Sirpur Politics: బిఆర్ఎస్ పార్టీలో చేరిన కోనేరు కోనప్ప-ఆసక్తిగా సిర్పూరు రాజకీయం
Sirpur Politics: సిర్పూరు రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఆర్‌ఎస్ ప్రవీణ్‌తో పడటం లేదని కారు దిగిన కోనప్ప మళ్లీ గులాబీ గూటికి చేరారు. భవిష్యత్‌లో అక్కడ టికెట్ ఎవరికి దక్కుతుందనే చర్చ జోరుగా సాగుతోంది.

Sirpur Politics: సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తిరిగి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. గత ఏడాది కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన కొద్ది రోజుల కిందట హస్తం దోస్తీకి కటీఫ్ చెప్పేశారు. తాను స్వతంత్ర అభ్యర్థిగానే ఉంటానని ప్రకటించిన ఆయన.. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆయన తమ్ముడు జడ్పీ మాజీ జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణా రావు ఇద్దరికీ పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్రెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కొద్ది రోజుల క్రితం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యల వల్లే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చానని చెప్పిన కోనప్ప తిరిగి అదే పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది.
గత ఏడాది మార్చి 6న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కోనేరు కోనప్ప.. ఏడాది కూడా పూర్తికాకముందే హస్తం దోస్తీకి కటీఫ్ చెప్పారు. కాగా.. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన కోనేరు కోనప్ప.. గత కొద్ది రోజుల క్రితం ఆ పార్టీకి కూడా గుడ్ బై చెప్పారు. తాజాగా ఆయన బిఆర్ఎస్ పార్టీలో చేరడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ మీద కానీ, కేసీఆర్ ను తాను ఎప్పుడూ విమర్శించలేదని కోనప్ప చెప్పడంతో ఆయన కచ్చితంగా కారు పార్టీలోనే చేరుతారని పలువురు అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సిర్పూర్ నియోజకవర్గంలో రాజకీయం మరింత వేడెక్కింది.
అర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కోనప్పకు అసలు పడదనే విషయం అందరికీ తెలిసిందే. రానున్న ఎన్నికల్లో సిర్పూర్ ఎమ్మెల్యే టికెట్ ఎవరికి వస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది. మరి దీనీపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎలా స్పందిస్తారనేది అందరూ చర్చించుకుంటున్నారు. అలాగే పార్టీ అధిస్థానం సైతం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.





















