Telangana Politics: 38మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు - మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Peddi Sudarshan Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరుపై సొంతపార్టీ ఎమ్మెల్యేలల్లోనే విశ్వాసం తగ్గిందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Telangana CM Revanth Reddy: గతేడాది జరిగిన ఎన్నికల్లో విజయంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. పార్టీలో సీనియర్లను కాదని, రేవంత్ రెడ్డిని అధిష్టానం సీఎం చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయన సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాజుకుందా?.. లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో పార్టీకి సీట్లు రాకపోవడమే దీనికి కారణమా అంటే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అవుననే చెబుతోంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పనితీరుపై సొంతపార్టీకి చెందిన ఎమ్మెల్యేలల్లోనే విశ్వాసం తగ్గిందని.. ఆయన అనుసరిస్తున్న విధానాలపై పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనలో చోటు చేసుకున్న ఘటనే దీనికి నిదర్శనమని పెద్ది సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.
సీఎం కావడం వారికి ఇష్టం లేదు
వరంగల్ బీఆర్‌ఎస్ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన .. సీఎం రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలను సొంత పార్టీ ఎమ్మెల్యేలే వ్యతిరేకిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఆ పార్టీలోని మెజార్జీ ఎమ్మెల్యేలకు ఇష్టం లేదన్నారు. సీఎం రేవంత్ పై సొంత పార్టీలోనే రోజురోజుకు అసమ్మతి గళం పెరుగుతుందని సుదర్శన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి పనితీరు పట్ల ఆయన పార్టీ ఎమ్మెల్యేల్లోనే సగం మందికి పైగా విశ్వాసం తగ్గిందని అన్నారు. గెలిచిన 64 మందిలో కేవలం 26 మందే రేవంత్ రెడ్డి వైపు ఉన్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
వారిద్దరికే ప్రాధాన్యం
మిగతా 38 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారని.. అందుకు నిదర్శనమే వరంగల్ లో ఎదురైన సంఘటన అని ఆయన తెలిపారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్‌బాబులకు మాత్రమే రేవంత్ రెడ్డి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. అంటే.. మిగిలిన మంత్రులపై రేవంత్ రెడ్డికి నమ్మకం లేదా అని ప్రశ్నించారు. కేబినెట్ మంత్రుల్లో ఈ ఇద్దరు మంత్రులు మాత్రమే ఆయన తీసుకుంటోన్న నిర్ణయాలను స్వాగతిస్తున్నారని పెద్దిరెడ్డి విమర్శించారు. తన సొంత పార్టీలోనే ధిక్కార స్వరం పెరిగి పోయిందని, అందుకే తన వర్గాన్ని పెంచుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువా కప్పుతున్నారంటూ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనను గాలికి వదిలేసి పార్టీ ఫిరాయింపులపైనే పూర్తి దృష్టి కేటాయించారంటూ సుదర్శన్ రెడ్డి విమర్శించారు. ఈ కారణంగానే రాష్ట్రంలో క్రైం రేటు విపరీతంగా పెరిగిపోయిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో గంటకో హత్య జరుగుతుందని సుదర్శన్ రెడ్డి ఆవేదన చెందారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందంటూ సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.