుగా భావించి ఆ కార్యక్రమంలో వుంటాం.
జ. నా గ్రామ ప్రజలు అందరికీ నేను సంతోషంగా ఉండటానికి పనులన్నీ చేసిపెడతాను.
ప్ర. ప్రజలు వ్యాధులు, డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. వారికి నీ చల్లని చూపులు కావాలి.
జ. పాడిపంటలు ఇదివరకు లాగా పండించడం లేదు. ఔషధాలు ఎక్కువగా వాడుతున్నారు. అందుకే అనారోగ్యం. వాటిని తగ్గించుకుంటే మీకు వ్యాధులు తగ్గుతాయి.
ప్ర. బలి కార్యక్రమం నచ్చిందా అమ్మ.?
జ. మీకు నచ్చింది ఇస్తున్నారు. దానితోనే సంతోషపడుతున్నాను.
ప్ర. భక్తులను ఆదరించి, ఆశీర్వదించు తల్లి.
జ. సంతోషంగా ఘనంగా అందుకున్నాను. పిల్లలకు, గర్భిణులకు ఏం ఇబ్బంది రానివ్వను. అందరినీ సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటాను. అని భవిష్యవాణిలో అమ్మవారి ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)