KA Paul: పవన్‌ది ఐరన్ లెగ్, తెలంగాణలో అధికారం మాదే : కేఏ పాల్
KA Paul: తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. త్వరలోనే తెలంగాణలో ప్రజా శాంతి పార్టీ అభ్యర్ధులను ప్రకటిస్తామన్నారు.
KA Paul: తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. సోమవారం ఆయన విశాఖ పట్నంలో మీడియాతో మాటాడుతూ.. త్వరలోనే తెలంగాణలో ప్రజా శాంతి పార్టీ అభ్యర్ధులను ప్రకటిస్తామన్నారు. ప్రజలను కలుసుకునేందుకు త్వరలో యాత్ర చేయనున్నట్లు చెప్పారు. తెలంగాణలో 119 స్థానాల్లో ప్రజా శాంతి పార్టీ అభ్యర్ధులు పోటీ చేస్తారని, అధికార బీఎస్సీ, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలను తెలంగాణ ప్రజలు నమ్మడం లేదన్నారు.
కులమతాలకు అతీతంగా ఎన్నికల్లో గెలిచి తెలంగాణను అభివృద్ధి చేస్తానని కేఏ పాల్ అన్నారు. దేశం, తెలుగు రాష్ట్రాలను కాపాడుకుంటున్నానని చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి రూపాల స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటు పరం చేయకుండా ఆపేశారని అన్నారు. ఏపీలో బీజేపీ లేదని అన్నారు. ఇజ్రాయెల్, పాలస్తీనల గొడవలు ఆగిపోవలని దేవుడికి ప్రార్థన చేశానని. శాంతి కోసం మీరందరు కూడా ప్రార్థన చేయాలని కోరారు. డిసెంబర్10 తేదీన ప్రపంచ గ్లోబల్ క్రిస్మస్ వేడుకలు చేస్తున్నామని, గ్లోబల్ క్రిస్మస్ వేడుకలకు 5 వేల మందిని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. డిసెంబర్ 10వ తేదీన ఇక్కడ నుంచే 200 దేశాలకి శాంతి సందేశం ఇస్తానని కేఏ పాల్ పేర్కొన్నారు.
పవన్‌తో పని చేసిన పార్టీలకు పుట్టగతులు లేవు
జనసేనతో కలిసి పని చేసిన పార్టీలకు పట్టగతులు లేకుండా పోయాయని కేఏ పాల్ అన్నారు. గత ఎన్నికల్లో పవన్‌తో కలిసి పోటీ చేసిన పార్టీలన్నీ దారుణంగా ఓడిపోయాయన్నారు. ఆయా పార్టీలకు ఐదు శాతం ఓట్లు కూడా రాలేదని విమర్శించారు. పవన్‌ది ఐరన్ లెగ్ అన్నారు. పవన్‌కు బీజేపీ నేతలు, ప్రధాని మోదీ, ఎవరూ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ రూ.1,500 కోట్లకు చంద్రబాబుకు అమ్ముడుపోయాడని కేఏ పాల్ చెప్పారు. అమరావతిలో బినామీల పేర్లతో టీడీపీ నాయకులు భూములు కొనుగోలు చేశారని ఆయన తెలిపారు. పవన్ ఒక రోజు ఎన్డీఏలో ఉన్నానంటాడని, మరొక రోజు లేనని చెబుతాడని, రేపు ఏమంటారో చూడాలన్నారు. పవన్ అవినీతిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తే తాను ఎన్డీయేలో ఉన్నానని పవన్ అంటున్నాడని పాల్ మండిపడ్డారు.
చంద్రబాబు దేవుడిని కూడా దూరం చేసుకున్నారు
చంద్రబాబు అవినీతిలో పుట్టి పెరిగారని, పెంచి పోషించారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధ్వజమెత్తారు. చివరికి దేవుడిని కూడా శత్రువుని చేసుకున్నారంటూ విమర్శించారు. చంద్రబాబుకు హైకోర్టులో బెయిల్ రాకపోవడం ఊహించిందేనని అన్నారు. తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని, చంద్రబాబు ఇప్పటికైనా తన తప్పులను, అవినీతిని ఒప్పుకోవాలని హితవు పలికారు. టీడీపీ వాళ్లు ప్రజా శాంతి పార్టీలో చేరితే వారందరిని గెలిపిస్తానని అన్నారు.
లోకేష్ ఢిల్లీలో ఎంత తిరిగినా ఎవరూ పట్టించుకోలేదని, చంద్రబాబు ఆణిముత్యం కాదని, పాపపు ముత్యం, అవినీతి ముత్యం అని ఎద్దేవా చేశారు. ఏ తప్పు చేయకపోతే లోకేశ్ ఎందుకు ఢిల్లీలో దాక్కున్నారని ప్రశ్నించారు. లోకేశ్ ఢిల్లీలో బీజేపీ పెద్దల కాళ్లవేళ్లా పడినా అపాయింట్‌మెంట్ దొరకలేదని అన్నారు. ఆరు లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారనే విమర్శలు చంద్రబాబు మీద ఉన్నాయని పాల్ అన్నారు. చంద్రబాబు స్టీల్ ప్లాంట్ కోసం ఏనాడు పోరాటం చేయలేదని, ఆయన అదానీకి అమ్ముడుపోయాడని ఆరోపించారు. చంద్రబాబు అమరావతి కడతానని కట్టలేదని, పోలవరం పూర్తి చేయలేదని, ప్రత్యేక హోదా సాధించలేదని పేర్కొన్నారు.