Mancherial: ఎప్పట్లాగే ఊళ్లోకి ఆర్టీసీ బస్సు, వెంటనే దారులన్నీ క్లోజ్ - 12 రోజులుగా డ్రైవర్, కండక్టర్ అక్కడే
Mancherial Floods: గ్రామానికి గ్రామానికి వెళ్లడానికి రెండు దారులు ఉన్నాయి. ఒక మార్గం వరదల వల్ల కొట్టుకుపోయింది. మరొకటి ప్రాణహిత ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పెరిగిపోవడం వల్ల మొత్తం మునిగిపోయింది.
Mancherial Floods News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు కురిసిన తీవ్రతకు అద్దం పట్టే ఘటన ఇది. మంచిర్యాల జిల్లాలో జరిగింది. 12 రోజుల క్రితం వెళ్లిన ఆర్టీసీ బస్సు వరదల కారణంగా తిరిగి రాలేదు. ఆ ఊళ్లోని ఉండిపోవాల్సి వచ్చింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెంచపల్లి గ్రామానికి ఈ నెల 8న ఆర్టీసీ బస్సు ఎప్పటి లాగానే వెళ్లింది. సరిగ్గా అదే సమయంలో కురిసిన భారీ వర్షాలకు ఆ బస్సు రాలేకపోయింది. దీంతో ఆ గ్రామంలోనే బస్సుతోపాటు డ్రైవర్, కండక్టర్ ఉండాల్సి వచ్చింది.
వెంచపల్లి గ్రామానికి గ్రామానికి వెళ్లడానికి రెండు దారులు ఉన్నాయి. ఒక మార్గం వరదల కారణంగా కొట్టుకుపోయింది. మరొకటి రాచర్ల - ముల్కల్లపేట రోడ్డు. ఈ రహదారి మొత్తం ప్రాణహిత ప్రాజెక్టు (Pranahitha Project) బ్యాక్ వాటర్ పెరిగిపోవడం వల్ల మొత్తం మునిగిపోయింది. దీంతో బస్సు తిరిగి మంచిర్యాల డిపోకు చేరుకునేందుకు ఏ మార్గమూ లేకుండా పోయింది. రోడ్డు లేకపోవడంతో బస్సుతో పాటు డ్రైవర్ సత్యనారాయణ, కండక్టర్ విశ్వజిత్ గ్రామంలోనే 12 రోజులుగా ఉంటున్నారు. సర్పంచ్ పడాల రాజుబాయి ఆధ్వర్యంలో వారికి భోజన వసతి కల్పించారు. మరో మూడు నాలుగు రోజుల వరకు ప్రాణహిత ప్రవాహం తగ్గే అవకాశం లేకపోవడం వల్ల అప్పటి వరకు వీరు గ్రామంలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
పది రోజుల క్రితం మంచిర్యాలలో ఇదీ పరిస్థితి
ఉత్తర తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లా (Mancherial District News) కూడా తీవ్రంగా ప్రభావితం అయింది. ఒక్క మంచిర్యాల పట్టణంలోనే వరదలో 8 కాలనీలు మునిగాయి. స్థానిక ఎమ్మెల్యే దివాకర్‌రావు ఇల్లు కూడా అప్పుడు జలదిగ్బంధంలో ఉండిపోయింది. చెన్నూరు నియోజకవర్గంలో 35 గ్రామాలు నీటమునిగాయి. వేలాది మంది వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదలతో కాలనీల్లో నీరు ముంచెత్తింది. నీళ్ల పెరుగుదల పరిశీలిస్తూ ప్రజలు క్షణక్షణభయంతో గడిపారు. గోదావరిఖని బ్రిడ్జి దగ్గర వరద ప్రవాహంతో మంచిర్యాలకు కరీంనగర్ రాకపోకలు నిలిచిపోయాయి.
వరదల కారణంగా బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ సింగరేణి డివిజన్‌లలో ఐదు ఓపెన్‌కాస్టు గనుల్లో 44 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. కంపెనీకి సుమారు రూ.15.4 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే ఐదు ఓసీపీల్లో దాదాపు 3.7 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ (మట్టి) తొలగింపు పనులు నిలిచిపోయాయి. వరద తగ్గాక మళ్లీ మొదలయ్యాయి.