Rains in AP Telangana: అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో అక్కడ భారీ వర్షాలు
Rains in Telangana: అల్పపీడనం బరింత బలపడటంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. దక్షిణ కోస్తా ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం తాజాగా ఉత్తర కోస్తా ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా మారింది. అనుబంధ ఉపరిత ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల పైన విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి వైపు వంగి ఉంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవన ద్రోణి జైసల్మీర్, కోటా, గుణ, సాగర్, జబల్ పూర్, పెండ్రా రోడ్డు, అల్పపీడన ప్రాంతం ఉత్తర ఒడిశా దాని పరిసర ప్రాంతాల మీదుగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు వెళ్లి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. తూర్పు పడమర గాలుల కోత ఉత్తర భారత ద్వీపకల్పమైన 19 డిగ్రీ ఉత్తర అక్షాంశం వెంట సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ, 7.6 కి.మీ మధ్య విస్తరించి ఉంది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
ఒడిశా తీరంలో అల్పపీడనం బలపడటంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు కురవనున్నాయి. నేటి నుంచి మరో రెండు రోజులపాటు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో భారీ వర్షాలు కురవనున్నాయని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఈ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంటలు వేసే పరిస్థితి కనిపించడం లేదు.
Synoptic features of weather inference for Andhra Pradesh in Telugu language dated:- 14.07.2022. pic.twitter.com/safNcvxi8u
— MC Amaravati (@AmaravatiMc) July 14, 2022
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనూ అల్పపీడనం ప్రభావం తక్కువగానే ఉంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో నేటి నుంచి 2 రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) July 14, 2022
తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో వారం రోజుల నుంచి పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం వర్షాలు తగ్గుముఖం పట్టాయి. నేడు సైతం రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కొన్ని జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ అర్బన్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ నేటి నుంచి రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.