Nizamabad News: 40 ఏళ్లకు మోక్షం- ఎస్సారెస్పీ కొత్త కళ వచ్చింది
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులకు అధికారులు సమాయత్తమయ్యారు. దీని కోసం ప్రభుత్వం రూ.17 కోట్లు నిధులు విడుదల చేసింది.
ఎట్టకేలకు ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామసాగర్ ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు చేపట్టింది ప్రభుత్వం. 40ఏళ్ల తర్వాత అధికారులు గేట్ల మరమ్మతులు చేపట్టారు. ప్రాజెక్టులోని 42 గేట్లకు మరమ్మతులు చేసేందుకు నిర్ణయించారు. ప్రభుత్వం 17కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడంతో పనులను కొనసాగిస్తున్నారు. వరద భారీగా వచ్చిన సమయంలో పనులు నిలిపివేసి మిగతా సమయంలో చేపట్టే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాజెక్టుపై మోటార్‌ల మరమ్మతులను చేస్తూనే ఇతర పనులను పూర్తిచేయనున్నారు. ప్రాజెక్టులో భారీ వరదలు వచ్చిన టైంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, గతేడాది 4 గేట్లు ఎత్తే సమయంలో గేట్లు మొరాయించిన దుస్థితిని ప్రభుత్వానికి నివేదించారు. దీంతో ప్రభుత్వం రిపేర్ కోసం అనుమతి ఇచ్చింది.
మాన్యువల్ ఆధారంగా ఈ గేట్ల నిర్మాణం చేశారు. వరదలు వచ్చే సమయంలో ఆటోమెటిక్ స్విచ్‌లు కాకుండా మోటార్‌లను ఏర్పాటు చేసి గేట్లను గేట్‌మెన్‌ల సహాయంతో ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు వరదలు వచ్చే సమయంలో ఒక్కోసారి 4లక్షల నుంచి 5లక్షల క్యూసెక్కులకుపైగా వరద వచ్చి చేరుతోంది. ఆ సమయంలో ప్రాజెక్టులోని మొత్తం 42గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రతి సంవత్సరం చిన్నచిన్న పనులు చేపడుతూ వరద సమయంలో గేట్లను ఎత్తుతున్నారు. గతేడాది భారీగా వరదలు వచ్చిన సమయంలో 4గేట్లు ఎత్తే సమయంలో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. కొన్ని గేట్లు మొత్తం లేవకపోవడం వల్ల ఇతర గేట్లను ఎక్కువగా తెరచి నీటిని దిగువకు వదిలారు. తర్వాత మెకానిక్‌లను పిలిచి కొంత సరిచేసి గేట్లను ఎత్తారు. గేట్లకు తాత్కాలిక మరమ్మతులు కాకుండా పూర్తి స్థాయిలో చేపట్టాలని డిసెంబరులో ప్రభుత్వానికి నివేదించారు. దీంతో ప్రభుత్వం రూ.17 కోట్లను విడుదల చేయడంతో టెండర్‌లను పూర్తిచేసి పనులను చేపట్టారు. ఈ పనులను సంవత్సరంలోపు పూర్తి చేయనున్నారు. ఈ గేట్లతో పాటు వరద కాలువ గేట్లను కూడా మరమ్మతులను చేయనున్నారు.
శ్రీరామసాగర్ ప్రాజెక్టు నిర్మాణమై 40ఏళ్లు అవుతోంది. 40ఏళ్ల క్రితం గోదావరి నదిపై 112 టీఎంసీల కెపాసిటీతో ఎస్సారెస్సీని నిర్మించారు. అయితే గోదావరికి భారీ వరదలు వస్తుండడంతో ఆ వరదతోపాటు ఇసుక, మట్టి కొట్టుకు వస్తుండడం వల్ల మేటలు ఎక్కువగా వేస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులో నీటి సామర్థ్యం తగ్గుతోంది. నిర్మాణం సమయంలో 112 టీఎంసీలుగా ఉన్న ప్రాజెక్టు 2010లో 90 టీఎంసీలకు చేరింది. ఆ తర్వాత రాష్ట్ర సాగునీటిశాఖ ఇంజనీరింగ్ పరిశోధన అధికారులు శ్రీరామ్‌సాగర్ నీటి నిల్వల కెపాసిటీపై సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్రలో అన్ని నల్లరేగడి భూములు ఉండడం, గోదావరికి వరదలు వచ్చే సమయంలో భారీగా కోతకు గురై కొట్టుకు వస్తుండంతో ఈ కెపాసిటి తగ్గినట్లు అంచనా వేస్తున్నారు.