PhonePe On ContractPe : మునుగోడు కాంట్రాక్ట్ పే పోస్టర్లపై ఫోన్ పే అభ్యంతరం, లోగో వాడినందుకు చట్టపరమైన చర్యలు!
PhonePe On ContractPe : మునుగోడులో ఇటీవల వెలసిన కాంట్రాక్ట్ పే పోస్టలపై ఫోన్ పే అభ్యంతరం తెలిపింది. తమ లోగోను ఉపయోగించినందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
PhonePe On ContractPe : మునుగోడు నియోజకవర్గంలో ఇటీవల కాంట్రాక్ట్ పే అంటూ బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి పేరిట పోస్టర్ల వెలిశాయి. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ తీసుకుని రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ వివాదంపై ఫోన్ పే సంస్థ స్పందించింది. కాంట్రాక్ట్ పే అంటూ కొన్ని ప్రసార మాధ్యమాలలో వస్తున్న వార్తలతో ఫోన్ పే కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఫోన్ పేకి కంపెనీకి ఏ పార్టీతో, అభ్యర్థితో ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవని ప్రకటించింది. ‘Contract Pe’ను రూపొందించడంలో Phone Pe లోగోను ఉపయోగించి తప్పుదారి పట్టించారని తెలిపింది. PhonePe లోగో వాడి మేధోసంపత్తి హక్కులను ఉల్లంఘించారని, దీనికి సంబంధించి భవిష్యత్తులో తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫోన్ పే తెలిపింది.
Contract pe charcha ..let's begin the show #MunugodeWithTRS #MunugoduBypoll #MunugodeContractor #MunugodeWithKCR pic.twitter.com/JQF7txAoXD
— India with BRS 🇮🇳🇮🇳 (@VikramK99724267) October 11, 2022
మునుగుడోలు కాంట్రాక్ట్ పే పోస్టర్లు
మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు కోసం రాజకీయా పార్టీలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. ఇప్పటిదాకా ఆరోపణలు, ప్రత్యారోపణల రూపంలోనే ఉన్న పోటీ ఇటీవల పోస్టర్లు అంటించే వరకూ వెళ్లింది. మునుగోడులోని చండూరు టౌన్ లో కాంట్రాక్ట్ పే పోస్టర్లు కలకలం రేపాయి. బీజేపీ అభ్యర్థి, మునుగోడు ఉప ఎన్నిక వచ్చేందుకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన ప్రత్యర్థులు రాత్రికి రాత్రే పోస్టర్లు అంటించారు. రాజగోపాల్ రెడ్డిని ఎద్దేవా చేస్తూ.. ఫోన్ పే తరహాలో కాంట్రాక్ట్ పే అంటూ ఆరోపించారు. ఏకంగా రూ.18 వేల కోట్లు లావాదేవీలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేటాయించారని ఆ పోస్టర్లలో ఉంది. దాదాపు వేల సంఖ్య ఇలాంటి పోస్టర్లను రోడ్ల పక్కన గోడలకు, దుకాణాలకు ఎక్కడపడితే అక్కడ అంటించారు. Contract Pe (కాంట్రాక్ట్ పే) అనే హెడ్డింగ్ తో ‘‘రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేటాయించడం జరిగింది. ట్రాన్సాక్షన్ ఐడీ BJP18THOUSANDCRORES. న్యూ రివార్డ్ ఎర్న్‌డ్ రూ.500 కోట్లు బోనస్’’ అని పోస్టర్లపై ముద్రించారు. ఇప్పటివరకు రాజగోపాల్ రెడ్డి ఆస్తులకు సంబంధించి ప్రత్యర్థులు అవినీతి ఆరోపణలు చేస్తూ వచ్చారు. మరో అడుగు ముందుకేసి ఆయనపై ఏకంగా పోస్టర్లు ఏర్పాటు చేయడం కలకలం రేపింది.
Karnataka | 'PayCM' posters featuring CM Basavaraj Bommai pasted on the walls in parts of Bengaluru by Congress
— ANI (@ANI) September 21, 2022
The QR code will take people to the '40% Commission Government' website recently launched by Congress to file complaints against the CM. pic.twitter.com/MfbZPhcnt5
కర్ణాటకలో పేసీఎం పోస్టర్లు
కర్ణాటక ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఇటీవల వినూత్న నిరసన చేపట్టింది. '40 పర్సెంట్ సర్కార్' అంటూ కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టింది. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఫోటో, క్యూఆర్‌కోడ్‌తో 'పేసీఎం' అని ముద్రించిన పోస్టర్లను కాంగ్రెస్.. బెంగళూర్ నగరమంతటా ఏర్పాటు చేసింది. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే యూజర్లను బీజేపీ పాలనపై ఫిర్యాదులు చేసే వెబ్‌సైట్‌కు తీసుకువెళ్లేలా దీన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కర్ణాటక సర్కార్ హయాంలో ఏ పని జరగాలన్న 40 శాతం కమిషన్ ప్రభుత్వానికి ముట్టజెప్పాలని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకే ఈ ప్రచారం చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్ లాంచ్ చేసింది. బీజేపీ ప్రభుత్వం లూటీదారులు, స్కామ్‌స్టర్‌లతో నిండిపోయిందని కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు.