Nizamabad Floods: రైతుల్ని నట్టేట్లో ముంచిన వర్షాలు! మొత్తం మురిగిపోయిన సోయా పంట, రూ.60 కోట్ల నష్టం
Nizamabad: ఎకరానికి రూ.20 వేల చొప్పున సుమారు రూ.60 కోట్ల నష్టం జరిగినట్లు తెలుస్తోంది. 2019 నుంచి సోయా రైతులు నష్టాల పాలవుతూనే ఉన్నారు.
భారీ వర్షాలు, వరదలు నిజామాబాద్ జిల్లా రైతులను నిండా ముంచాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపు 1.65 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఇందులో ఎక్కువగా సోయాబీన్ ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రైతులు వరి తర్వాత సోయాబీన్ ను ఎక్కువగా సాగు చేస్తారు. ఈ ఖరీఫ్ నిజామాబాద్ జిల్లాలో 60 వేల ఎకరాలు, కామారెడ్డి జిల్లాలో 60వేల ఎకరాల్లో సోయా సాగు చేస్తున్నారు. వారం పాటు ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురవడం, వరదలతో పొలాల్లోకి నీరు చేరి దాదాపు 5 రోజులుగా మునకలో ఉన్నాయి. దీంతో మొక్క దశలోనే మురిగిపోయి సోయా పంట దెబ్బతింది. ఉమ్మడి జిల్లాలో సుమారు 30 వేల ఎకరాల్లో సోయా పంటలు దెబ్బ తిన్నాయని వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి.
ఎకరానికి రూ.20 వేల చొప్పున సుమారు రూ.60 కోట్ల నష్టం జరిగినట్లు తెలుస్తోంది. 2019 నుంచి సోయా రైతులు నష్టాల పాలవుతూనే ఉన్నారు. ఈసారి 30 వేల ఎకరాల్లో సోయా పంట నీటి పాలైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రూ.60 కోట్ల నష్టం వాటిల్లింది.
నాలుగేళ్లుగా సోయా రైతులు నష్టపోతూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం పరిహారం చెల్లించడం లేదు. 2019లో రాష్ట్రంలో సీడ్స్ కొరత ఏర్పడడంతో రైతులు మహారాష్ట్రలో విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేశారు. ఇందులో సీడ్స్ సరిగా రాక 12 వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. 2020లో అకాల వర్షాలతో 15 వేల ఎకరాల పంటకు నష్టం వాటిల్లింది. 2021 సంవత్సరంలో 15 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మూడేళ్లుగా ఆశించిన దిగుబడి రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక ఈసారి ఆది లోనే భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి.
ఈసారైనా నష్ట పరిహారం అందేనా..
ఈసారి ఖరీఫ్ ఆరంభంలోనే పంట నష్టం వాటిల్లడంతో సాగు ఖర్చులైనా పరిహారంగా చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో పంటల బీమా అమలు చేయకపోవడంతో నాలుగేళ్లుగా వివిధ కారణాలతో నష్టపోయిన 46 వేల మంది రైతులకు పరిహారం అందలేదు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు స్కీమ్ పేరిట పంట బీమాను ఎత్తివేయడం సరికాదని రైతులు వాపోతున్నారు.
Also Read: Bhadrachalam Five Villages : ఏపీ వద్దు తెలంగాణలో కలిపేయండి - తీర్మానాలు చేసిన ఐదు ఏపీ పంచాయతీలు!