Kamareddy News: కామారెడ్డి జిల్లాలో దారుణం - సెల్ టవర్ ఎక్కి మరీ రైతు ఆత్మహత్య
Kamareddy News: నష్టపోయిన పంటకు పరిహారం అందిస్తామన్న అధికారులు ఆవైపు చూడలేదు. అతడే వెళ్లినా వారు పట్టించుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడో అన్నదాత.
Kamareddy News: కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. నష్ట పోయిన పంటకు పరిహారం రాలేదని మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సెల్ టవర్ ఎక్కి మరీ ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్నదాతలకు సమైక్య పాలనలో అన్యాయం జరిగిందని, తమ పాలనతో న్యాయం జరుగుతోందని సీఎం కేసీఆర్ మాయ మాటలు చెబుతున్నారని ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శించారు.
అసలేం జరిగిందంటే..?
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం మేoగారం గ్రామానికి చెందిన పుట్ట ఆంజనేయులు అనే రైతు గ్రామంలోని సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో మెంగారం చెరువు తెగి ఆంజనేయులు పంట పొలంలోకి నీరు చేరింది. పంట మొత్తం నీట మునగడంతో తీవ్రంగా నష్టపోయాడు. భూమి సాగు చేసేందుకు చేసిన అప్పుతో పాటు పంట నష్టం తీవ్ర వేదనను మిగిల్చింది. అయితే అప్పుడే వచ్చిన అధికారులు, ప్రజా ప్రతినిధులు.. నాశనం అయిన పంటకు నష్ట పరిహారం ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత ఆంజనేయులు చాలా సార్లు అధికారుల చుట్టూ తిరిగాడు. నష్టపరిహారం అందించామని ఆఫీసులు చుట్టూ తిరిగి తిరిగీ అలసిపోయాడు. ఓ వైపు అప్పులు పెరిగిపోవడంతో ఏం చేయాలో పాలుపోక ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామంలోని సెల్ టవర్ ఎక్కాడు. అక్కడే ఉన్న స్థానికులు ఎంతగా దిగమని చెప్పినా వినలేదు. భార్యా, ఇద్దరు పిల్లలు వచ్చి బతిమాలినా కనికిరించలేదు. అదే సెల్ టవర్ పై ఉరి వేసుకొని భార్యా, పిల్లల ముందే ప్రాణాలు కోల్పోయాడు. అది చూసిన గ్రామస్థులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
నెల రోజుల క్రితం భూ సమస్యలు తీర్చాలంటూ సెల్ టవర్ ఎక్కిన రైతు..
అనంతపురం జిల్లాలోని ఇల్లూరు గ్రామం. అదే గ్రామానికి చెందిన శ్రీ రాములు, సుజాతమ్మల కుమారుడు పురుషోత్తం. అతనికి వారసత్వంగా తాత ముత్తాతల నుండి కొంత భూమి వచ్చింది. ఆ భూమిలోనే పురుషోత్తం పంటలు వేసుకుంటూ సాగు చేస్తున్నాడు. అయితో సుబ్బ రాయుడు అనే వ్యక్తి పురుషోత్తానికి సమీప బంధువు అవుతాడు. ఆ సుబ్బ రాయుడుకు.. పురుషోత్తం తల్లిదండ్రులు శ్రీరాములు, సుజాతమ్మల మధ్య నాలుగేళ్లుగా భూతగాదా నడుస్తూ వస్తోంది. పురుషోత్తం కుటుంబానికి చెందిన భూమిలో తనకు 56 సెంట్లు వస్తుందని సుబ్బ రాయుడు వాదిస్తూ వస్తున్నారు. ఈ మేరకు సుబ్బ రాయుడు పోలీసు స్టేషన్ లో తన భూమి తనకు ఇప్పించాలని కోరుతూ ఫిర్యాదు చేశాడు.
ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులు!
సుబ్బ రాయుడు చేసిన కంప్లైంట్ మేరకు పురుషోత్తంను పలు మార్లు పోలీసులు స్టేషన్ కు పిలిచారు. అయినా తన సమస్య పరిష్కారం కావడం లేదని పురుషోత్తం మనవేదనకు గురి అయ్యాడు. పదే పదే స్టేషన్ కు పిలుస్తున్నారు కానీ.. భూ సమస్యను పరిష్కరించడం లేదని వాపోయిన పురుషోత్తం.. తన ప్రాణాలు తీసుకునేందుకు కూడా వెనకాడలేదు. పురుషోత్తం గార్లదిన్నెలో సెల్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగాడు. తన భూమిలో 56 సెంట్లు వస్తుందంటూ సుబ్బ రాయుడు లేవనెత్తన వివాదాన్ని పరిష్కరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. సెల్ టవర్ పై నుండి దూకుతానని హెచ్చరించాడు.
ఎట్టకేలకు కిందకు దిగిన పురుషోత్తం..
పురుషోత్తం సెల్ టవర్ పై దాదాపు గంట పాటు అలాగే ఉన్నాడు. పోలీసులు తనకు న్యాయం చేయడం లేదని.. తన భూ సమస్యను పరిష్కరించడం లేదని వాపోయాడు. మాటి మాటికి తనను పోలీసు స్టేషన్ కు పిలిపించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ భూమి తనకు వారసత్వంగా వస్తోందని... సుబ్బ రాయుడు కావాలనే 56 సెంట్ల కోసం, తమను మానసికంగా వేధించడం కోసం వివాదం లేవనెత్తాడని పురుషోత్తం పేర్కొన్నాడు. తన భూ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. పురుషోత్తం సమస్యలను పూర్తిగా విని.. తనకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పోలీసులు హామీ ఇవ్వడంతో పురుషోత్తం సెల్ టవర్ పై నుండి కిందకు దిగాడు.