Muharram 2025: మొహర్రం ఉత్సవాలు ప్రారంభం, తెలంగాణలోనే పేరుగాంచిన రుయ్యాడి హస్సేన్ హుస్సేన్ ఆలయం
Muharram 2025: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లోను ఆదివాసీలు మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహర్రం ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటారు. ఇక్కడ ప్రత్యకమైన హుస్సేన్ హుస్సేన్ ఆలయం ఉంది.

ఆదిలాబాద్: దేశ వ్యాప్తంగా శుక్రవారం నుంచి మొహర్రం ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. కుల, మత భేదాలు, చిన్నా పెద్ద తేడాలేకుండా అంతా భక్తి శ్రద్ధలతో మొహర్రం నిర్వహించుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో మతసామరస్యానికి ప్రతీకగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో హస్సేన్ హుస్సేన్ దేవస్థానంలో పీరీల ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తువస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే నిర్వాహకులు పీర్ల బంగ్లాలను శుభ్రం చేయడం, విద్యుత్తు దీపాల అలంకరణ పనుల్లో నిమగ్నమయ్యారు. పదిరోజుల పాటు నియమనిష్ఠలు, హిందూముస్లింలు ఐక్యతతో వీటిని నిర్వహిస్తారు.
రయ్యాడి అంటేనే పీర్ల పండుగ స్పెషల్ అని అందరు అంటుంటారు. ఇక్కడ మొహర్రం సందర్భంగా జరిగే ఉత్సవాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, పక్కనున్న మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. హస్సేన్ హుస్సేన్ దేవస్థానంలో పీర్లనూ దర్శించుకొని తమ మొక్కులు చెల్లిస్తారు. రాష్ట్రంలోనే పేరుగాంచిన రుయ్యాడి హస్సేన్ హుస్సేన్ దేవస్థానంలో మోహర్రం సందర్భంగా ఆలయ కమిటీల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏజెన్సీ ప్రాంతాల్లోను మోహర్రం ఉత్సవాలు
మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహర్రం ఉత్సవాలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లోను ఆదివాసులు సైతం ఘనంగా జరుపుకుంటారు. హస్సేన్ హుస్సేన్, డోలా, సవారీ, పులిఖేల్ తదితర పీర్ల పేరిట ఈ ఉత్సవాలను జరుపుకుంటారు. సాంప్రదాయ డప్పు చప్పులతో రకరకాల వాయిద్యాలు వాయిస్తూ పది రోజులపాటు గ్రామాల్లో ఎంతో సందడిగా ఈ మొహర్రం ఉత్సవాలను జరుపుకుంటారు. పది రోజుల మొహర్రం ఉత్సవాలలో ప్రతి రోజు ప్రారంభించే ముందు పీర్లకు ప్రత్యేకంగా దేవ్ కా బాజా అనేది ఉంటుంది. దీన్ని "ధనక ధద్దన్ ధన్...ధనక ధద్దన్ ధన్" ఇలా ఈ వాయిద్యాన్ని వహిస్తారు.

అనంతరం మిగతా అన్ని రకాల వాయిద్యాలు వాయిస్తారు. ఇందులో ధూలే, గోండీ, పర్ధాని, రుమాలీ, తీన్ పావులీ, ఘోడాఖేల్, తదితర రకాల వాయిద్యాలను వాయిస్తూ ఈ మొహర్రం ఉత్సవాలను సంబరంగా జరుపుకుంటారు. ప్రస్తుతం ఆదివాసి గ్రామాల్లో ఆకాడి పండుగలను ఆదివాసీలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆకాడి పూజల తర్వాతే ఆదివాసీలు డప్పు చప్పులను వాయించడం మొదలుపెడతారు. నేటి నుంచే గ్రామాల్లో మొహరం ఉత్సవాలు ప్రారంభం కావడంతో, మొహర్రం ఉత్సవాలు నిర్వహించే గ్రామాలలో ముందుగా ఆకాడి పండుగలను జరుపుకుంటున్నారు. తర్వాత పీర్ల పండుగలను పది రోజుల పాటు ఘనంగా నిర్వహించుకోనున్నారు.





















