(Source: ECI/ABP News/ABP Majha)
Karimnagar News: ఓవర్ లోడ్ లారీలతో ప్రజలు పరేషాన్, పూర్తిగా నాశనం అవుతున్న రహదారులు!
Karimnagar News :ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రహదారులపై ఓవర్ లోడ్ తో వెళ్తున్న లారీలతో ప్రజలకు నానా అవస్థలు పడుతున్నారు.
Karimnagar News: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రహదారులపై ఓవర్ లోడ్ తో వెళ్తున్న లారీలు కనిపించడం సర్వ సాధారణం అయిపోయింది. ఈ మధ్య బయటపడ్డ గ్రానైట్ అక్రమ రవాణా అంశంతో ఈ ఓవర్ లోడ్ల విషయం మరోసారి తెరపైకి వచ్చింది. అధిక బరువు ఉన్నా కూడా పెద్ద పెద్ద టిప్పర్లతో ఇసుక గ్రానైట్లను నిత్యం రవాణా చేస్తున్నారు. ఇక నిబంధనలు ఏమాత్రం పట్టించుకోకుండా అడ్డగోలు సంపాదనకు తెరతీస్తున్నారు. రోజుకు దాదాపు 700 నుండి 800 భారీ వాహనాలు జిల్లాలోని వివిధ మార్గాల్లో వెళుతున్నాయి. కానీ ఆర్టీఏ ఇటు విజిలెన్స్, టాస్క్ ఫోర్స్, మైనింగ్ అధికారులు మాత్రం తనిఖీలు చేస్తూ మిగతా వాటిని అసలు పట్టించుకోవడం లేదు. ఒకవేళ ఎవరైనా నిజాయితీగల అధికారి కేసులు నమోదు చేసిన తిరిగి పెద్దల ఒత్తిడితో నిమిషాల్లోనే ఆ వాహనాలు బయటికి వచ్చేస్తున్నాయి. జరిమానాల ద్వారా కనీసం రెండు నుండి మూడు కోట్ల ఆదాయం వచ్చేది. కానీ ఇప్పుడు కోటి రూపాయలు రావడమే గగనం అవుతోంది.
రెండేళ్లలో రోజుకో కేసు కూడా నమోదు కాకపోవడంపై అనుమానాలు..
ఇక వివిధ శాఖలను సమన్వయం చేసుకొని కఠినంగా వ్యవహరించాల్సిన అధికారుల సైతం పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోయిన సంవత్సరంలో ఆర్టీఏ అధికారులు 266 భారీ వాహనాలను పట్టుకోగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు 222 వాహనాలను పట్టుకున్నారు. వీటికి వేసిన జరిమానాలు దాదాపు కోటి 26వేల రూపాయలు. మరోవైపు రెండు సంవత్సరాల్లో సగటున ఒక్కరోజు ఒక్క కేసు కూడా నమోదు చేయలేకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక నిర్దేశించిన లోడు కంటే ఎక్కువగా బరువున్న టిప్పర్ల పై కూడా జరిమానా విధించాల్సి ఉంటుంది. ఆరు టైర్ల టిప్పర్ కి 16,200 కిలోలు, పది టైర్ల టిప్పర్ కి 24,500 కిలోలు, 12 టైర్ల టిప్పర్ కి 36,000 కిలోలకు మించ కూడని మెటీరియల్ మాత్రమే తీసుకెళ్లాలి.
అధిక లోడుతో వెళ్తున్న పట్టించుకోని అధికారులు..
అయితే 20 -30% అధిక లోడ్ తో వెళ్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదనేది కరీంనగర్ లో ఓపెన్ సీక్రెట్ గా మారిపోయింది. ఇక ఈ మధ్య నిర్మితమైన బైపాస్ రోడ్డు మార్గాల్లో పలుమార్లు ఈ భారీ వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలకు కారణమయ్యాయి. పలువురు అమాయకుల సైతం ఈ వాహనాల కింద పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ వాహనాల వల్ల నిర్ణయించిన కాలానికి ముందే రోడ్లపై కంకర తేలి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. ఇక వర్షా కాలంలో వీటి కారణంగా ఏర్పడే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. అధిక బరువు వల్ల రోడ్ల నాణ్యత సైతం పూర్తిగా దెబ్బతింటుంది. ఎక్కువగా రాజీవ్ రహదారి, హుజురాబాద్, చొప్పదండి, జగిత్యాల, సిరిసిల్ల రోడ్డు మార్గాల్లో ప్రయాణిస్తున్న ఈ వాహనాలపై చెక్ పోస్టులు పెడితే కానీ వీటి అక్రమ రవాణాకి అడ్డుకట్ట పడే అవకాశం లేదు. మరోవైపు ఇప్పటికే జాతీయ వ్యాప్తంగా చర్చనీయాంశమైన అక్రమ రవాణా అంశం పై అధికారులు అలసత్వం వహిస్తే.. వారిపై కూడా ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.