Nirmal Master Plan: ఆమరణ దీక్షతో క్షీణిస్తున్న మహేశ్వర్ రెడ్డి ఆరోగ్యం - దీక్షకు మహారాష్ట్ర ఎమ్మెల్యే సంఘీభావం
Nirmal Ex MLA Alleti Maheshwar Reddy: నిర్మల్ మున్సిపాలిటీ కొత్త మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరుకుంది.
Nirmal Ex MLA Alleti Maheshwar Reddy: నిర్మల్ మున్సిపాలిటీ కొత్త మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న దీక్ష విరమించేదిలేదని, మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మహేశ్వర్ రెడ్డి ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముత్కేడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే తుషార్ గోవింద్ రావు రాథోడ్.. మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు. మహేశ్వర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంతో గోవింద్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం జరిగిన పోలీసుల లాఠీ ఛార్జ్ ను తీవ్రంగా ఖండించారు. గాయాలపాలైన పలువురు నాయకులను, కార్యకర్తలను ఆయన పరామర్శించారు. ఇకనైనా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దిగిరావాలని తక్షణమే G.O 220 మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రావుల రాంనాథ్, సామ రాజేశ్వర్ రెడ్డి, మేడిసెమ్మ రాజు, నాయుడి మురళి, వొడిసెల అర్జున్, జాను బాయి, అల్లం భాస్కర్, తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మంత్రి ఇంద్రకరణ్ ఇంటి ముట్టడికి యత్నం..
ఆమరణ నిరాహార దీక్షతో ఏలేటి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుండడంతో ఆయన అభిమానులు కార్యకర్తలు, పెద్ద ఎత్తున ఆయన నివాసం వద్దకు చేరుకుంటున్నారు. మహేశ్వర్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు రావడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు లోపలికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వెనుతిరిగి వెళ్లారు. పెద్ద ఎత్తున మహిళలు సైతం ఈ ఆందోళనలో పాల్గొని రోడ్డుపైకి వెళ్లి రాస్తారోకో చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు బయలుదేరగా పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పలు గ్రామాల్లో బిజెపి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అటు నిర్మల్ గంజాల్ టోల్ ప్లాజా వద్ద మహేశ్వర్ రెడ్డి వద్దకు వెళ్లకుండా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, డీకే అరుణ లను పోలీసులు అడ్డుకున్నారు.
నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని బిజెపి నాయకులు నిన్న రాస్తారోకో చేస్తున్న బీజేపీ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బిజెపి నాయకులు రాస్తారోకోతో పాటు ఆందోళన చేపట్టారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు చూడగా పోలీసులు అడ్డుకోవడంతో, బిజెపి నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వివాదంతో పాటు తోపులాట జరిగింది. బిజేపి జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి లు బిజేపీ నాయకులతో రాస్తారోకో చేసి ఆందోళన చేపట్టారు. నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన సొంత ఆస్తులను పెంచుట కొరకు నిర్మల్ పట్టణ మాస్టర్ ప్లాన్ తెర పైకి తీసుకొచ్చారన్నారు,
రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరిగినా అక్రమం జరిగినా దానిని అడ్డుకోవడంలో భారతీయ జనతా పార్టీ ముందు వరుసలో ఉంటుందని, ఈ కారణంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలు ఎక్కడ తనను ముంచుతాయో అని బిజెపి కార్యకర్తల చేతులు కాళ్లు విరిగే విధంగా పోలీసులతో గూండాల లాగా దాడి చేయడం జరిగిందని, ఆ అమానుష దాడిని ఖండిస్తూన్నామని, నేడు ఆదిలాబాద్ లో శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టే క్రమంలో పోలీసులు జోగు రామన్న తొత్తులుగా జోగు రామన్న గుండాలుగా మాపై దాడి చేయడాన్నీ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.