Weather Latest News: కూల్ కూల్‌గా తెలుగు రాష్ట్రాలు, 3 రోజులపాటు పలు జిల్లాల్లో వర్షాలు- IMD ఎల్లో అలర్ట్
నైరుతి రుతుపవనాల రాకతో ఏపీ, తెలంగాణలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. పలు జిల్లాల్లో వర్షాలతో పగటి ఉష్ణోగ్రతలు ఇదివరకు దిగొచ్చాయి. చల్లని గాలులు వీస్తున్నాయి.

అమరావతి: వారం రోజులకిందట కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు మే 26న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఎండల నుంచి ఇటీవల ఉపశమనం లభించగా.. తాజాగా చల్లని గాలులు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రివేళ కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం దిగొస్తున్నాయి.
ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీలో 3 రోజులపాటు చెదురుమదురుగా భారీ వర్షాలు కురవనున్నాయి. కొన్నిచోట్ల 50 నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మే 27న (మంగళవారం) ఏపీలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలతో పాటు కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అదే సమయంలో మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
రాష్ట్రంలో మూడు రోజులపాటు చెదురుమదురుగా భారీ వర్షాలతో పాటుగా, కొన్నిచోట్ల 50-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) May 26, 2025
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి దగ్గర నిలబడరాదన్నారు. pic.twitter.com/bKqYZtwH3w
నైరుతి రుతుపవనాలు గతేడాది కంటే వారం రోజులు ముందుగానే తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. రుతుపవనాలు వేగంగా, చురుకుగా కదలడానికి వాతావరణం అనుకూలంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలు త్వరగా పడుతున్నాయని, రైతులు సాగుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు వచ్చిన పంట దిగుబడిని వానలకు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణలోనూ 3 రోజులపాటు వర్షాలు
నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయి. పలు జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5-7°C తక్కువగా ఉండే అవకాశం ఉంది. కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పలు జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
7-day forecast(NIGHT) and Evening Inference of TELANGANA based on 1200 UTC issued at 2030 hours IST Dated :26-05-2025 @TelanganaCS @DCsofIndia @IASassociation @TelanganaDGP @TelanganaCMO @GHMCOnline @HYDTP @IasTelangana @tg_weather pic.twitter.com/bOmiBAWXcO
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) May 26, 2025
నేటి రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాలలో పలుచోట్ల వర్షాలు పడతాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.






















