TRS MLC Candidates : రాజ్యసభ సభ్యుడ్ని ఎమ్మెల్సీ చేసిన కేసీఆర్ ! ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ మార్క్...
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ మార్క్ రాజకీయం కనిపించింది. రాజ్యసభ సభ్యుడ్ని ఎమ్మెల్సీ చేశారు. నిన్న కలెక్టర్‌గా ఉన్న అధికారి ఇవాళ ఎమ్మెల్సీ అభ్యర్థి అయ్యారు.
ఆశ్చర్యపరిచే రాజకీయాలు చేయడంలో తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎంపికలోనూ కేసీఆర్ ఆ మార్క్ చూపించారు. ఇప్పటి వరకూ ఎవరూ ఊహించని.. చివరికి ఆ అభ్యర్థి కూడా ఊహించని నేతను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. ఆయన నామినేషన్ కూడా దాఖలు చేసేశారు. ఆయన నేత బండ ప్రకాష్. మొత్తం ఆరుగుర్ని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్యీ అభ్యర్థులుగా కేసీఆర్ ఖరారు చేశారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, నిన్న కలెక్టర్ పదవికి రాజీనామా చేసిన వెంకట్రామిరెడ్డి మిగతా ఐదుగురు. వీరంతా నామినేషన్లు కూడా దాఖలు చేశారు.
Also Read : మాపై దాడులకు సూత్రధారి సీఎం కేసీఆరే.. బండి సంజయ్, ఉద్రిక్తతల మధ్యే రెండోరోజూ పర్యటన
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఆరుగురు కోసం పెద్ద ఎత్తున పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఎంతో కసరత్తు చేసిన కేసీఆర్ చివరి క్షణంలో బండా ప్రకాష్, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి తుది ఆరుగురి జాబితాలో చోటు కల్పించారు. ఆరుగురిలో ముగ్గురు రెడ్డి సామాజికవర్గం వారు ఉండగా.. ఒకరు వెలమ, మరొకరు ముదిరాజు.. ఇంకొకరు దళిత సామాజికవర్గానికి చెందిన వారికి అవకాశం ఇచ్చారు. కేసీఆర్ సామాజికవర్గ సమీకరణాల కోసం తీవ్రంగా కసరత్తు చేసి బండా ప్రకాష్‌కు చాన్సిచ్చారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయనతో రాజీనామా చేయించి... ఎమ్మెల్సీ ఇస్తున్నారు. ఆ తర్వాత ఆయనకు మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది.
Also Read : కేసీఆర్‌కి తెలంగాణ గురించి ఏం తెలుసు? అన్నీ డ్రామాలే.. ఆ విషయం ఒప్పుకున్నట్లేగా..
బండా ప్రకాష్ 2018లో రాజ్యసభ సభ్యుడయ్యారు. ఆయనకు 2024 వరకు పదవి కాలం ఉంది. ఇప్పుడే ఎమ్మెల్సీగా తీసుకోవడంతో ఆయన స్థానంలో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను రాజ్యసభకు పంపుతారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కవిత ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆమె పదవి కాలం జనవరిలో ముగియనుంది. గతంలో ఎంపీగా కడియం శ్రీహరిని ఎమ్మెల్సీ చేసి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన రికార్డు కూడా కేసీఆర్ కు ఉంది. ఇప్పుడు మరో ఎంపీని ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇవ్వబోతున్నారు.
ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు మొదటి నుంచి వినిపిస్తోంది. హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చినా ఫైల్ పెండింగ్‌లో ఉంది. దీంతో ప్రతిపాదన వెనక్కి తీసుకుని ఎమ్మెల్యే కోటాలో హామీ నెరవేర్చాలని నిర్ణయించారు. ఇక మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని హఠాత్తుగా ఎమ్మెల్సీ చేయాలని కేసీఆర్ ఎందుకు అనుకున్నారో టీఆర్ఎస్ వర్గాలకు అంతు చిక్కడం లేదు. ఇప్పుడు స్థానకి సంస్థల కోటాలో మరో 12 ఎమ్మెల్సీలు, గవర్నర్ కోటాలో మరో ఎమ్మెల్సీ సీటు ఖాళీగా ఉంది. వాటికి అభ్యర్థుల్ని కూడా నేడో రేపే ప్రకటించే అవకాశం ఉంది.
Also Read: టీఆర్ఎస్, బీజేపీలకు మాత్రమే అనుమతులా.. కాంగ్రెస్‌కు ఎందుకివ్వరు: రేవంత్ రెడ్డి సూటిప్రశ్న