Telangana Elections 2023: బీసీ కులగణన అంటేనే బీజేపీ అంటరానిదిగా చూస్తోంది: ఎమ్మెల్సీ కవిత
BRS MLC Kavita: బీసీ కులగణన ఎందుకు చేపట్టడంలేదో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
MLC Kavita News: నిజామాబాద్: బీసీ కులగణనపై ఇదివరకే సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రంగంలోకి దిగారు. బీసీ కులగణన ఎందుకు చేపట్టడంలేదో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కుల వృత్తులకు చేయూతనివ్వకుండా కేంద్ర ప్రభుత్వం బీసీల జీవితాలతో ఆడుకుంటుందని ధ్వజమెత్తారు. బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ ఎందుకు చేయడం లేదని, ఓబీసీ రిజర్వేషన్లను ఎందుకు సక్రమంగా అమలు చేయడం లేదని కేంద్రాన్ని ఆమె నిలదీశారు. దేశంలో బీసీలకు ఇంత అన్యాయం జరుగుతున్న కూడా ప్రశ్నించకుండా కాంగ్రెస్ పార్టీ పనికిరాని ప్రతిపక్ష పార్టీగా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ పార్టీ ఆఫీసులో కవిత సోమవారం మీడియాతో మాట్లాడారు. కేవలం ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్, బీజేపీలకు బీసీలపై ప్రేమ వచ్చిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, సీఎం కేసీఆర్ కి ఎన్నికలు ముఖ్యం కాదని, బీఆర్ఎస్ పార్టీ బీసీలకు చేసినంత మంచి పనులు ఏ పార్టీ చేయలేదన్నారు.
బండి సంజయ్ ను ఎందుకు తొలగించారు..
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న ఒక బీసీ వ్యక్తి బండి సంజయ్ ని ఎందుకు తొలగించారో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు వచ్చే ముందు సమాధానం చెప్పాలన్నారు. పార్టీ అధ్యక్షుడిగా బీసీసి తొలగించి, ఇప్పుడు బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెబితే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చేది లేదని తెలిసి బీసీకి సీఎం పదవి అని చెప్పడమంటే బీసీలను రాజకీయంగా మభ్యపెట్టడమే అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోగా, ఈసారి అన్నిచోట్ల డిపాజిట్లు కోల్పోతుందన్నారు. బీసీ సీఎం నినాదం కేవలం ఒక రాజకీయ నినాదం, శుష్క నినాదం, శూన్య నినాదం. అది పనికొచ్చే నినాదం కాదన్నారు.
జనగణన చేయకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ చేస్తే కాంగ్రెస్ చేసిన పాపాలు తొలగిపోవని తేల్చి చెప్పారు. 2010కి ముందు దాదాపు రూ. 4 వేల కోట్లు ఖర్చు చేసి బీసీ కులగణన చేపట్టారని, కానీ ఇప్పటి వరకు నివేదికను బహీర్గతం చేసే దమ్మూ ధైర్యం లేని పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. రాజ్యసభలో 2010లో మహిళా బిల్లును ఆమోదించినప్పుడు ఓబీసీ మహిళలకు కోటా కల్పించలేమని కూడా కాంగ్రెస్ స్పష్టం చేసిందని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేపట్టి అన్ని వర్గాలకు అవసరమైన పనులను చేస్తున్నారని చెప్పారు.
బీసీ కులగణన ఎందుకు చేపట్టలేదో, ఓబీసీ రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఎందుకు ప్రవేశపెట్టలేదో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని కవిత ప్రశ్నించారు. 2004లోనే ఆర్ కృష్ణయ్యను తీసుకొని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసి ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ వినతి పత్రం అందించారు. ఏళ్లు గడిచినా కూడా కాంగ్రెస్, బీజేపీలు అంశంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ, విశ్వవిద్యాలయాల్లో ఓబీసీ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. కులవృత్తుల కోసం తెలంగాణ సర్కార్ ఎన్నో పథకాలు, కార్యక్రమాలు చేపట్టిందన్నారు. తమది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని, బీసీల ప్రభుత్వమన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల పోస్టుల్లో ఎంత మంది బీసీలు ఉన్నారని రాహుల్ గాంధీ చాలా అమాయకంగా మాట్లాడుతున్నారు. యూపీఏ హయాంలో బీసీ, ఎస్సీ న్యాయమూర్తలు ప్రాతినిధ్యం పెంచడానికి ఎందుకు చర్యలు చేపట్టలేదని నిలదీశారు.
కామారెడ్డిలో చెల్లని రూపాయి నిజామాబాద్ లో ఎలా చెల్లుతుందని షబ్బీర్ అలీపై సెటైర్లు చేశారు. నిజామాబాద్ అర్బన్ నుంచి షబ్బీర్ అలీ చేస్తున్నారని తెలిసిందే. షబ్బీర్ అలీ గతంలో గంప గోవర్ధన్ చేతిలో నాలుగు సార్లు ఓడిపోయారని, ఇప్పుడు గణేష్ గుప్త చేతిలో మరోసారి ఓడిపోతారని కవిత అన్నారు. నిజామాబాద్ అర్బన్ లో మరొకసారి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గణేష్ గుప్త భారీ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, సీనియర్ నేత పొన్నాల లక్షయ్య, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, ఏ జీవన్ రెడ్డిలతో కలిసి కవిత మీడియాతో మాట్లాడారు.