(Source: ECI/ABP News/ABP Majha)
KCR Nutrition Kits: కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ ముఖ్య ఉద్దేశం ఇదే: మంత్రి అల్లోల ఇంద్రకరణ్
Nuetrition Kits: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కేసీఆర్ న్యూటిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఆదిలాబాద్ లో మంత్రి ఇంద్రకరణ్, ఆసిఫాబాద్ లో బాల్క సుమన్ కిట్లను లబ్ధిదారులకు అందజేశారు.
Nuetrition Kits in Adilabad: గర్భిణీల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాలను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో జడ్పీ ఛైర్మెన్ రాథోడ్ జనార్థన్, స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ లతో కలిసి బుధవారం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పథకాన్ని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.
ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభించిన న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. తల్లీబిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం అందించడంతో పాటు మాతా, శిశు మరణాల నివారణ కోసం ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను ప్రవేశ పెట్టిందన్నారు. బిడ్డ సంరక్షణ కోసం ఇప్పటికే కేసీఆర్ కిట్ పథకం అమలు చేస్తున్న ప్రభుత్వం.. తల్లి సంరక్షణ కోసం ఇప్పుడు కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ల పథకాన్ని ప్రవేశ పెట్టిందని తెలిపారు. గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా రక్త హీనత నమోదవుతున్న 9 జిల్లాలు ఆదిలాబాద్ జిల్లా ఒకటని, కొత్తగా అమలు చేస్తున్న కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ పథకం గర్బిణులకు వరంగా మారనుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల కిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని, దీని కోసం ప్రభుత్వం రూ. 50 కోట్లు ఖర్చు చేస్తున్నదని వెల్లడించారు.
మరోవైపు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, జడ్పీ ఛైర్ పర్సన్ కోవ లక్ష్మి, స్థానిక ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పలతో కలిసి కేసిఆర్ న్యూట్రిషన్ కిట్లను లబ్ధిదారులకు అందజేశారు. అలాగే ఉట్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖా నాయక్ స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి కేసిఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు.
కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ లో ఏమేం ఉంటాయంటే..?
- కిలో న్యూట్రీషన్ మిక్స్ పౌడర్
- కిలో ఖర్జూర
- ఐరన్ సిరప్ 3 బాటిల్స్
- 500 గ్రాముల నెయ్యి
- ఆల్‌బెండజోల్ టాబ్లెట్
- కప్పు
- ప్లాస్టిక్ బాస్కెట్
ఎనీమియా నుంచి విముక్తి..
రక్త హీనత (ఎనీమియా) గర్బిణుల పాలిట శాపంగా మారుతుంది. గర్బిణులకు ప్రసవాలు సంక్లిష్టంగా మారుతున్నాయి. ఎనీమియా నివారించడం వల్ల మాతృ మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మాతా శిశు సంరక్షణ కోసం ఇప్పటికే అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మాతృ మరణాలు తగ్గించడంలో గొప్ప వృద్ధిని నమోదు చేసింది. ఈనెలలో కేంద్ర ప్రభుత్వ శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే ప్రకారం, మాతృ మరణాల రేటు 2014లో 92 ఉండగా, ప్రస్తుతానికి 43కు తగ్గింది. మాతృమరణాలు తగ్గించడంలో దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఈ సంఖ్యను మరింత తగ్గించేందుకు గాను కేసీఆర్ న్యూట్రీషన్ కిట్స్ పథకాన్ని అమలు చేస్తున్నది. తొలిదశలో భాగంగా గర్బిణుల్లో ఎనీమియా ప్రభావం ఎక్కువగా ఉన్న 9 జిల్లాల్లో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది.