Adilabad Latest News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతుల యూరియా కష్టాలు - రోడ్డు ఎక్కుతున్న అన్నదాతలు
Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లాలో యూరియా కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రోజుల తరబడి ఎరువు కోసం పడిగాపులు కాస్తున్న అన్నదాతలు రోడ్డు ఎక్కుతున్నారు. వారికి ప్రతిపక్షాలు మద్దతు ఇస్తున్నాయి.

Adilabad Latest News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. రైతన్నలు యూరియా కోసం నానా రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. గంటల తరబడి క్యూ లైన్‌లో వేచి ఉన్న తమకు యూరియా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట ఎదుగుదల దశకు వచ్చిందని, వేయకుంటే ఎదుగుదల నిలిచిపోతుందని యూరియా కోసం నానా తిప్పలు పడుతున్నామంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యూరియా దొరకక ఇబ్బందుకు పడుతున్న రైతన్నలపై abp దేశం స్పెషల్ రిపోర్ట్.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతన్నలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురు చూస్తూ క్యూ లైన్‌లో చెప్పులు పెట్టి ఎదురుచూస్తున్నారు. రోజులు తరపడుతున్న తమకు యూరియా లభించడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భైంసా, తానూర్, ముధోల్, ఇచ్చోడ, సిర్పూర్, చింతలమానేపల్లి, కాగజ్ నగర్, కౌటాల, కడెం, చెన్నూర్ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా యూరియా కొరత ఉంది. రైతన్నలు ఈ ఊరి ఆ కోసం ఉదయం వేకువజామునే లేచి క్యూ లైన్ లో తమ చెప్పులను పెట్టి గంటల తరబడి సాయంత్రం వరకు ఎదురు చూస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా రైతులు పత్తి, కంది, వరి, మొక్కజొన్న తదితర పంటలు అధికంగా సాగు చేస్తున్నారు. జూన్ నెలలో విత్తనాలు విత్తుకొని, పంట సాగు చేసి.. పంట ఎదుగుదల సమయంలోనే యూరియా కొరత తీవ్రంగా ఏర్పడింది. పంట ఎదుగుదల సమయంలోనే ఇలా యూరియా కోసం రైతన్నలు నానా రకాల తిప్పలు పడుతున్నారు. ఒక్క ఆధార్ కార్డుపై ఒక్కో రైతుకు మూడు నుంచి ఐదు బస్తాల మాత్రమే ఇస్తున్నారు. మార్క్‌ఫెడ్ గోదాముల్లో, పీఏసీఎస్ కార్యాలయాల్లో గంటల తరబడి ఎదురు చూడడంతోపాటు రోజులు గడుస్తున్న యూరియా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో యూరియా లభించకపోవడంతో దానికి బదులుగా ఇతర వేరే మందులను వాడుతున్నారని పలువురు రైతులు ఏబిపీ దేశంతో తెలిపారు. మరికొందరు రైతులు ఇతరుల వద్ద యూరియా అప్పు తీసుకొని వేసుకున్నారని వారికి బదులుగా యూరియాను ఇవ్వడం కోసం నానా రకాల పాట్లు పడుతున్నామన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 15 లక్షల ఎకరాలలో రైతులు వివిధ రకాల పంటలను సాగు చేస్తుంటారు. 8 నుంచి 9 లక్షల ఎకరాలలో పత్తి అంతర పంటగా కందిని సాగు చేస్తుంటారు. 4 లక్షల ఎకరాల వరకు సోయా పంట సాగు చేస్తుంటారు. సుమారు 2లక్షల ఎకరాల వరకు వరి పంట సాగు చేస్తుంటారు. 50 నుంచి 70 వేల ఎకరాల వరకు మొక్కజొన్న పంట సాగు చేస్తుంటారు. ఇటీవల కాలంలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం అధికంగా పెరిగింది. కాబట్టి ఈ పంటలన్నిటికీ కూడా యూరియా కచ్చితంగా అవసరం. ఈ పంటల ఎదుగుదలకు యూరియా ఎంతో ఉపయోగపడుతుంది. నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ బైంసా ముధోల్ తానుర్ తదితర ప్రాంతాల్లో యూరియా కోసం రైతులు నానా ఇక్కట్లు పడుతున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో బోథ్, ఇచ్చోడ, బేల, తలమడుగు, ఆదిలాబాద్ రూరల్, గుడిహాత్నూర్ తదితర ప్రాంతాల్లో రైతుల పరిస్థితి అదే విధంగా ఉంది. క్యూలో నిలబడి వారం రోజులపాటు వేచి చూడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల బెజ్జూర్, చింతలమానేపల్లి, సిర్పూర్, జైనూర్, కెరామెరి మండలాల్లోని తదితర ప్రాంతాల్లోను యూరియా ఇక్కట్లు ఎదురయ్యాయి. రైతులు యూరియా దొరక్క పడుతున్న ఇబ్బందులను చూసి సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి తమ ప్రాంతాల్లో రైతులతో కలిసి ధర్నాలు చేపట్టారు. కాగజ్‌నగర్‌లో రైతులతో కలిసి ధర్నా చేస్తున్న ఎమ్మెల్యే హరీష్ బాబు అరెస్టుకావడం చర్చనీయాంశంగా మారింది.

మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్, కోటపల్లి, జైపూర్, లక్షేట్టిపేట తదితర ప్రాంతాల్లోనూ యూరియా కొరత అధికంగా ఉంది. ముఖ్యంగా చెన్నూరులో అధికమవుతాదులో యూరియా కోసం రైతులు రోజుల తరబడి ఎదురుచూస్తున్నారు. మంత్రి వివేక్ ఇలాఖలోనే యూరియా దొరకకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యలయంతో పాటు, మార్క్‌ఫెడ్‌ల ముందు రైతులు ఉదయం వేకువ జామున నుంచి క్యూ కడుతున్నారు. చెన్నూరులో యూరియా కోసం రైతులు వరుసలో నిల్చోవడానికి బదులు చెప్పులను వరుసలో పెట్టి ఉంచడం ఇటీవల సోషల్ మీడియాలోనూ చాలా వైరల్ అయింది. రైతులకు యూరియా దొరకడం లేదంటూ ఆందోళన కొనసాగుతున్నాయి. గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా యూరియా కోసం రైతులు నానా రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. యూరియా దొరకడం లేదంటూ ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి.

పంట సాగుకు యూరియా లేకపోతే తమ పంటలు ఎలా పండేది.. తాము కష్టపడ్డ ఫలానికి ఫలితం ఎలా దక్కేది.. అంటూ రైతులు కుదేలవుతున్నారు. ప్రభుత్వం సకాలంలో రైతులకు యూరియా అందే విధంగా కృషి చేయాలని రైతులు కోరుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న నిర్లక్ష్యం వల్లే యూరియా సకాలంలో అందడం లేదని ఇప్పటికైనా రైతుల కష్టాలను తెలుసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో యూరియాను అందించే దిశగా కృషి చేయాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగేపు బొర్రన్న డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది రైతులు యూరియా కోసం పడుతున్న కష్టాలను చూడలేకపోతున్నామని, రైతులు ఎంతో కష్టపడి పండించిన తమ పంటలను దక్కించుకోవాలంటే యూరియా అవసరమన్నారు. పంట ఎదుగుదల దశలో ఉందని ఎదుగుదలకు తోడ్పాటు అందించే యూరియా డిఎపి తదితర మందులను రైతన్న వినియోగించాలి. ప్రస్తుతం పంట ఎదుగుదల దశలో ఉన్నది. ఈ పంటలకు యూరియా వేస్తేనే అవి కాండం ఎదుగుదల తో పాటు దిగుబడి వచ్చే దిశగా కృషి చేస్తుందని, రైతుల ఇబ్బందులను ప్రభుత్వం తెలుసుకొని సకాలంలో యూనియన్ అందించాలని డిమాండ్ చేశారు.






















