Marriage At Hospital: ఆసుపత్రిలో పెళ్లి - ఆసుపత్రి బెడ్ పైనే తాళి కట్టిన వరుడు, అసలేం జరిగిందంటే !
ముహూర్తం సమయంలో ఆసుపత్రిలో ఆపరేషన్ చికిత్స పొందుతున్న వధువుకు వరుడు ఆసుపత్రిలోనే తాళి కట్టాడు. వేద మంత్రాలు చదువుతుంటే వధువు మెడలో అతడు తాళి కట్టాడు వరుడు.
Marriage At Hospital in Mancherial District : మంచిర్యాల జిల్లాలోని ఓ ఆసుపత్రిలో పెళ్లి జరిగింది. అదేంటి సినిమా సీన్లలోనే ఇలా జరుగుతాయి అనుకుంటున్నారా. ఇది మీకు నమ్మశక్యంగా లేదని భావిస్తున్నారా. కానీ ఇది నిజమే. అయితే వారి పెళ్లికి ముహూర్తం ఖరారైంది. రెండు వైపుల వారూ అన్నీ సిద్ధం చేసుకున్నారు. కానీ ఇంతలోనే వధువు అస్వస్థతకు గురయింది. ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయినా ఆ శుభ ముహూర్త ఘడియలలోనే పెళ్లి జరిగింది. ముహూర్తం సమయంలో ఆసుపత్రిలో ఆపరేషన్ చికిత్స పొందుతున్న వధువుకు వరుడు ఆసుపత్రిలోనే తాళి కట్టాడు. వేద మంత్రాలు చదువుతుంటే వధువు మెడలో అతడు తాళి కట్టడంతో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
అసలేం జరిగిందంటే..
మంచిర్యాల జిల్లా ( Mancherial District ) చెన్నూర్ మండలం లంబాడి పల్లికి చెందిన శైలజ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ( Jayashankar Bhupalpally District )కు చెందిన తిరుపతికి పెళ్లి నిశ్చయం అయింది. ఈ రోజు (గురువారం) వివాహం జరగాల్సి ఉంది. అయితే నిన్న బుధవారం పెళ్ళికూతురు అస్వస్థత గురైంది. వెంటనే బంధువులు మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆసుపత్రిలో ఆమెకు ఆపరేషన్ జరిగింది. పెండ్లి వాయిదా పడోద్దనే ఉద్దేశంతో వరుడు ఆసుపత్రిలోనే బెడ్ పై ఉన్న శైలజకు అనుకున్న ముహుర్తం సమయంలోనే అందరి సమక్షంలో తిరుపతి శైలజకు తాళి కట్టి భార్యగా చేసుకున్నాడు. అనంతరం దండలు మార్చుకొని పెద్దల ఆశీస్సులు పొందారు. పెళ్ళి అనంతరం మీఠాయిలు తినిపించారు. ఆసుపత్రిలో పెళ్ళి జరిగిన విషయం తెలిసి అందరు ఆశ్చర్యానికి గురయ్యారు.
పెళ్లి గురించి వధువు కుటుంబం కంగారు!
కుమార్తె పెళ్లి నిశ్చయం అయిందని, అంతా ఓకే అనుకున్న సమయంలో కుమార్తె అస్వస్థతకు గురికావడంతో ఆమె తల్లిదండ్రులు కాస్త ఆందోళనకు లోనయ్యారు. కానీ వరుడు, అతడి కుటుంబం వధువు కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకున్నారు. ఆసుపత్రి సిబ్బంది పర్మిషన్ తీసుకుని హాస్పిటల్ లోనే వివాహం చేసుకుంటామని చెప్పడంతో వధువు తల్లిదండ్రులు టెన్షన్ నుంచి రిలీఫ్ అయ్యారు.
కథ సుఖాంతం..
చిన్న అవకాశం దొరికితే ఏదో సాకు చెప్పి పెళ్లి రద్దు చేసుకుంటున్న ఘటనలు మనం చూస్తున్నాం. పెళ్లికి ముందే ఇలా జరిగిందంటే అపశకునం, ఐరన్ లెగ్ అంటూ లేనిపోని మాటలు అంటారని వధువు తల్లిదండ్రులు ఆందోళన చెందారు. కానీ అలాంటి పరిస్థితి తలెత్తలేదు. అయితే ఇక్కడ వరుడు తిరుపతి.. వధువు శైలజ పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఆసుపత్రిలో ఉన్నా ఏ ఇబ్బంది లేదని పెద్దలతో కలిసి అక్కడికి వచ్చాడు. ఆసుపత్రి బెడ్ పై వధువు ఉంటే తిరుపతి ఆమె మెడలో తాళి కట్టాడు. వధూవరులు దండలు మార్చుకున్నారు. అనంతరం కాలికి మెట్టెలు కూడా తొడిగాడు. వివాహం కొంచెం కొత్తగా జరగడంతో హాస్పిటల్ లో వివాహానికి ఇరు కుటుంబాలకు చెందిన కొందరు బంధువులు హాజరయ్యారు. ఆసుపత్రి కనుక అక్షింతలు వేయలేకపోయారు. అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరగడంతో హర్షం వ్యక్తం చేశారు. పెళ్లికి హాజరైన బంధువులు, సన్నిహితులు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.