నేడు మహబూబ్‌నగర్‌కు ప్రధాని మోదీ - 13,500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం తెలంగాణలో పర్యటించనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం (అక్టోబరు 1) తెలంగాణలో పర్యటించనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రధాని మోడీ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో మధ్యాహ్నం 1.35 గంటలకు మహబూబ్ నగర్ కు బయలుదేరతారు. మధ్యాహ్నం 2.10 గంటలకు మహబూబ్ నగర్ హెలిపాడ్ వద్దకు చేరుకోనున్న మోడీ, మధ్యాహ్నం 2.15 నుంచి 2.50 గంటల వరకు మహబూబ్ నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధాని మోడీ టూర్ కు బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. వేలాది మంది పోలీసులు భద్రతను పర్యవేక్షించనున్నారు.
13వేల కోట్లకుపైగా అభివృద్ధి పనులు
13,500 కోట్లతో చేపట్టనున్న పలు రకాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. నాగ్ పూర్-విజయవాడ ఎకనమిక్ కారిడార్ కు శంకుస్థాపన చేయనున్నారు. భారత్ పరియోజన ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్-విశాఖపట్నం కారిడార్ ను జాతికి అంకితం చేయనున్నారు. అయిల్ అండ్ గ్యాస్ ఫైప్ లైన్ ప్రాజెక్టుతో పాటు హైదరాబాద్-రాయచూరు ట్రైన్ ను ప్రారంభించనున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో రహదారులు, రైల్ నెట్ వర్క్, ఉన్నత విద్య, పెట్రోలియం, సహజవాయు.. తదితర ప్రాజెక్టులు ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కు చెందిన ఆరు కొత్త భవనాలను ప్రారంభిస్తారు.
ప్రధాని మోడీ మహబూబ్‌నగర్ పర్యటన షెడ్యూల్
రేపు ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.
అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్‌కు బయలుదేరతారు.
మధ్యాహ్నం 2:05 గంటలకు మహబూబ్‌నగర్‌కు చేరుకుంటారు.
2:15 నుంచి 2:50 వరకు పలు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.
బహిరంగ సభా స్థలికి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుని తెలంగాణలో బీజేపీ ఎన్నికల శంఖారాం పూరిస్తారు.
సాయంత్రం 4.10 గంటలకు మహబూబ్ నగర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
సాయంత్రం 4.45 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు.
మోడీ టూర్ కు వ్యతిరేకంగా పోస్టర్లు
మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన వేళ పోస్టర్ల కలకలం రేపుతున్నాయి. తెలంగాణ పుట్టుకను పదే పదే అవమానించిన మోడీకి, తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదంటూ పోస్టర్లు వెలిశాయి. ప్రస్తుతం ఈ పోస్టర్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తెలంగాణ రాష్ట్రాన్ని గడబిడగా తోపులాటలు, అణిచివేతల మధ్య విభజించారని పార్లమెంట్ లో మాట్లాడారు. చర్చ జరగకుండా ఏర్పడిన తెలంగాణలో ప్రజలు సంతోషంగా లేరంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలతో పోస్టర్లు ఏర్పాటు చేశారు. అక్టోబర్ 3న ప్రధాని మోడీ తెలంగాణకు వస్తారు. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొంటారు.
మోడీ నిజామాబాద్ పర్యటన షెడ్యూల్
అక్టోబర్ 3వ తేదీన మధ్యాహ్నం 2:55కి నిజామాబాద్‌కు చేరుకుంటారు.
3 గంటల నుంచి 3:35 వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు.
3:45 నుంచి 4:45 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు.
సాయంత్రం 5 గంటలకు నిజామాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బీదర్ బయలుదేరి వెళ్లనున్నారు.