Kadem Project News: ప్రమాదకరంగా కడెం ప్రాజెక్టు, 64 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో వరద - చుట్టుపక్కల ఊర్లన్నీ ఖాళీ!
Kadem Project: నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ, ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్యే రేఖా నాయక్, అదనపు కలెక్టర్ హేమంత్ ప్రాజెక్టు వద్దకు వచ్చి పరిస్థితిని అంచనా వేశారు.
నిర్మల్ జిల్లాలో ఉన్న కడెం ఆది నారాయణ రెడ్డి సాగు నీటి ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. జిల్లాతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదిలో వరద నీరు పోటెత్తుతోంది. దీనివల్ల కడెం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయి నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. ప్రాజెక్టులోకి 5 లక్షల క్యూసెక్కుల వరద నీటి ఇన్ ఫ్లో కొనసాగుతుండగా, అధికారులు 17 గేట్లు ఎత్తి 3 లక్షల క్యూసెక్కుల నీటిని స్పిల్ వే ద్వారా బయటికి వదులుతున్నారు.
అయితే, అవుట్ ఫ్లో కంటే ఇన్ ఫ్లో 2 లక్షల క్యూసెక్కులు ఎక్కువ ఉంటూ ఉంది. దీంతో ప్రాజెక్టు కట్ట పై నుంచి కూడా నీరు ప్రవహిస్తోంది. ప్రాజెక్టుకు మొత్తం 18 గేట్లు ఉండగా, అందులో ఒకటి పని చేయడం లేదు. దీంతో 17 గేట్లను పూర్తిగా తెరిచారు. మరోక మొరాయించిన గేటును ఎత్తేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వరద ఇంకా పెరిగితే మరింత ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టు పరిస్థితి గురించి నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ నీటిపారుదల ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో సమీక్ష చేపట్టారు. కలెక్టర్ ముషారఫ్ అలీ, ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్యే రేఖా నాయక్, అదనపు కలెక్టర్ హేమంత్ ప్రాజెక్టు వద్దకు వచ్చి పరిస్థితిని అంచనా వేశారు. వరద ఉధృతి అధికంగా ఉండటంతో కడెం, దస్తురాబాద్ మండలాలకు చెందిన 20 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. డ్యాం దిగువన ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటి వరకు 12 గ్రామాలకు చెందిన 3 వేల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
కడెం ప్రాజెక్టుకి ఈ స్థాయిలో వరద రావడం చాలా ఏళ్ల తర్వాత అని ఉన్నతాధికారులు తెలిపారు. ఎన్నడూ లేనివిధంగా 64 ఏళ్ల రికార్డును బద్దలు చేసినట్లయిందని చెబుతున్నారు. కడెం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 7.603 టీఎంసీలు. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంది.
మరోవైపు, ఇదే జిల్లాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు వరద బాగా పెరిగింది. దీంతో ప్రాజెక్టులో నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరింది. ప్రాజెక్టులోకి 56 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, 42,300 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తుంది. వరద ప్రవాహం పోటెత్తడంతో అధికారులు ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.