Nizamabad: గల్ఫ్ బాధితుడికి ఎమ్మెల్సీ కవిత చేయూత.. సొంత ఖర్చులతో స్వగ్రామానికి..
ఓ గల్ఫ్ బాధితుడికి ఎమ్మెల్సీ కవిత చేయూతనిచ్చారు. దుబాయిలో టీబీతో బాధ పడుతున్న బాదితుణ్ని సొంత ఖర్చులతో స్వగ్రామానికి రప్పించి సాయపడ్డారు.
నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్‌పల్లి మండలం సికింద్రాపూర్ గ్రామానికి చెందిన చెమ్మటి సాయికుమార్ ఉపాధి కోసం గత నాలుగు సంవత్సరాల క్రితం దుబాయికి వెళ్లాడు. రెండు నెలల క్రితం అతనికి టీబీ సోకగా అక్కడి ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు. దేశం కాని దేశం.. అయిన వారు ఎవరు లేకపోవడంతో మానసికంగా కృంగిపోయి కొట్టుమిట్టాడుతున్న విషయాన్ని అక్కడి మిత్రులు స్వగ్రామంలో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో బాదితుడి తల్లి, ఇతర కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు కలిసి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు వివరించారు. దుబాయి నుంచి తమ కుమారుడు సాయి కుమార్‌ను రప్పించాలని కోరారు.
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్.. ఎమ్మెల్సీ కవిత దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. సాయి కుమార్‌ను స్వగ్రామానికి రప్పించేలా చొరవ తీసుకోవాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్సీ కవిత సాయికుమార్‌కు సహాయం అందించి ఇండియా పంపాల్సిందిగా దుబాయిలోని కిరణ్ కుమార్, అరవింద్ రాగం అనే వ్యక్తులను కోరారు. అరవింద్ రాగం అక్కడ హాస్పిటల్‌కు వెళ్లి సాయికుమార్‌ను కలిసి డాక్టర్లతో మాట్లాడారు. వరుసగా మూడు పరిక్షలలో టీబీ నెగెటివ్ రావడం.. అలాగే కంపెనీ హెచ్ఆర్ విభాగంతో మాట్లాడగా వీసా క్లియరెన్స్ కూడా వచ్చింది. బాధితుడికి కంపెనీ నుండి రావలసిన బకాయిలను కూడా మాట్లాడి ఇప్పించారు. దీంతో ఇండియా వచ్చేందుకు మార్గం సుగమం అయింది.
అలాగా కంపెనీ సాయి కుమార్‌కు సంబంధించిన అన్ని క్లియరెన్సులు చేయించడంతో పాటు బాదితుడు సాయి కుమార్ ఇండియా వచ్చేందుకు విమాన చార్జీలను ఎమ్మెల్సీ కవిత కార్యాలయం అందించింది. సొంత ఖర్చులతో స్వగ్రామానికి రప్పించడమే కాకుండా ఉపాధి కోసం వెళ్లిన సాయి కుమార్‌కు అతను పని చేసిన కంపెని నుండి రావలసిన అన్ని బెనిఫిట్స్‌ను ఇప్పించారు. దీంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
తమ కుటుంబ సభ్యుడ్ని దుబాయ్ నుండి రప్పించిన ఎమ్మెల్సీ కవితకు, చొరవ చూపిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు, తమ పూర్తి సహకారం అందించిన రాగం అరవింద్ యాదవ్, పీచర కిరణ్, నవీన్ ఆచారిలకు సాయి కుమార్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. స్వగ్రామం చేరుకున్న సాయికుమార్‌ను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నేడు (డిసెంబరు 16) పరామర్శించారు.
Also Read: Farmer Suicide: కన్నబిడ్డలా చూసుకున్న పంట ఒడిలోనే.. రైతు రవీందర్ ఆత్మహత్య..
Also Read: Kurnool Onion Market: గిట్టుబాటు ధరలేక ఆగ్రహించిన ఉల్లి రైతు... పెట్రోల్ పోసి ఉల్లిబస్తాలకు నిప్పు
Also Read: YS Sharmila: వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకొద్దు.. త్వరలో పాదయాత్ర చేస్తా
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి