Jagannath Rath Yatra 2025:జగన్నాథ రథయాత్రకు సిర్వం సిద్ధం.. సగం చెక్కిన విగ్రహాల వెనుకున్న రహస్యం, దీన్నించి నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠం ఏంటి!
Rath Yatra 2025: భగవంతుడికి చేసే ప్రతి సేవ వెనుకా ఓ ఆంతర్యం ఉంటుంది. ఇందులో భాగమే జగన్నాధుడి రథయాత్ర. భక్తులను తన్మయత్వానికి గురిచేసే ఈ రథయాత్రకు ఆధ్యాత్మిక జీవితానికి ఏంటి సంబంధం?

Jagannath Rath Yatra 2025
నేరుగా గర్భగుడి నుంచి జనం మధ్యకు తరలివచ్చే భగవంతుడు
ఎంత మంది రాజులున్నా, చక్రవర్తులున్నా...ఈ జగానికి ఆయనే రాజు
ఏడాదికోసారి కన్నులపండువగా జరిగే రథయాత్ర వెనుకున్న ఆంతర్యం ఏంటి?
ఆ విగ్రహాలు ఎందుకు సగమే చెక్కి ఉంటాయి?
ఇంద్రద్యుమ్న మహారాజుకు శ్రీ మహా విష్ణువు కలలో కనిపించి నదీతీరానికి ఓ కొయ్యదుంగ కొట్టుకు వస్తుంది..దానితో జగన్నాథ, సుభద్ర, బలభద్రుల విగ్రహాలను తయారు చేయాలని ఆజ్ఞాపించాడు. శ్రీ మహావిష్ణువు సూచించినట్టే నదీతీరంలో కొయ్యదుంగ లభించింది. కానీ ఆ దారువును విగ్రహాలుగా మలిచేందుకు ఏ శిల్పీ ముందుకు రాలేదు. విష్ణువు ఆజ్ఞ నెరవేర్చలేకపోయాను అనే బాధలో ఉన్నాడు ఇంద్రద్యుమ్న మహారాజు. ఆ సమయంలో నేరుగా దేవశిల్పి విశ్వకర్మ మారువేషంలో రాజ్యానికి వచ్చాడు. విగ్రహాలను నేను చెక్కుతాను..అయితే ఆ పని పూర్తయ్యేవరకూ నాకు ఎలాంటి ఆటంకం కలిగించకూడదు అని చెప్పాడు. విగ్రహాలను చెక్కే గదిలోకి ఎవ్వరూ రాకూడదన్నాడు. ఆ శిల్పి పెట్టిన షరతుకి అంగీకరించిన మహారాజు విగ్రహాలను మలిచేందుకు ప్రత్యేకమైన గది ఏర్పాటు చేశాడు. శిల్పి తలుపులు మూసుకుని విగ్రహాలు చెక్కడం ప్రారంభించాడు. అలా రెండు వారాలు గడిచింది కానీ తలుపులు తెరవలేదు. ఏం జరుగుతోందో అర్థంకాక షరతును అధిగమించి గది తలుపులు తెరిచి చూశాడు. వెంటనే విశ్వకర్మ అదృశ్యమయ్యాడు. పని పూర్తికాలేదు..అలా సగం చెక్కిన విగ్రహాలు ఉండిపోయాయి. భగవంతుడి ఆజ్ఞమేరకు ఆ విగ్రహాలనే ప్రతిష్టించాడు మహారాజు.
దేవశిల్పి విశ్వకర్మ చెప్పిన షరతుకి లోబడి మహారాజు వ్యవహరించి ఉంటే..సంపూర్ణ విగ్రహాలను దర్శించుకునే అదృష్టాన్ని ఇంద్రద్యుమ్నుడికి దక్కేది..కానీ అలా జరగలేదు. ఎన్నో ఏళ్లుగా భగవంతుడికోసం సాధన చేస్తున్నవారికి స్వామి అనుగ్రహం కలగకపోతే నిరుత్సాహం కలగడం సహజం. కానీ గురువు ఉపదేశాలపై విశ్వాసం ఉంచి సహనంగా వ్యవహరిస్తూ సంపూర్ణ సాధన చేసినప్పుడే భగవంతుడి అనుగ్రహం సిద్ధిస్తుంది. ఎవరి ఆధ్యాత్మి పురోగతిని వారే బేరీజు వేసుకోవడం అహంకారాన్ని తెలియజేస్తుంది...అందుకే గురు వాక్యాలపై సంపూర్ణ విశ్వాసం ఉంచి సాధన చేయాలి, గురువు ఆజ్ఞను ఉల్లంఘించకుండా శ్రద్ధతో సాధన చేయాలి.
రథయాత్రకు ఆధ్యాత్మికత యాత్రకు ఏంటి సంబంధం అంటే.. జగన్నాథుడి రథం చాలా నెమ్మదిగా ముందుకి సాగుతుంది. అసలు మొదట్లో ఎంత కదిలించినా వేలమంది పట్టి లాగినా కదలదు. చాలా కష్టపడిన తర్వాత రథం ముందుకు కదులుతుంది. మొదటి అడుగుపడేందుకు ఎంతో కష్టం అనిపించినా ఆ తర్వాత ఎన్ని అవాంతరాలు ఎదురైనా కానీ రథయాత్ర సాగిపోతుంది. ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనా గమ్యాన్ని చేరుతుందే కానీ వెనుతిరగదు. అలా ఏ పని ప్రారంభించినా, ఆధ్యాత్మిక సాధన చేసినా ఆరంభంలో అడుగు ముందుకు వేయడం కష్టం కావొచ్చు. కానీ.. అడుగు పడిన తర్వాత గమ్యాన్ని చేరేవరకూ ఎలాంటి ప్రలోభాలకు , ఆకర్షణలకు లోనుకాకూడదు. నిగ్రహంతో లక్ష్యం దిశగా అడుగు వేయాలి. గమనం నెమ్మదిగా అయినా పర్వాలేదు కానీ సురక్షితంగా గమ్యం చేరుకోవాలి. జగన్నాథుడి రథయాత్ర వెనుకున్న ఆంతర్యం ఇదే..
యదా సంహరతే చాయం కూర్మో ర్గానీవ సర్వశః |
ఇన్డ్రియాణీన్డ్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ||
'తాబేలు అవయవాలన్నింటినీ తనలోకి ఇముడ్చుకొన్నట్లు సాధకుడు తన ఇంద్రియాలను ఇంద్రియ విషయాల నుండి ఉపసంహరించుకోవాలి. అలాంటి వాడు స్థిరమైన బుద్ధి కలిగివుంటాడు'
ఆధ్యాత్మిక యాత్రలో ఎలాంటి ఆకర్షణలకూ ప్రలోభ పడకుండా, ఆటంకాలకు నిరుత్సాహపడకుండా, నిత్యానిత్య వస్తు వివేకంతో వ్యవహరిస్తూ గమనాన్ని గమ్యం వైపే సాగించాలి. జగన్నాథరథం ఎప్పుడూ ముందుకే పయనించడంలోని అంతరార్థం ఇదే!






















