Popular Front of India: ఏపీ, తెలంగాణలో ఎన్‌ఐఏ సోదాలు - నలుగురు అనుమానితుల పట్టివేత, మరికొందరికి నోటీసులు
NIA Raids: తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, ఆదిలాబాద్, భైంసాలో, ఏపీలోని నెల్లూరు, కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఎన్ఐఏ తనిఖీలు జరిగాయి. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (Popular Front of India) కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తెలుగు రాష్ట్రాల్లో ఎంట్రీ ఇచ్చింది. ఎన్‌ఐఏ బృందాలు ఆదివారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఏకకాలంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో తనిఖీలు చేసింది. తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, ఆదిలాబాద్, భైంసాలో పలువురు నిందితులు, అనుమానితుల ఇండ్లలో సోదాలు నిర్వహించింది. ఏపీలోని నెల్లూరు, కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో దాదాపు 5 గంటల పాటు ఎన్ఐఏ తనిఖీలు జరిగాయి. ఆదివారం జరిపిన సోదాలలో భాగంగా నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
తెలంగాణలో 38 చోట్ల ఎన్ఐఏ సోదాలు
ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన మూలాలు గత జూలైలోనే బయటపడ్డాయి. పీఎఫ్ఐ కేసులో జూలై 4న నిజామాబాద్ కమిషనరేట్ పోలీసులు జగిత్యాలకు చెందిన అబ్దుల్ ఖాదర్‌తో పాటు షేక్ షహదుల్లా, ఎండీ ఇమ్రాన్, అబ్దుల్ మోహిన్‌ను దేశద్రోహం కేసులో అరెస్టు చేశారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో 23 చోట్ల, హైదరాబాద్‌లో 4, జగిత్యాలలో 7, నిర్మల్‌లో 2, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్కోచోట ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది. నిజామాబాద్ జిల్లా బోధన్, నవీపేట, ఆర్మూర్, ఎడపల్లి, అర్సపల్లి, ఆటోనగర్, హౌసింగ్‌బోర్డు ఏరియాల్లో మొత్తం 23 ఇండ్లలో స్పెషల్ టీమ్ సోదాలు నిర్వహించింది. నిజామాబాద్‌లో దొరికిన సమాచారంతో నిర్మల్ జిల్లా భైంసా పట్టణం మదీనా కాలనీలోని రెండు ఇండ్లలో అధికారులు సోదాలు నిర్వహించినట్లు సమాచారం.
డైరీలు, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ
ఆదిలాబాద్ జిల్లా శాంతినగర్‌లో ఫిరోజ్‌ఖాన్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. అతడు ఇచ్చిన సమాచారంతో జిల్లా జైలులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అధికారులు విచారించారు. ఉగ్రవాద శిక్షణతో పాటు భైంసా అల్లర్లతో వీరికి సంబంధం ఉన్నదనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. తనిఖీలు చేపట్టిన సమయంలో ఐయాజ్ అనే వ్యక్తి ఇంట్లో లేకపోవడంతో సోమవారంలోగా తమ ముందు హాజరవ్వాలని నోటీసులు జారీ చేశారు. జగిత్యాల టవర్ సర్కిల్‌లోని కేర్ మెడికల్, టీఆర్‌నగర్‌లోని ఒక ఇంటిలో సోదాలు నిర్వహించి డైరీలు, పలు పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. కరీంనగర్‌లోని బంధువుల ఇంట్లో దాలదాచుకున్న జగిత్యాలకు చెందిన ఎండీ ఇర్ఫాన్ అనే యువకుడిని సైతం ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారంలో ఉన్న జామియా తలీముల్ ఇస్లాం లిలిబనత్ మదర్సాలో తనిఖీలు చేశారు. పీఎఫ్‌ఐతో సంబంధం ఉందనే అనుమానంతో మదర్సా నిర్వహకుడు అబ్దుల్ వాహబ్ సోదరుడు సలీంను ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏపీ, తెలంగాణలో ఆదివారం 38 ప్రాంతాల్లో సోదాలు చేసి, నలుగురిని అదుపులోకి తీసుకున్నామని ఎన్‌ఐఏ అధికారులు వెల్లడించారు. పలు చోట్ల నిందితుల వద్ద హార్డ్ డిస్క్‌లను, పలు కీలక డాక్యుమెంట్లను ఎన్‌ఐఏ బృందం స్వాధీనం చేసుకుని వివరాలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
నిజామాబాద్‌లో సోదాల కలకలం..
మొత్తం 38 చోట్ల తనిఖీలు చేపట్టగా.. అత్యధికంగా నిజామాబాద్‌లో 23 చోట్ల ఎన్ఐఏ సోదాలు చేయడం జిల్లాలో కలకలం రేపింది. రూ.8.31 లక్షల నగదు, కొన్ని డిజిటల్ ఐటమ్స్, హార్డు డిస్కులను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. మతకలహాలు సృష్టించేందుకు ఉగ్ర శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు. జులై 4న అబ్దుల్లా ఖాదీర్, షేక్ సహదుల్లా, ఇంబ్రాన్, అబ్దుల్ మోబిన్ అనే నలుగురు పీఎఫ్‌ఐ నేతలను తెలంగాణ పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. ఆ కేసులో వివరాలతో విచారణ ప్రారంభించినట్లు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.