Kagaznagar మైనారిటీ గురుకులంలో ఫుడ్ పాయిజన్, 45 మంది విద్యార్థులకు అస్వస్థత
Food Poisoning At Kagaznagar Minority Gurukula school: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ లోని మైనారిటీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. సుమారుగా 45 మంది విద్యార్థుల వరకు అస్వస్థతకు గురయ్యారు.
కాగజ్‌నగర్ మైనారిటీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఫుడ్ పాయిజన్ కావడంతో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సిబ్బందికి విషయం చెప్పిన ఎవరూ పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు ఆందోళనకు సైతం దిగారు. విద్యార్థుల ఆందోళన విషయం తెలుసుకున్న స్థానిక మీడియా ప్రతినిధులు గురుకులానికి వెళ్లగా.. సిబ్బంది వారిని లోనికి అనుమతించలేదు. తరువాత పోలీసులు రావడంతో అస్వస్థతకు గురైన విద్యార్థులను గమనించి పోలీసులు స్వయంగా వారి వాహనంలో పలువురు విద్యార్థులను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
45 మంది విద్యార్థులకు అస్వస్థతకు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ లోని మైనారిటీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. దీంతో సుమారుగా 45 మంది విద్యార్థుల వరకు అస్వస్థతకు గురయ్యారు. గురుకుల పాఠశాల సిబ్బందికి విషయం చెప్పినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తొలుత గురుకులానికి మీడియా చేరుకోగా, వారికి విషయం తెలియకుండా ఉండాలని గురుకులం సిబ్బంది వారిని లోనికి అనుమతించలేదు. విద్యార్థుల ఆందోళన విషయం తెలుసుకున్న కాగజ్‌నగర్ సీఐ నాగరాజు గురుకులం వద్దకు చేరుకోని సిబ్బందితో మాట్లాడి లోనికి వెళ్లి పరిశీలించారు.
అప్పటికే పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయారు. ఇది గమనించిన సీఐ నాగరాజు అస్వస్థతకు గురైన పలువురు విద్యార్థులను హుటాహుటిన తన వాహనంలో స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. గురుకులంలో అస్వస్థతకు గురైన మరికొంతమంది విద్యార్థులను నాలుగుసార్లు పోలీసు వాహనంలోనే స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. సోమవారం రాత్రి భోజనం చేసిన సమయంలో అన్నంలో పురుగులు వచ్చాయని విద్యార్థులు వాపోతున్నారు. ఇలా పలుమార్లు భోజనంలో పురుగులు వస్తున్నాయని చెప్పినా అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
బ్రేక్ ఫాస్ట్ బాలేదన్నారు, రాత్రి అన్నంలో పురుగులు
ఉదయం బ్రేక్ ఫాస్ట్ బాగాలేదని చెప్పామని, కానీ రాత్రి అన్నంలో పురుగులు వచ్చాయని వచ్చాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి పూట తిన్న అన్నంలో పురుగులు ఉండటం వల్లే పలువురు విద్యార్థులు కడుపు నొప్పి అంటు వాంతులు చేసుకోగా.. మరికొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆసుపత్రిలో మొత్తం 45 మంది వరకు విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. ఒకరిద్దరు మాత్రం కొంత తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, మిగతా అందరు క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
గత రెండు నెలలుగా వరుసగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గురుకులాల్లో, ఆశ్రమాల్లో, కేజీబీవీ పాఠశాలల్లో అన్నంలో పురుగులు ఉండటం వల్ల ఫుడ్ పాయిజనింగ్ లు జరగడం.. విద్యార్థులు అస్వస్థతకు గురికావడం పట్ల.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఏం జరుగుతుందోనని కంగారుపడి ఆవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఈ విషయం పట్ల తగిన జాగ్రత్తలు పాటించి, మెను ప్రకారం నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని, విద్యార్థులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. డిన్నర్ చేశాక విద్యార్థులు కూర్చున్నారు. అన్నం తింటుంటే లైట్ పురుగులు ప్లేట్లలో పడ్డాయని చెప్పిన విద్యార్థులు భయంతో వాంతులు చేసుకున్నారని చెప్పారు. డ్యూటీ టీచర్లు, వార్డెన్ తనకు సమాచారం అందించగా, అస్వస్థతకు గురైన విద్యార్థులను చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించామని చెప్పారు.