Nizamabad News: కనీస వసతులు లేకున్నా కాలేజీలకు అటానమస్ హోదా
నిత్యం వివాదాల్లో తెలంగాణ యూనివర్సిటీ. కనీస వసతులు లేకున్నా కాలేజీలకు అటానమస్ హోదా.అధికంగా ఫీజులు వసూల్ చేస్తున్న ప్రైవేట్ కాలేజీలు. కనీస వసతులు లేవంటూ వర్సిటీకి విద్యార్థుల ఫిర్యాదు
తెలంగాణ యూనివర్సిటీ అనుంబంధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 71 డిగ్రీ, 20 పీజీ కాలేజీలు, 3 ఎంబీఏ, ఒకటి ఎంసీఏ, 15 బీఈడ్ కాలేజీలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కాలేజీకి ఇటీవల అటానమస్ హోదా రావడంతో ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారని, కొన్ని కాలేజీల్లో కనీస వసతులు లేవని స్టూడెంట్ల నుంచి వర్సిటీకి ఫిర్యాదులు అందాయి. దీంతో వర్సిటీ చర్యలు చేపట్టింది. యూనివర్శిటీ నుంచి కమిటీను పంపించి తనిఖీలు చేపట్టంది.
జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీల్లో తనిఖీలు చేశారు యూనివర్శిటీ సిబ్బంది. డిగ్రీ, పీజీ కాలేజీలు ఒకే దగ్గర నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం, సిబ్బందికి శాలరీ చెల్లింపులు సరిగా లేవని గుర్తించారు. దీంతో ఆ కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసి రెండు వారాలు గడుస్తున్నా ఇప్పటి వరకు చర్యలు లేవని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
జేఎన్‌టీయుకి అనుబంధంగా ఉన్న డిగ్రీ, పీజీ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు, లెక్చరర్లు, ల్యాబ్స్ బిల్డింగ్, తరగతి గదుల వైశాల్యం తదితర అంశాలపై ప్రతి సంవత్సరం విద్యాశాఖ అధ్యర్యంలో తనిఖీలు చేయాల్సి ఉంది. 600ఎస్ఎఫ్టీ కంటే తక్కువ వైశాల్యం కలిగి క్లాస్ రూమ్స్ ఉన్నా.... స్టూడెంట్ల సంఖ్యకు అనుగుణంగా ల్యాబ్స్, నీటి వసతి, మూత్రశాలలు, సరైన వెంటి లేషన్ లేకున్నా ఆ కాలేజీకి ముందుగా షోకాజ్ నోటీసులు ఇచ్చి 15 రోజుల అనంతరం చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం అలాంటిదేమీ జరగలేదంటున్నాయి విద్యార్థి సంఘాలు.
ప్రధానంగా 71 కాలేజీల్లో 95 శాతం కాలేజీలకు ప్లే గ్రౌండ్స్ లేవు. క్వాలిఫైడ్ లెక్చరర్లు లేరు. అయితే వీటిని వర్సిటీ, విద్యాశాఖ ఆఫీసర్లు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేస్తే తప్ప ఆఫీసర్లు తనిఖీలు చేయడం లేదన్న ఆరోపణలు వినిస్తున్నాయ్. ఒక వేళ చేసినా షోకాజ్ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.