మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ కౌన్సిల్ తీర్మానం- సంబరాలు చేసుకున్న రైతులు
మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం. రైతులకు మేలు చేసే పార్టీ బీఆర్ఎస్ అన్న ఛైర్‌పర్శన్. అన్నదాతల విజయమన్న ఐక్య కార్యచరణ కమిటీ.
కామారెడ్డి పట్టణంలో గత కొన్నాళ్లుగా రైతులు చేస్తున్న ఆందోళనకు ఫుల్ స్టాప్ పడింది. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో మున్పిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఛైర్‌పర్శన్ నిట్టు జాహ్నవి అధ్యక్షతన సమావేశం జరిగింది. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేశారు. ముసాదాను తయారు చేసిన డిజైన్ డెవలప్మెంట్ ఫోరం డీటీసీపీ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. దీంతో గత నెల రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనలకు ఫుల్ స్టాప్ పడినట్లైంది.
మున్సిపల్ ఛైర్‌పర్శన్ నిట్టు జాహ్నవి మాట్లాడుతూ... 2021లో మాస్టర్ ప్లాన్‌ను తీర్మానించి పైఅధికారులకు పంపాం. ఆ మాస్టర్ ప్లాన్ కాకుండా డిజైన్ డెవలప్మెంట్ ఫోరం ఢిల్లీ వాళ్లు పంపిన మాస్టర్ ప్లాన్ వేరే ఉండటం వల్ల ఇబ్బందులు తలెత్తాయ్. రెసిడెన్సియల్ జోన్ కాస్త ఇండస్ట్రీయల్ జోన్‌గా పంపడం వల్ల అన్నదాతలు ఆందోళన చెందారు. మాస్టర్ ప్లాన్ ప్రొడ్యూస్ చేశారో దాన్ని ప్రతిపక్షాలు రైతులను మిస్ లీడ్ చేశారు. ఈ మాస్టర్ ప్లాన్‌ను తామే తెచ్చినట్లు ప్రతిపక్షాలు ఆరోపించటం సరికాదు. ఈ మాస్టర్ ప్లాన్‌ను డిటిసీపీ తప్పిదం వల్లే జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ రైతుల పక్షంగానే ఉంటుంది. రద్దు చేసిన మాస్టర్ ప్లాన్‌ను పై అధికారులకు పంపుతున్నాం అని అన్నారు.
అధికార పార్టీయే ఈ మాస్టర్ ప్లాన్ డ్రాప్ట్ ను ప్రవేశపెట్టింది. 50 రోజులుగా రైతులు రోడ్లపై కూర్చోవటానికి... 150 మందిపై కేసులు పెట్టడానికి కారణం బీఆర్ఎస్ పార్టీయే అన్నారు బీజేపీ కౌన్సిలర్లు. ఇష్టమొచ్చినట్లు తీర్మానాలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీజేపీ కౌన్సిలర్లు ఆరోపించారు. రైతు ప్రాణం పోయింది దానికి ఎవరు సమాధానం చెప్పాలి. అసలు మాస్టర్ ప్లాన్ ను ఎందుకు పబ్లిష్ చేశారని ప్రశ్నించారు. 50 రోజులుగా జరిగిన పరిణామాలపై మున్సిపల్ కమిషనర్ మీద యాక్షన్ తీసుకోవాలని బీజేపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. తాము రైతుల పక్షాన ఉండటం వల్లే మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రైతులకు అన్యాయం జరుగుతోందని అన్నదాతల ఆందోళనలకు బీజేపీ మద్దతు తెలిపిందన్నారు కౌన్సిలర్లు.
మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ... మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేయటంతో... విలీన గ్రామాల రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఆడ్లూర్ లో రైతు జేఏసీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. విలీన గ్రామాల రైతులు టపాసులు పేల్చారు. కౌన్సిల్‌లో మాస్టర్ ప్లాన్ రద్దు తీర్మానం పట్ల వారంతా హర్షం వ్యక్తం చేశారు. మాస్టర్ ప్లాన్ రద్దు తీర్మానం అన్నదాతల విజయమన్నారు రైతు జేఏసీ నాయకులు. పూర్తి స్థాయిలో మాస్టర్ ప్లాన్ రద్దు అయి... రైతులకు ఇబ్బంది కలగకుండా కొత్త మాస్టర్ ప్లాన్ రావాలని అన్నారు. తాత్కాలికంగా ఉద్యమానికి విరామం ప్రకటిస్తున్నామని తెలిపారు రైతు జేఏసీ నాయకులు.