TSPSC Chairman Resignatio Twist : టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామాను ఆమోదించని గవర్నర్ - అసలు ట్విస్ట్ ఏమిటంటే ?
TSPSC Chairman : టీఎస్‌పీఎస్సీ చైర్మన్ రాజీనామా ను గవర్నర్ ఆమోదించినట్లుగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని రాజ్ భవన్ వర్గాలు చెబుతున్నాయి. గవర్నర్ పుదుచ్చేరిలో ఉన్నారంటున్నారు.
TSPSC Chairman Resignatio Twist : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( TSPSC ) చైర్మన్ పదవికి జనార్ధన్ రెడ్డి రాజీనామా చేయడం.. ఆయన రాజీనామాను గవర్నర్ తమిళిసై ఆమోదించి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపినట్టు ప్రచారం జరిగింది. అయితే జనార్ధన్ రెడ్డి రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని రాజభవన్ వర్గాలు వెల్లడించాయి. పేపర్ లీకేజ్ కి బాధ్యులు ఎవరో తేల్చకుండా రాజీనామాను ఆమోదించవద్దని రాష్ట్ర గవర్నర్ తమిళసై నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
సోమవారం టీఎస్‌పీఎస్సీ (TSPSC) ఛైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి (Janardhan Reddy) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన కొద్దిసేపటికే ఛైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేశారు. రాజీనామాకు ముందు బోర్టుకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఆ తర్వాత గవర్నర్ తమిళిసైకి జనార్దన్ రెడ్డి రాజీనామా సమర్పించారు. 2021 మే నెలలో TSPSC ఛైర్మన్‌గా జనార్దన్ రెడ్డి నియమితులయ్యారు. ఇటీవల టీఎస్‌పీఎస్సీ గ్రూప్ - 1 పేపర్ లీకేజీ, పలు పరీక్షల నిర్వహణకు సంబంధించిన అంశాలపై టీఎస్‌పీఎస్సీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కమిషన్‌ను ప్రక్షాళన చేయాలని, ఛైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా చేయాలనే డిమాండ్లు వచ్చాయి. కానీ జనార్ధన్ రెడ్డి పట్టించుకోలేదు. హఠాత్తుగా ప్రభుత్వం మారగానే ఆయన రాజీనామా సమర్పించారు.
పేపర్ లీకేజీతో, నిరుద్యోగుల దురవస్థతో ఈ టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని గతంలోనే రాష్ట్రపతికి లేఖ రాశారు గర్నవర్ తమిళిసై.. ఆ లేఖను DoPT (డీఓపీటీ)కి ఫార్వర్డ్ చేసింది రాష్టపతి భవన్.. DoPT ద్వారా అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి వారి స్టాండ్ కోరుతూ గతంలోనే లేఖ అందినట్టుగా తెలుస్తుండగా.. గత ప్రభుత్వం దానిపై స్పందించలేదట.. ఇక, ఇప్పుడు.. కోర్టు కేసులు, గతంలో తాను చేసిన సూచన పెండింగ్ లో వుండగానే.. జనార్ధన్ రెడ్డి రాజీనామా చేయడంపై గవర్నర్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.. నిరుద్యోగులకు, విద్యార్థులకు న్యాయం జరగకుండానే.. జనార్దన్ రెడ్డి రాజీనామా ఆమోదించడం ఎలా అని గవర్నర్ ప్రశ్నించారట.. రాజీనామాను తాను ఆమోదించలేదు అని గవర్నర్ తేల్చి చెప్పినట్లు రాజ్ భవన్ వర్గాలు చెబుతున్నాయి.
జనార్ధన్‌రెడ్డి రాజీనామాపై తెలంగాణ కొత్త ప్రభుత్వం నిర్ణయాన్ని గవర్నర్ తెలుసుకునే అవకాశం ఉందంటున్నారు.. అంతేకాకుండా.. ఈ వ్యవహారంలో లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటారని సమాచారం.. కొత్తగా ఉన్నత స్థాయిలో మరో విచారణ కమిటీ వేసి బాధ్యులను గుర్తించి, శిక్షించి, మరో సారి ఇలాంటి లీకేజీ ఘటనలు పునరావృతం కాకుండా.. కఠిన చర్యలు తీసుకోవాలని, నిరుద్యోగుల పట్ల భాధ్యతగా వ్యవరించి, వారికి న్యాయం చేయాలని గవర్నర్ తమిళిసై సూచించినట్టు రాజ్‌భవన్ వర్గాలు చెబుతున్నాయి.