Rains: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన - తెలంగాణలో పిడుగు పడి వ్యక్తి మృతి
Telugu States: తెలుగు రాష్ట్రాల్లో రాగల 5 రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అటు, పిడుగుపడి తెలంగాణలో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
Rains In Telugu States: బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది ఈశాన్య దిశగా పయనించి ఈ నెల 24 నాటికి వాయుగుండంగా బలపడనుందని అధికారులు చెప్పారు. అయితే, వాయుగుండ దిశపై 2, 3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ పేర్కొంది. మరోవైపు, నైరుతి రుతుపవనాలు ఆదివారం దేశంలోని నికోబార్ దీవులకు చేరుకున్నాయని.. ఈ నెల 31 నాటికి కేరళలో ప్రవేశిస్తాయని అంచనా వేసింది. అనంతరం జూన్ 5 నాటికి రాయలసీమ మీదుగా ఏపీలోకి ప్రవేశించే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.
ఏపీలో రాబోయే 5 రోజులు
ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో ఏపీలో రాబోయే 5 రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, అనంతపురం, సత్యసాయి, వైఎస్సార్ కడప, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అన్నారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30- 40 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తెలంగాణలో..
జూన్ 8 నుంచి 11 మధ్య నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించనున్నట్లు హైదరాాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. సోమవారం నుంచి మరో 4 రోజులు వర్షాలు కురుస్తాయని రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 22న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లా వర్షపాతం నమోదు కావొచ్చని అన్నారు. అలాగే, ఈ నెల 23న ఖమ్మం, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయని పేర్కొంది.
పిడుగుపాటుకు వ్యక్తి బలి
వికారాబాద్ జిల్లాలో మరో వ్యక్తి పిడుగుపాటుకు బలయ్యాడు. తాండూరు పట్టణంలోని పాత తాండూరులో ఓ వ్యక్తి పిడుగుపాటుతో మృతి చెందగా.. మరో బాలునికి తీవ్ర గాయాలయ్యాయి. పాత తాండూర్ సమీపంలో హోటల్ నిర్వహిస్తున్న శేఖర్ అనే వ్యక్తి కాలకృత్యాల కోసం బయటికి వెళ్లగా, ఒక్కసారిగా పిడుగు పడడంతో చెట్టు కింద ఉన్న శేఖర్ మృతి చెందాడు. చెట్టు కూడా పూర్తిగా కాలిపోయింది. మరోవైపు దగ్గరలోని మైదానంలో క్రికెట్ ఆడుతున్న బాలుడు హనుమంతు వర్షానికి చెట్టు నీడకు వెళ్లగా అతనికి కూడా గాయాలయ్యాయి. స్థానికులు బాలున్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. మృతుడు శేఖర్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, ఆదివారం పిడుగుపాటుకు యాలాల మండలంలోని రెండు చోట్ల పిడుగులు పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. జంటుపల్లి గ్రామంలో ఇద్దరు, బెన్నూరు గ్రామంలో ఒకరు పిడుగుపాటుకు మృతి చెందారు. 24 గంటల వ్యవధిలోనే మరో వ్యక్తి పిడుగు పడి మృతి చెందడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. అయితే, వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద ఉండొద్దని సూచించారు.