Rains Effect: ఆరో రోజూ ఇందూర్ లో వరుణుడి బీభత్సం.. ఉగ్రరూపం దాల్చిన గోదావరి!
ఆరో రోజు కూడా నిజామాబాద్ జిల్లాలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. వర్షపు ధాటికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఆ కారణంగానే అధికారులు మహరాష్ట్ర-తెలంగాణల మధ్య రాకపోకలను నిలిపి వేశారు.
నిజామాబాద్ జిల్లాను వర్షం ముంచెత్తింది. గత ఆరు రోజులుగా క్షణం తీరిక లేకుండా వర్షం దంచికొట్టింది. వరుణుడి బీభత్సానికి జన జీవనం స్తంభించిపోయింది. ఎడతెరపి లేకుండా కుర్తున్న భారీ వర్షాలకు జిల్లా విలవిలలాడుతోంది. జిల్లాలోని వాగులు, వంకలన్నీ పొంగుతున్నాయి. మంజీరా, గోదావరి నదులు పోటెత్తుతున్నాయి. భారీ వర్షాలకు నగరంతో పాటు పలు మండల్లాలోని సుమారు 30 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. సుమారు 50కి పైగా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి తీర ప్రాంత ప్రజలు భయంలో గుప్పిట్లో గడుపుతున్నారు. పలుచోట్ల రహదారులు కోతకు గురవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో చాలా గ్రామాలకు బాహ్య ప్రపంచానికి సంబంధాలు తెగిపోయాయి.
నీటమునిగిన వేల ఎకరాల పంటలు..
నిజామాబాద్ జిల్లాలో ప్రధాన రహదారుల పైనుంచి భారీ వరదలు వెళ్తుండడంతో గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. వర్షంలో తడుస్తూ.. చలికి వణికిపోతూ వాహన దారులు రోడ్లపైనే చాలా సేపు వేచి చూడాల్సి వస్తుంది. ఇప్పటి వరకు 417 ఇళ్లు పాక్షికంగా, 11ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. జిల్లాలో 50కి పైగా రోడ్లపై నీళ్లు పారుతుండగా ఇప్పటి వరకు 16 రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు అధికారులు ప్రభుత్వానికి పంపించిన నివేదికలో పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 1067 చెరువులు ఉండగా 944 చెరువులు పూర్తిగా నిండి మత్తడులు పారుతున్నాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా 27,802 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. జిల్లాలో మొత్తం 19,980 ఎకరాల్లో వరి, 5251 ఎకరాల్లో సోయాబిన్, 2383 ఎకరాల్లో మొక్కజొన్న, 188 ఎకరాల్లో పత్తి, 4608 ఎకరాల్లో నారు మడులు దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. అంతే కాకుండా వేల ఎకరాల్లో ఉన్న ఇతర పంటలు కూడా పూర్తిగా నీటి పాలైనట్లు చెబుతున్నారు.
జిల్లాలో పడుతున్న భారీ వర్షాలతో యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టరేట్‌తో పాటు పలు కార్యాలయాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సహాయ చర్యలు చేపడుతున్నారు. వరద నీరు చేరిన ప్రాంతాల వారిని పునరావాస ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడ వారికి వసతితో పాటు భోజన సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. అలాగే విద్యుత్, రవాణా అంతరాయం ఏర్పడిన చోటుకు చేరుకున్న పనులను పునరుద్ధరిస్తున్నారు. అలాగే తెలంగాణ-మహారాష్ట్రకు రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. అంతర్రాష్ట్ర బ్రిడ్జి వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. మహారాష్ట్రకు వెళ్లే ప్రయాణికులు బాసర, ధర్మాబాద్ మీదుగా వెళ్లాలని సూచించారు.
గోదావరి నదీ ఉగ్రరూపం..
సాలూర చెక్ పోస్టు వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మంజీరాకు వరద నీరు పోటెత్తడంతో సరిహద్దు ప్రాంతాల వద్ద రోడ్లను దిగ్బంధం చేసి రవాణా వ్యవస్థను రద్దు చేశారు. బ్రిడ్జిపై నుంచి వరద పారుతుండటంతో అధికారులు ఆంక్షలు విధించారు. మరో రెండు మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నారాయణరెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్లనుంచి బయటకి రావద్దని కోరారు.