Adilabad Tiger Zone: టైగర్ జోన్‌లోకి భారీ వాహనాలు - చాలా ఏళ్ల తర్వాత అనుమతి - మరి రక్షణ సంగతేంటి ?
Adilabad: ఆదిలాబాద్ కవ్వాల్ టైగర్ జోన్‌లోకి భారీ వాహనాలను అనుమతిస్తున్నారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు జెండా ఊపి లారీలకు అనుమతి ఇచ్చారు.

Heavy vehicles allowed into Adilabad Tiger Zone: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వులో భారీ వాహనాల రాకపోకలను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజనల్ పరిధిలోని తపాల్ పూర్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద బుధవారం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ భారీ వాహనానికి పచ్చ జెండా ఊపి, రూ.150 తీసుకొని రసీదు ఇచ్చి, ప్రారంభించారు. ఎమ్మేల్యే బొజ్జు పటేల్ ఆ 16 టైర్ల భారీ వాహనంలోనే కూర్చొని తపాల్ పూర్ చెక్ పోస్ట్ నుంచి జన్నారం వరకు ప్రయాణించారు.
కవ్వాల్ అభయారణ్యంలో భారీ వాహనాల అనుమతులు వచ్చినందున భారీ వాహనాలను మోటారు వాహన చట్టానికి లోబడి నడపాలన్నారు. భారీ లారీలు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే నడపాలని, వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం నిబంధనలకు లోబడి తక్కువ స్పీడ్ తో వాహనాలను నడిపించాలని తెలిపారు. ఈ అటవీ మార్గంలో భారీ లారీలు నడుస్తున్నందున వన్యప్రాణులకు ఎలాంటి హాని కలిగించకూడదని, వన్య ప్రాణులను గమనిస్తూ నెమ్మదిగా వెళ్లాలని సూచించారు.
గత కొన్ని ఏళ్లుగా భారీ వాహనాలు వెళ్లకపోవడంతో అభివృద్ధి నిలిచిపోయిందని, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ , పిసిసిఎఫ్ సువర్ణ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీం ఇతర అధికారులు మంత్రులతో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమావేశం నిర్వహించి ఇక్కడి ప్రాంత పరిస్థితులను వివరించి భారీ వాహనాలకు అనుమతులు ఇప్పించారు.
టైగర్ జోన్‌లలో, ముఖ్యంగా కోర్ జోన్‌లలో, పులులు, చిరుతలు వంటి వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరిస్తాయి, ప్రత్యేకించి రాత్రి సమయంలో. భారీ వాహనాలు, ముఖ్యంగా వేగంగా వెళ్ళే ట్రక్కులు, వన్యప్రాణులతో ఢీకొని ప్రమాదాలకు కారణమవుతాయి. భారీ వాహనాలు శబ్ద కాలుష్యం, దుమ్ము, వాయు కాలుష్యాన్ని కలిగిస్తాయి, ఇవి టైగర్ రిజర్వ్‌లలోని జీవవైవిధ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతాయి. భారీ వాహనాలు లేదా అనధికార వాహనాలు ఈ ప్రాంతాల్లోకి ప్రవేశిస్తే, మానవ-వన్యప్రాణి సంఘర్షణ ప్రమాదం పెరుగుతుంది. టైగర్ రిజర్వ్‌లలోని కోర్ జోన్‌లు చట్టపరంగా రక్షిత ప్రాంతాలుగా ఉంటాయి, ఇక్కడ మానవ కార్యకలాపాలు, ముఖ్యంగా వాణిజ్య లేదా భారీ వాహన రాకపోకలు, నిషేధిస్తారు. కొన్ని టైగర్ రిజర్వ్‌లలో, స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని, భారీ వాహనాలపై నిషేధాన్ని సడలించే ప్రతిపాదనలను అంగీకరిస్తున్నారు. ఈ సడలింపు అమలు కావడానికి ముందు, వన్యప్రాణులు , జీవవైవిధ్యంపై ప్రభావాన్ని అంచనా వేయడానికి నాలుగు సభ్యుల కమిటీ నియమించి.. నివేదిక తెప్పించుకుని నిర్ణయం తీసుకుంటున్నారు.





















