(Source: ECI/ABP News/ABP Majha)
Muslim Reservations : ముస్లిం రిజర్వేషన్లు 12 శాతానికి పెంచాలి - కేసీఆర్‌కు ఓవైసీ విజ్ఞప్తి !
ముస్లిం రిజర్వేషన్లను పెంచాలని తెలంగాణ సీఎంకేసీఆర్‌కు ఓవైసీ విజ్ఞప్తి చేశారు. సుధీర్ కమిషన్ సిఫార్సుల్ని అమలు చేయాలన్నారు.
Muslim Reservations : తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల ఎస్టీ రిజర్వేషన్లను పది శాతానికి పెంచుతూ జీవో జారీ చేస్తామని అమలు చేస్తారో లేదో చూస్తామని కేంద్రానికి గట్టి హెచ్చరిక జారీ చేశారు . ఇప్పుడు మజ్లిస్ అధినేత ఓవైసీ కూడా ముస్లింలకు ప్రస్తుతం ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్ల నుంచి ఎనిమిది నుంచి పన్నెండు శాతానికి పెంచాలని కోరారు. సుధీర్ కమిటీ ఈ మేరకు ప్రతిపాదనలు చేసిందని ఓవైసీ అంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ముస్లింల సామాజిక పరిస్థితి మారిందని అసదుద్దీన్ స్పష్టం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రిజర్వేషన్లను పెంచాల్సి ఉందని సీఎం కేసీఆర్ గుర్తించాలన్నారు.
తెలంగాణ ప్రభుత్వం సుధీర్ కమిటీ సిఫార్సుల్ని అమలు చేయాలన్న ఓవైసీ
తెలంగాణ ప్రభుత్వం ముస్లిం వర్గాలకు చెందిన ‘బీసీ–ఈ’ గ్రూపు పైన అధ్యయనం చేయడానికి మాత్రమే సుధీర్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ముస్లింలకు రిజర్వేషన్లను 4శాతం నుంచి 12శాతానికి పెంచాలనే ఉద్దేశంతోనే ఈ కమిషన్ ఏర్పాటయ్యింది. సుధీర్ కమిషన్, తెలంగాణ బీసీ కమిషన్ అధ్యయనంలో భాగంగా బీసీ ఎ, బి, సి, డి గ్రూపులను ఒక ముద్దగా హిందూ బీసీల పేరుతోనూ, బీసీ–ఈ గ్రూపులోని ముస్లిం వర్గాలను ముస్లిం బీసీలుగానూ పేర్కొన్నారు. ‘బీసీ–ఈ’ రిజర్వేషన్లను 4శాతం నుండి 9శాతం పెంచాలని ఈ సుధీర్ కమిషన్ సిఫారసులు చేసింది. ఈ కమిషన్ రిపోర్టునే ఓవైసీ ప్రస్తావిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల హామీ ఇచ్చిన కేసీఆర్
టీఆర్‌ఎస్ పార్టీ 2014 ఎన్నికల సమయంలో మైనార్టీలకు 12శాతం, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. తెలంగాణలో ముస్లిం మైనార్టీల జనాభా రాష్ట్ర మొత్తం జనాభాలో 12.68శాతం. అనంతరామన్ కమిషన్ ముస్లిం వర్గాలలోని దూదేకుల, మెహతార్ వర్గాలను గుర్తించి బీసీ–బీ, ఏ గ్రూపులో చేర్చింది. మిగిలిన ముస్లింల జనాభా 11.18శాతం . సుధీర్ కమిషన్, తెలంగాణ బీసీ కమిషన్ ముస్లిం మైనార్టీ వర్గాలకు 9శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సిఫారసులు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం బీసీ–ఈ గ్రూపుకు రిజర్వేషన్లను 4శాతం నుండి 12శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసింది.
గతంలో అసెంబ్లీలో చేసిన తీర్మానం కేంద్రం వద్ద పెండింగ్
అసెంబ్లీలో పెట్టిన బిల్లులో గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ ప్రతిపాదించారు. ఎస్టీ జాబితాలో గుర్తింపు లేని కేంద్ర పరిశీలనలో ఉన్న రెండు కులాలను (వాల్మీకి బోయ, కాగిత లంబాడాలను) చేర్చారు. ఈ ప్రతిపాదనను ముస్లిం వర్గాల రిజర్వేషన్ పెంపు అంశంతో కలిపి కేంద్రానికి అనుమతి కోసం పంపారు. కానీ కేంద్రం అనుమతించలేదు. షెడ్యూల్ తెగల రిజర్వేషన్స్ సాంఘిక సంక్షేమ శాఖ పరిధికి సంబంధించినవి, ముస్లిం వర్గాల బీసీ–ఈ గ్రూపు రిజర్వేషన్స్ వెనుకబడిన తరగతుల శాఖకు సంబంధించినవి. అయితే రెండూ కలిపి చేయడం వల్ల రెండూ ఆగిపోయాయన్న అభిప్రాయం మజ్లిస్ నేతల్లో వినిపిస్తోంది.