YS Sharmila: బాసర ట్రిపుల్ ఐటీలో వరుస ఆత్మహత్యలు, మేల్కొండి దొర అంటూ కేసీఆర్ పై షర్మిల ఫైర్
Students Suicide at Basara IIIT : ఇప్పటివరకు 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా.. బంధిపోట్ల రాష్ట్ర సమితిలో చలనం లేదంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.
YS Sharmila About Students Suicide at Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీలో వరుస ఆత్మహత్యలపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. ఇప్పటివరకు 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా.. బంధిపోట్ల రాష్ట్ర సమితిలో చలనం లేదంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం విద్యా సంవత్సరంలో కేవలం 3, 4 నెలల వ్యవధిలోనే నలుగురు ప్రాణాలు కోల్పోయినా సీఎం కేసీఆర్ ఏ పట్టింపు లేదన్నారు. ట్రిపుల్ ఐటీల్లో ఆత్మహత్యలపై దర్యాప్తు కమిటీని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ట్రిపుల్ ఐటీలో సీటు కోసం విద్యార్థులు పోటీ పడ్డారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ దిక్కుమాలిన పాలన వల్ల పేద బిడ్డలకు ఉన్నత విద్య అందకపోగా ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. అందుకే ఇప్పుడు ట్రిపుల్ ఐటీలో సీటు కోసం విద్యార్థులు అప్లై చేసుకోవడం కూడా మానేశారని చెప్పారు. ఉన్నత విద్యకు నిలయాలైన ట్రిపుల్ ఐటీలను.. ఆత్మహత్యలకు నిలయంగా మార్చిన ఘనత కేసీఆర్ సొంతమన్నారు.
గొప్ప ఆశయాలతో వచ్చిన పేద విద్యార్థులకు పురుగుల అన్నం, మురుగు నీరు పెట్టి ఆత్మహత్యలకు ఉసిగొల్పుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. సిబ్బంది నియమాలను మరిచారు.. క్యాంపస్ ల నిర్వహణను గాలికొదిలేశారని, నిధుల కేటాయింపులను గంగలో కలిపేశారంటూ వైఎస్ షర్మిల మండిపడ్డారు. సర్కారు నియమించిన డైరెక్టర్లు కేసీఆర్ లాగే డుమ్మాలు కొడుతున్నారని, ఇన్ చార్జి అధికారులు, కాంట్రాక్టు ఉద్యోగులతో పబ్బం గడుపుతున్నారని చెప్పారు. .
తండ్రీకొడుకుల ఊదరగొట్టే మాటలు..
తండ్రీకొడుకులు కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆరు నెలల కింద ఊదరగొట్టే మాటలు మాట్లాడారని, మరునాడే పత్తా లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. ఫొటోలకు ఫోజులిచ్చిన మంత్రులు.. ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పేద బిడ్డలకు ఉన్నత విద్య అందించాలని వైయస్ఆర్ ట్రిపుల్ ఐటీలను స్థాపిస్తే.. కేసీఆర్ మాత్రం ట్రిపుల్ ఐటీలపై నమ్మకమే లేకుండా చేస్తున్నారని విమర్శించారు. మరో విద్యార్థి ప్రాణం పోకముందే తెలంగాణ సర్కారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ట్రిపుల్ ఐటీల్లో ఆత్మహత్యలపై దర్యాప్తు కమిటీ నియమించాలని కోరారు.
బాసర ట్రిపుల్ ఐటీలో ఉరేసుకున్న మరో విద్యార్థి, ఆగని వరుస మరణాలు!
ఐఐటీ, ట్రిపుల్ ఐటీల్లో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా నిర్మల్ జిల్లా బాసర ట్రిబుల్ ఐటీలో మొన్న జరిగిన విద్యార్థిని మృతి ఘటన మరువక ముందే మంగళవారం పీయూసీ - 1 విద్యార్థి జాదవ్ బబ్లూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొన్నాడు. వెంటనే సిబ్బంది భైంసాలోని ఏరియా ఆసుపత్రికి తరలించగా అతను అప్పటికే చనిపోయాడని వైద్యులు తేల్చారు. ఇక అక్కడి నుండి పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ట్రిపుల్ ఐటీలో పీయూసీ చదువుతున్న విద్యార్థిని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కు చెందిన బబ్లూ అని గుర్తించారు. నిర్మల్ ఆసుపత్రికి తరలించాక స్థానిక రాజకీయ నేతలను, ఇతర నాయకులను ఎవరినీ లోనికి రానీయకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.