Nizamabad News: శ్రీరాం సాగర్ వద్ద కొత్త టూరిజం స్పాట్- ఆకట్టుకోనున్న బోటింగ్, రోప్‌వే
శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ ఏరియా టూరిజం స్పాట్ చేసేందుకు ప్రణాళికలు రెడీ అవుతున్నాయి. అధికారులతో కలెక్టర్ నారాయణ రెడ్డి సమీక్షించారు. ఫార్మేషన్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళికలేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ నియోజకవర్గంలో ఉన్న శ్రీరాం సాగర్ ప్రాజెక్టు బ్యాటర్ ప్రాంతాన్ని టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసేందుకు జిల్లా యంత్రాంగం నడుంబిగిస్తోంది. శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ ఏరియాను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసేందుకు అనువైన పరిస్థితులు ఉన్నందున సంబంధిత శాఖల అధికారులు ఈ దిశగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఇప్పటికే సూచించారు. వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. టూరిజం అభివృద్ధి సంస్థతోపాటు, అటవీ అభివృద్ధి సంస్థ కూడా ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ఏరియాలో టూరిజం స్పాట్ ఏర్పాటుకు ఆసక్తితో ఉన్నందున దీనికి అనుగుణంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ముందుగా ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి మొదలుకొని బినోల వరకు గల బ్యాక్ వాటర్ ఏరియా పరీవాహక ప్రాంతం గుండా అప్రోచ్ రోడ్డు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రాజెక్టు ఫుల్ రిజర్వాయర్ లెవెల్ వద్ద బ్యాక్ వాటర్ ఏరియాలో నీరు నిలిచి ఉండే ప్రాంతాన్ని మినహాయిస్తూ కనీసం 33 అడుగుల మేర రోడ్డు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇది వరకే పరీవాహక ప్రాంతం అంతటా భూ సేకరణ చేసి ఉన్నందున రోడ్డు నిర్మాణానికి స్థల సమస్య అంతగా ఉత్పన్నం కాదని కలెక్టర్ పేర్కొన్నారు. కేవలం రోడ్డు నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని మాత్రమే సేకరించడం జరుగుతుందన్నారు. అది కూడా స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామాభివృద్ధి కమిటీ ప్రతినిధులను సంప్రదించి వారి సహకారంతో రోడ్డు నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించాలన్నారు. రోడ్డు నిర్మాణం జరిగితే పరిసర ప్రాంతాల వ్యవసాయ భూముల విలువ గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున రైతులు కూడా తోడ్పాటును అందిస్తారని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వ యంతో ముందుకెళ్లాలని సూచించారు.
మరోవైపు ఎస్సారెస్పీ ప్రాజెక్టులో ఐలాండ్ ఉంది. ప్రాజెక్టు కట్ట నుంచి ఐలాండ్ వరకు రోప్‌వే ఏర్పాటు చేసి పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ 2017లో ఎస్సారెస్పీని సందర్శించిన సమయంలో తెలిపారు. ఆ దిశగా అధికారులు ఇంకా చర్యలు చేపట్టలేదు. అందుకు తగిన ప్లానింగ్‌పై ఇటు పర్యాటక శాఖ అటు నీటి పారుదల శాఖ అధికారులు సైతం ప్రాజెక్టును సందర్శించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మధ్యలో ఉన్న ఐలాండ్‌ను టూరిస్ట్ స్పాట్‌గా చేస్తే పర్యాటకులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. రోప్‌వే ద్వారా ఐలాండ్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అధికారులు పరిశీలంచారు. కానీ ఆ పనులు ఇంకా మొదలు కాలేదు.
ఎస్సారెస్పీ నుంచి బాసర సరస్వతి అమ్మవారి పుష్కర ఘాట్‌ల వరకు బోటింగ్‌ను నడపాలన్న ప్రతిపాదనలు కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుంచి బాసర వరకు బోటింగ్ ఏర్పాటు చేస్తే... పర్యాటకులకు ఆహ్లాదంతోపాటు ఆదిలాబాద్ నుంచి వచ్చే భక్తులకు దూరభారం కూడా తగ్గుతుంది. ఇక్కడి ప్రజలకు బోటింగ్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే నీటి పారుదల శాఖ, టూరిజం అధికారులు బోటింగ్ స్పాట్‌ల నుంచి ట్రయల్ రన్ కూడా చేశారు. అయితే పనులు మాత్రం మొదలు పెట్టలేదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఆదాయం భారీగా పెరుగుతుంది. జిల్లాలో పర్యాటక ప్రదేశాలు తక్కువ. జిల్లా వాసులు అహ్లాదం కోసం ఎక్కడికో వెళ్లాల్సి వస్తోంది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను మరింత అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంటుంది.